‘ఆ విషయం వెల్లడించకుండా ఉండాల్సింది’
సాక్షి,ముంబయిః తన కుమార్తె సుప్రియా సూలేకు ప్రధాని కేబినెట్ బెర్త్ ఆఫర్ చేశారని ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ తనతో చెప్పిన విషయం బహిర్గతం చేయకుండా ఉండాల్సిందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. పార్టీ పత్రిