సార్వత్రిక ఎన్నికల ముంగిట కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ రాజీనామా నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్‌పై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎలక్షన్ కమిషన్ బీజేపీ శాఖలా మారిందని ఆరోపించారు.
ముంబైలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల సంఘాన్ని బీజేపీ ప్రైవేటీకరించిందని మండిపడ్డారు. ’ఎలక్షన్ కమిషన్ బీజేపీ శాఖలా మారింది. టీఎన్ శేషన్ (మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్) హయాంలో ఉన్నట్టుగా వ్యవస్థ ఇప్పుడు లేదు. విశ్వసనీయమైన నియంత్రణ సంస్థగా ఉండే ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు విశ్వసనీయతను కోల్పోయింది. గత పదేళ్లలో ఎలక్షన్ కమిషన్ ప్రైవేటీకరించారు’ అన్నారు.
ఎలక్షన్ కమిషన్ తీరును విమర్శిస్తూ ‘ఈ రోజుల్లో ఎలక్షన్ కమిషన్ ఎలా పని చేస్తోందో శివసేన (యూబీటీ), ఎన్‌సీపీ అనుభవించాయి. ఎన్‌సీపీ పార్టీని, ఎన్నికల గుర్తును అనర్హులకు అప్పగించారు.మనకు తెలిసిన ఎన్నికల కమిషన్ ఎప్పుడో చచ్చిపోయింది’ అన్నారు.
ఎన్‌సీపీలో ఇటీవల చీలిక వచ్చింది. అజిత్ పవార్ వర్గానికే పార్టీ ఎన్నికల గుర్తు అయిన గడియారం గుర్తను ఎలక్షన్ కమిషన్ కేటాయించింది. పార్టీ చీలిక తర్వాత అజిత్ పవార్ మహారాష్ట్ర డిప్యటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇది శరత్ పవార్ వర్గానికి శరాఘాతంగా మారింది. ఇక శివసేన విషయంలోనూ తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే వర్గానికే పార్టీ అధికారిక బాణం, విల్లు ఎన్నికల గుర్తును ఎలక్షన్ కమిషన్ కేటాయించింది. దీంతో ఉద్దవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) కాగడా గుర్తును వినియోగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment