shivsena mp
-
‘ఎలక్షన్ కమిషన్ ప్రైవేటీకరణ’.. శివసేన ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు
సార్వత్రిక ఎన్నికల ముంగిట కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ రాజీనామా నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్‌పై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎలక్షన్ కమిషన్ బీజేపీ శాఖలా మారిందని ఆరోపించారు. ముంబైలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల సంఘాన్ని బీజేపీ ప్రైవేటీకరించిందని మండిపడ్డారు. ’ఎలక్షన్ కమిషన్ బీజేపీ శాఖలా మారింది. టీఎన్ శేషన్ (మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్) హయాంలో ఉన్నట్టుగా వ్యవస్థ ఇప్పుడు లేదు. విశ్వసనీయమైన నియంత్రణ సంస్థగా ఉండే ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు విశ్వసనీయతను కోల్పోయింది. గత పదేళ్లలో ఎలక్షన్ కమిషన్ ప్రైవేటీకరించారు’ అన్నారు. ఎలక్షన్ కమిషన్ తీరును విమర్శిస్తూ ‘ఈ రోజుల్లో ఎలక్షన్ కమిషన్ ఎలా పని చేస్తోందో శివసేన (యూబీటీ), ఎన్సీపీ అనుభవించాయి. ఎన్సీపీ పార్టీని, ఎన్నికల గుర్తును అనర్హులకు అప్పగించారు.మనకు తెలిసిన ఎన్నికల కమిషన్ ఎప్పుడో చచ్చిపోయింది’ అన్నారు. ఎన్సీపీలో ఇటీవల చీలిక వచ్చింది. అజిత్ పవార్ వర్గానికే పార్టీ ఎన్నికల గుర్తు అయిన గడియారం గుర్తను ఎలక్షన్ కమిషన్ కేటాయించింది. పార్టీ చీలిక తర్వాత అజిత్ పవార్ మహారాష్ట్ర డిప్యటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇది శరత్ పవార్ వర్గానికి శరాఘాతంగా మారింది. ఇక శివసేన విషయంలోనూ తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే వర్గానికే పార్టీ అధికారిక బాణం, విల్లు ఎన్నికల గుర్తును ఎలక్షన్ కమిషన్ కేటాయించింది. దీంతో ఉద్దవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) కాగడా గుర్తును వినియోగిస్తోంది. -
పాలిటిక్స్‌లో మరో సంచలనం.. ముంబై వేదికగా సీఎంల మీటింగ్.!
సాక్షి, ముంబై: దేశంలో పాలిటిక్స్ మరోసారి వేడెక్కాయి. ప్రస్తుతం దేశం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు త్వరలో ముంబై వేదిక కానుంది. బీజేపీయేతర ముఖ్యమంత్రుల సమావేశం ముంబైలో జరుగుతుందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆదివారం తెలిపారు. ఈ సందర్బంగా సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులతోపాటు ద్రవ్యోల్బణం, మత విద్వేషాలు, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం వంటి అంశాలపై చర్చ జరుగుతుందని చెప్పారు. కాగా, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ సమావేశానికి సంబంధించి బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాసినట్టు తెలిపారు. మమతా బెనర్జీ లేఖపై సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవారు చర్చించారని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉండగా.. దేశంలో పలు చోట్ల జరుగుతున్న మత ఘర్షణలు, విద్వేష ప్రసంగాలపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడి మాట్లాడాలని 13 విపక్ష పార్టీల నేతలు శనివారం లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీయేతర రాష్ట్రాల సీఎం సమావేశం జరుగనుండటం దేశంలో హాట్ టాపిక్‌గా మారింది. హిందూ ఒవైసీ.. మరోవైపు.. మహారాష్ట్రలో పరిస్థితులపై సంజయ్ రౌత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రేపై సంజయ్ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఠాజ్ ఠాక్రే ‘హిందూ ఒవైసీ’ అని, ఎంఎన్ఎస్ ‘హిందుత్వ మజ్లిస్ పార్టీ’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే రాజ్ థాక్రే.. బీజేపీ అండతోనే ఇలాంటి కొన్ని విషయాలను వివాదాస్పదం చేస్తున్నారని అన్నారు. ఇది చదవండి: శ్రీరాముడి ఆలోచనకే అది వ్యతిరేకం.. -
ఆమె పులిలా పోరాడింది
ముంబై: పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ పులిలా పోరాడిందని, ఆమె విజేతగా అవతరించడం ఖాయమని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. గురువారం ముంబైలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఇప్పుడు జరగబోయే కేరళ, తమిళనాడు, అస్సాం, బెంగాల్ (నాలుగు రాష్ట్రాల) ఎన్నికలు జాతీయ రాజకీయాలను నిర్ణయిస్తాయని ఎంపీ అభిప్రాయపడ్డారు. ప్రధానంగా అస్సాం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు ముఖ్యపాత్ర పోషిస్తాయని అన్నారు. అస్సాంలో బీజేపీ అధికారంలో ఉందని, అయితే కాంగ్రెస్ గట్టిగా పోరాటం చేసిందని ప్రశంసించారు. మమతా బెనర్జీ లేఖపై మీడియా ప్రశ్నించినపుడు సీఎం ఉద్ధవ్‌కు కూడా లేఖ వచ్చిందని, ఎన్నికల తర్వాత పొత్తులపై చర్చించే అవకాశం ఉందన్నారు. ఇక పశ్చిమబెంగాల్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు నిజమైన మహాభారతం కంటే భయంకరంగా ఉన్నాయని రౌత్ ఆందోళన వ్యక్తంచేశారు. బెంగాల్ ఎన్నికలను దేశం మొత్తం పరిశీలిస్తోందని, ప్రజలు కూడా తెలివైనవారేనని ఎంపీ వ్యాఖ్యానించారు. ఇక ఇటీవల సంజయ్‌పై బాలాసాహెబ్ థోరాట్ చేసిన విమర్శలపై స్పందిస్తూ.. యూపీఏ నాయకత్వాన్ని సోనియా నుంచి శరద్ పవార్‌కు అప్పగించాలని అనలేదని, కేవలం యూపీఏను గాడిలో పెట్టాలనే వ్యాఖ్యానించానని ఎంపీ స్పష్టంచేశారు. -
‘ఆ విషయం వెల్లడించకుండా ఉండాల్సింది’
సాక్షి,ముంబయిః తన కుమార్తె సుప్రియా సూలేకు ప్రధాని కేబినెట్ బెర్త్ ఆఫర్ చేశారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తనతో చెప్పిన విషయం బహిర్గతం చేయకుండా ఉండాల్సిందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. పార్టీ పత్రిక సామ్నాలో పవార్‌తో జరిగిన ప్రయివేటు సంభాషణ గురించి రాయకుండా ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. ‘సామ్నాలో ప్రచురితమైన వ్యాసంలో పవార్‌కూ, తనకూ మధ్య జరిగిన సంభాషణను ప్రస్తావించకుండా ఉండాల్సింది...ఇది పూర్తిగా ప్రైవేట్ సంభాషణ’ అని రౌత్ అన్నారు. ‘దేశ రాజకీయాల్లో ఎవరూ ఎవరికీ శత్రువులు కాదు...మేము సిద్ధాంతపరంగానే శత్రువులం..కేంద్ర కేబినెట్లో సూలేకు మోదీ మంత్రి పదవి ఆఫర్ చేస్తే దాన్నిరాజకీయ కిచిడిగా భావించడం సరికాద’న్నారు. ప్రధాని గురించి ప్రస్తావన ఉన్నందున ఈ చర్చ ప్రచురితం కాకుండా ఉంటే బాగుండేదని పవార్ అభిప్రాయపడ్డారని రౌత్ చెప్పారు. -
ఆ ఎంపీ మళ్లీ విమానమెక్కారు!
ఎయిరిండియా ఉద్యోగి సుకుమార్‌ను చెప్పుతో కొట్టి.. దేశవ్యాప్తంగా విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం ఎదుర్కొన్న శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్.. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఎయిరిండియా విమానం ఎక్కారు. అది కూడా హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే విమానం ఎక్కారు. అంతకుముందు ఆయన ఎయిరిండియా, ఇతర విమానయాన సంస్థలలోను ఎన్నిసార్లు టికెట్లు బుక్ చేసుకున్నా అవన్నీ ఎప్పటికప్పుడు రద్దయిపోయేవి. కానీ కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆయనను విమానం ఎక్కించుకోవాలని చెప్పడంతో ఎయిరిండియా సహా అన్ని సంస్థలూ సరేనన్నాయి. ఆ తర్వాత తొలిసారిగా ఆయన గురువారమే విమానం ఎక్కారు. ప్రయాణికులు దురుసుగా ప్రవర్తించడం వల్ల విమానాలు ఆలస్యమైతే వాళ్లకు రూ. 15 లక్షల వరకు జరిమానా విధించాలని ఎయిరిండియా ఇటీవల నిర్ణయించింది. -
విమానం వద్దని.. రైల్లోనే వెళ్లిన ఎంపీ
తాను విమానాలలో ఎక్కకుండా విధించిన నిషేధాన్ని విమానయాన సంస్థలు ఎత్తేసినా, ఉస్మానాబాద్ ఎంపీ రవీంద్ర గైక్వాడ్ మాత్రం విమానం కాకుండా రైల్లోనే ప్రయాణిస్తున్నారు. తాజాగా ఆయన ముంబై నుంచి ఢిల్లీ వెళ్లేందుకు విమానం కాకుండా రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలే ఎక్కారట. ఆయన ఆ రైలును ముంబై సెంట్రల్ స్టేషన్లో ఎక్కారో లేదా బోరివాలిలో ఎక్కారో తనకు తెలియదు గానీ, రైల్లోనే ఢిల్లీ వెళ్లారని.. పార్లమెంటు సమావేశాలు ముగిసేవరకు ఢిల్లీలోనే ఉంటారని ఎంపీ సన్నిహిత సహచరుడైన జితేంద్ర షిండే మీడియాకు చెప్పారు. పార్లమెంటులో తీవ్ర గందరగళం అనంతరం పౌర విమానయాన మంత్రిత్వశాఖ గైక్వాడ్ మీద నిషేధాన్ని ఎత్తేయాల్సిందిగా ఎయిరిండియాకు సూచించింది. దాంతో ఎయిరిండియాతో పాటు ఇతర ప్రైవేటు విమానయాన సంస్థలు సైతం ఆయనను తమ విమానాల్లోకి ఎక్కించుకోడానికి అభ్యంతరం ఏమీ లేదంటూ నిషేధాన్ని ఎత్తేశాయి. అయితే, ఆయన ముందుగానే రైల్లో టికెట్ రిజర్వు చేసుకున్నారని, ఆయనతో పాటు నలుగురైదుగురు సహాయకులు కూడా ఉన్నారని షిండే చెప్పారు. విమాన ప్రయాణంలో జరిగిన గొడవ మొత్తం ఇప్పుడు సర్దుమణిగిందని, ఆ గొడవ కారణంగా ఆయనేమీ విమాన ప్రయాణం మానుకోవడం లేదని అన్నారు. పుణె నుంచి గానీ, ముంబై నుంచి గానీ గైక్వాడ్ ఢిల్లీ వెళ్లే విమానాలు ఏవీ ఎక్కలేదని ఎయిరిండియా వర్గాలు కూడా నిర్ధారించాయి. -
ప్రైవేటు విమానాల్లో కూడా..
శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ మీద నిషేధాన్ని ఎయిరిండియా ఎత్తేయడంతో.. ప్రైవేటు విమానయాన సంస్థలు సైతం అదే బాటలో నడిచాయి. కావాలనుకుంటే తమ విమానాల్లో కూడా గైక్వాడ్ ప్రయాణం చేయొచ్చని తెలిపాయి. ఎంపీ చేసిన ప్రకటనతో సంతృప్తి చెందిన తర్వాత ఎయిర్ ఇండియా సంస్థ ఆయనను అనుమతించాలని నిర్ణయించడంతో, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో సభ్యత్వం ఉన్న విమానయాన సంస్థలు అన్నీ గైక్వాడ్‌ను తమ విమానాల్లో అనుమతించాలని నిర్ణయించినట్లు ఎఫ్ఐఏ డైరెక్టర్ ఉజ్వల్ డే తెలిపారు. అయితే, ఇదే సందర్భంలో తమ సిబ్బంది, ఆస్తులకు తగిన రక్షణ ఇవ్వాలని, వాళ్లు ప్రతిరోజూ ఎంతగానో కష్టపడుతున్నందున ఆ కష్టానికి తగిన గౌరవం ఇవ్వాలని.. ఆ మేరకు హామీ వచ్చిన తర్వాతే ఆయనకు విమాన ప్రయాణం చేసే అవకాశం ఇస్తున్నామని డే చెప్పారు. ఇండిగో, స్పైస్ జెట్, గోఎయిర్, టాటా గ్రూపు ఎయిర్‌లైన్స్, విస్తారా, ఎయిర్ఏషియా ఇండియా తదితర సంస్థలకు ఎఫ్ఐఏలో సభ్యత్వం ఉంది. ఇవన్నీ కూడా మార్చి 24వ తేదీ నుంచి గైక్వాడ్‌ను తమ విమానాల్లో ఎక్కించుకునేది లేదంటూ నిషేధం విధించాయి. ఢిల్లీ విమానాశ్రయంలో దాదాపు 60 ఏళ్ల వయసున్న ఎయిరిండియా అధికారి ఒకరిని గైక్వాడ్ చెప్పుతో కొట్టి విమానం మెట్ల మీద నుంచి కిందకు తోసేందుకు ప్రయత్పినంచడంతో విమానయాన సంస్థలన్నీ ఆయనను నిషేధించాయి. ఆ తర్వాతి నుంచి ఎయిరిండియా సహా పలు సంస్థల విమానాలు ఎక్కడానికి గైక్వాడ్పలు రకాలుగా ప్రయత్నించారు గానీ, ప్రతిసారీ ఆయన టికెట్లు రద్దవుతూనే వచ్చాయి. రెండు వారాల పాటు నిషేధం విధించిన తర్వాత ప్రభుత్వ సూచన మేరకు ఆ నిషేధాన్ని ఎత్తేశాయి. రవీంద్ర గైక్వాడ్ క్షమాపణలు తెలిపారని, ఆయన ఇక మీదట సత్ప్రవర్తన కలిగి ఉంటానని హామీ కూడా ఇచ్చారని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా సిబ్బందితోను, ఇతర ప్రయాణికులతోను అగౌరవంగా ప్రవర్తించే వ్యక్తులతో కూడిన ఒక ‘నో ఫ్లై జాబితా’ను సిద్ధం చేయాలని విమానయాన మంత్రిత్వశాఖ భావిస్తోంది. ఈ మేరకు వచ్చేవారం ఒక ముసాయిదా సిద్ధం చేసి ప్రజల నుంచి కూడా దానిపై స్పందనలు తీసుకుంటారు. -
నేను సారీ చెప్పను గాక చెప్పను: ఎంపీ
కుక్కతోక వంకర.. ఎంత తీసినా రాదు అంటారు పెద్దలు. ఇప్పటికి దాదాపు ఏడెనిమిది సార్లు విమానం టికెట్లు రద్దు చేసినా ఇప్పటికీ శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌కు మాత్రం బుద్ధి మార లేదు. తాను చెప్పుతో కొట్టిన ఎయిరిండియా మేనేజర్ సుకుమార్‌కు క్షమాపణ చెప్పేది లేదని, పార్లమెంటుకు మాత్రం క్షమాపణ చెబుతానని అంటున్నారు. అంతేకాదు, తనను అవమానించిన సుకుమార్ పిచ్చోడని, అతడి మీద ఇలాంటì వి దాదాపు ఎనిమిది కేసులు నమోదై ఉన్నాయని అన్నారు. ఎయిరిండియా ఉద్యోగే ముందుగా తనతో గొడవ పడ్డాడని, అలాంటప్పుడు తాను ఎందుకు క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు. తన చర్యల వల్ల పార్లమెంటు గౌరవానికి భంగం కలిగినట్లయితే పార్లమెంటుకు మాత్రమే క్షమాపణ చెబుతానన్నారు. తన మీద విధించిన ఫ్లయింగ్ బ్యాన్‌కు కూడా అర్థం లేదని, ఎందుకంటే విమానయాన సంస్థలకు ఏ ప్రయాణికుడినీ నిషేధించే హక్కు లేదని కూడా రవీంద్ర గైక్వాడ్ అన్నారు. తాను చెప్పిన విషయాలను ఎవరూ పట్టించుకోలేదని, ఒక ప్రజాప్రతినిధి విషయంలోనే ఎయిరిండియా ఇలా ప్రవర్తిస్తే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. పౌర విమానయాన మంత్రి అశోక గజపతి రాజు నుంచి విజ్ఞప్తి అందడంతో ఎయిరిండియా రవీంద్ర గైక్వాడ్ మీద నిషేధం ఎత్తేసిన విషయం తెలిసిందే. ఇంతకుముందు ఎయిరిండియాతో పాటు ఆరు ప్రైవేటు విమానయాన సంస్థలు కూడా రవీంద్ర గైక్వాడ్ మీద నిషేధం విధించిన విషయం తెలిసిందే. -
క్షమాపణలు ఎవరు అడిగారు?
ఆయన ఎయిరిండియా ఉద్యోగి. వయసు దాదాపు 60 ఏళ్లు ఉంటాయి. అలాంటి వ్యక్తి పొరపాటున ఏదైనా మాట అన్నా.. మహా అయితే గట్టిగా మందలించొచ్చు. అంతేగానీ ఏకంగా 25 సార్లు చెప్పుతో కొడతారా? అలా కొట్టింది కూడా ఎవరో ఊరూ పేరూ లేని వ్యక్తి కాదు. లోక్‌సభ సభ్యుడు. తాను రాజకీయ నాయకుడిని అన్న గర్వమో ఏమో గానీ, శివసేన ఎంపీ రవీంద్ర విశ్వనాథ్ గైక్వాడ్ ఎయిరిండియాలో పనిచేసే సుకుమార్ అనే మేనేజర్‌ను చెప్పుతో కొట్టారు. తాను 25 సార్లు అతడిని కొట్టినట్లు మర్నాడు చెప్పారు కూడా. దాంతో ఒక్క ఎయిరిండియా మాత్రమే కాదు.. దాదాపు అన్ని విమానయాన సంస్థలూ ఆయనను బహిష్కరించాయి. తమ విమానాల్లో ఎక్కడానికి వీల్లేదంటూ ఆయన బుక్ చేసుకున్న ప్రతిసారీ టికెట్లు రద్దు చేసేశాయి. దాంతో ఒకసారి కారులో, మరోసారి రైల్లో ఇంకోసారి ఏకంగా చార్టర్డ్ విమానంలో ఆయన ప్రయాణించారు. అంతవరకు బాగానే ఉంది గానీ, లోక్‌సభలో ఈ అంశాన్ని ప్రస్తావించినప్పుడు.. కావాలంటే పార్లమెంటుకు తాను క్షమాపణ చెబుతాను గానీ ఎయిరిండియాకు మాత్రం చెప్పబోనని అన్నారు. అసలు ఎయిరిండియానే కాదు, ఏ విమానయాన సంస్థ కూడా రవీంద్ర గైక్వాడ్‌ను క్షమాపణలు అడగనే లేదు. ఒకవేళ ఆయన క్షమాపణ చెబితే తాము మళ్లీ ఆయనను విమానం ఎక్కించుకోవాల్సి ఉంటుందని, అందువల్ల అసలు సారీ చెప్పనక్కర్లేదని కూడా ఎయిరిండియా ఉద్యోగులు స్పష్టం చేశారు. కేవలం ముంబై, ఢిల్లీలలోనే కాకుండా హైదరాబాద్ నుంచి బుక్ చేసుకున్న టికెట్లను కూడా రద్దు చేసిన ఎయిరిండియా.. అసలు తమ విమానాల్లో ఎక్కడా గైక్వాడ్‌ను ఎక్కించుకునేది లేదని స్పష్టం చేసింది. విమానయాన సంస్థల నియమ నిబంధనలలోనే ఇబ్బందికరంగా ప్రవర్తించే ప్రయాణికులను ఎక్కించుకోకుండా వాళ్లను నిరాకరించే అవకాశం తమకు ఉంటుందని స్పష్టం చేస్తారు. తోటి ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించేవారిని, సిబ్బంది పట్ల అనుచిత ప్రవర్తన కలిగి ఉండేవారిని చేతులకు బేడీలు వేసి బంధించే అధికారం కూడా విమానాల్లోని సిబ్బందికి ఉంటుంది. అలాంటప్పుడు తనను ఎక్కించుకున్నారా సరే.. లేకపోతే అసలు ముంబై నుంచి ఎయిరిండియా విమానాలు ఎలా ఎగురుతాయో చూస్తా అంటూ రౌడీలా బెదిరించడం ఎంతవరకు సబబు? అంతేకాదు, పౌర విమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజును లోక్‌సభలో చుట్టుముట్టారు కూడా. అది కూడా స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను వాయిదా వేసిన తర్వాత!! ఇలాంటి చర్యల ద్వారా శివసేన ఎంపీలు.. ముఖ్యంగా రవీంద్ర గైక్వాడ్ ఏం చెప్పాలనుకుంటున్నారో ఆయనకే తెలియాలి! -
ఆ ఎంపీకి మళ్లీ రైలే గతి
ఎయిరిండియా విమానంలో వెళ్లాలని ఎంతలా ప్రయత్నించినా శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ పాచికలు పారలేదు. చివరకు ఆయన రైల్లోనే వెళ్లాల్సి వచ్చింది. ముంబై నుంచి బుక్ చేసుకున్న టికెట్‌తో పాటు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బుక్ చేసుకున్న విమానం టికెట్‌ను కూడా ఎయిరిండియా రద్దు చేసేసింది. దాంతో ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కి ఢిల్లీ వెళ్లారు. విమానం ఎక్కనివ్వకపోవడం సరికాదని, ఇలా ఒక ప్రయాణికుడిని.. అందునా ఎంపీని నిషేధించడం తగదని పార్లమెంటులో ఎన్ని చర్చలు జరిగినా ఎయిరిండియా మాత్రం ససేమిరా అంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రవీంద్ర గైక్వాడ్‌ను తమ విమానాల్లో ఎక్కించుకునేది లేదని పట్టుబట్టింది. దాంతో.. ఆయన రాజధాని ఎక్స్‌ప్రెస్‌లోని ఏసీ స్లీపర్ బోగీలో టికెట్ బుక్ చేసుకుని ముంబై నుంచి ఢిల్లీ వెళ్లారు. ఆ రైలు ముంబైలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు బయల్దేరి ఢిల్లీకి బుధవారం ఉదయం 8.30 గంటలకు చేరుకుంటుంది. గడిచిన నాలుగు రోజుల్లో రవీంద్ర గైక్వాడ్ ఇలా రైల్లో వెళ్లడం ఇది రెండోసారి. ఎయిరిండియా మేనేజర్ సుకుమార్ (60)ని 25 సార్లు చెప్పుతో కొట్టడంతో పాటు మెట్ల మీద నుంచి కిందకు తోసేయడంతో ఎయిరిండియా వర్గాలు గైక్వాడ్ మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. ఒక ప్రయాణికుడిని ఎక్కించుకోవాలా వద్దా అనే విషయంలో ఎయిరిండియాదే పూర్తి నిర్ణయాధికారమని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు పార్లమెంటులో చెప్పారు. తనకు ఓపెన్ బిజినెస్ క్లాస్ టికెట్ ఉన్నా, ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించాల్సి రావడమే ఎంపీ ఆగ్రహానికి కారణమని తెలిసింది. ఎంపీకి జరిగిన అవమానానికి నిరసనగా శివసేన సోమవారం నాడు ఉస్మానాబాద్‌లో బంద్ నిర్వహించింది. -
చెప్పుతో కొట్టినా.. విమానం ఎక్కచ్చు!
విధి నిర్వహణలో ఉన్న ఎయిర్ ఇండియా మేనేజర్‌ను 25 సార్లు చెప్పుతో కొట్టిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ మళ్లీ విమానాలు ఎక్కేయొచ్చట. పలు విమానయాన సంస్థలు ఆయనను ఎక్కించుకోడానికి నిరాకరించి, అప్రకటిత నిషేధం విధించడంతో పార్టీలతో సంబంధం లేకుండా చాలా మంది ఎంపీలు ఆయనను వెనకేసుకొచ్చారు. దాంతో ఆయనను మళ్లీ విమానాలు ఎక్కించుకునే పరిస్థితి దాదాపు వచ్చేసింది. ఇందుకోసం ఏకంగా కొన్ని నిబంధనలు కూడా మార్చేస్తారట. ఢిల్లీ నుంచి ముంబై వెళ్లాలనుకున్న గైక్వాడ్ (57)ను ఏకంగా ఆరు విమానయాన సంస్థలు తమ విమానాల్లో ఎక్కించుకునేది లేదంటూ ఆయన టికెట్లు రద్దు చేసేశాయి. దాంతో ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో రైల్లో వెళ్లాల్సి వచ్చింది. సుకుమార్ అనే 60 ఏళ్ల మేనేజర్‌ను మెట్ల మీద నుంచి తోసేసి, చెప్పుతో కొట్టడాన్ని చాలా గర్వంగా చెప్పుకొన్న గైక్వాడ్ క్షమాపణలు చెబుతామన్నా కూడా తమకు అవసరం లేదని విమానయాన సంస్థలు గట్టిగా చెప్పాయి. ప్రయాణికులు, సిబ్బంది భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని ప్రభుత్వం చెప్పినా, చివరకు అన్ని పార్టీలకు చెందిన ఎంపీలు బలవంతం చేయడంతో కొన్ని నిబంధనలను మార్చేందుకు ఒప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. 'ఎంపీలు కూడా ఇలా దొరికేస్తారని నేను కలలో కూడా అనుకోలేదు' అంటూ పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు లోక్‌సభలో వ్యాఖ్యానించారు. అయితే, పార్లమెంటు సభ్యుడు ప్రతిసారీ పార్లమెంటుకు రావడానికి రైలు ఎక్కాలంటే కష్టంగా ఉంటుందని, అందువల్ల దీనిపై మరోసారి ఆలోచించాలని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సూచించారు. దీనిపై ఆమె మంత్రి అశోక్, శివసేన ఎంపీలతో 45 నిమిషాల పాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రవీంద్ర గైక్వాడ్ చేసింది తప్పేనని శివసేన కూడా ఒప్పుకొంది గానీ, విమానాల్లో ఎక్కకుండా నిషేధించడం మరీ తీవ్రమైన నిర్ణయమంది. చివరకు శివసేన ఒత్తిడికి తలొగ్గిన సర్కారు.. ఎంపీని విమానాల్లో ఎక్కించుకునేందుకు వీలుగా సంబంధిత నియమ నిబంధనలను మారుస్తోంది. -
ఆ ఎంపీకి ఇక రైలు లేదా బస్సే గతి!
-
ఆ ఎంపీకి ఇక రైలు లేదా బస్సే గతి!
ఎయిరిండియా విమానంలో ప్రయాణిస్తూ.. కేబిన్ సిబ్బందిలో ఒకరిని 25 సార్లు చెప్పుతో కొట్టిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌ను వరుసపెట్టి విమానయాన సంస్థలన్నీ బహిష్కరిస్తున్నాయి. ఆయనను తమ విమానాల్లో ఇక ఎక్కించుకునేది లేదని ఇప్పటికే పలు సంస్థలు ప్రకటించాయి. సంఘటన జరిగిన ఎయిరిండియాతో పాటు విస్తారా, ఇండిగో, జెట్ ఎయిర్వేస్, స్పైస్ జెట్, గో ఎయిర్ లాంటి సంస్థలు ఆయనను తమ విమానాల్లో ఎక్కించుకునేది లేదని స్పష్టం చేశాయి. ఆయన నుంచి తాము క్షమాపణలు కోరేది లేదని.. అలా చేస్తే ఆయనను మళ్లీ విమానాల్లోకి అనుమతించాల్సి వస్తుందని ఎఫ్ఐఏ తెలిపింది. శుక్రవారం సాయంత్రం 4.30 గంటల విమానానికి గైక్వాడ్ బుక్ చేసుకున్న టికెట్‌ను ఎయిరిండియా రద్దుచేసింది. దాంతో ఆయన సాయంత్రం 5.50 గంటలకు ఇండిగో విమానంలో టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే.. ఇండిగో కూడా ఆయన టికెట్‌ను రద్దుచేసి, చార్జీలను తిరిగి ఇచ్చేసింది. దాంతో ఇప్పుడు ఆయన రైలు లేదా బస్సు ఎక్కాల్సిందేనని.. కాదంటే సొంతంగా ప్రైవేటు విమానం బుక్ చేసుకోవాలని చెబుతున్నారు. దాదాపుగా విమానయాన సంస్థలన్నీ కూడా రవీంద్ర గైక్వాడ్ తమ విమానాలలో ప్రయాణించేందుకు వీల్లేకుండా నిషేధం విధించడంతో మరికొన్ని సంస్థలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఎయిర్ ఏషియా లాంటి సంస్థలు కూడా తమకు సంఘీభావంగా ఉంటాయని భావిస్తున్నట్లు ఎయిరిండియా వర్గాలు తెలిపాయి. సుకుమార్ (60) అనే ఎయిరిండియా సిబ్బందిని 25 సార్లు చెప్పుతో కొట్టినట్లు స్వయంగా చెప్పిన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌పై రెండు ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు గైక్వాడ్ లాంటి వాళ్లకు విమానంలోనే బేడీలు వేసే అవకాశం కూడా ఉంది. కాకపోతే సరిగ్గా విమానం దిగే సమయంలో ఇది జరగడంతో అలా చేయలేదు. తమ సిబ్బందిలో ఎవరి మీద దాడి జరిగినా అది తామందరి మీద దాడిలాగే భావిస్తామని ఎయిరిండియా అధికారులు అంటున్నారు. ఇక మీదట కూడా ఇలా దురుసుగా ప్రవర్తించే ప్రయాణికుల జాబితాతో ఒక 'నో ఫ్లై' జాబితాను తయారుచేస్తామని, వాళ్లను విమానాల్లోకి అనుమతించబోమని అంటున్నారు. ప్రభుత్వం కూడా ఇలాంటి వాళ్లను నియంత్రించాలని కోరుతున్నారు.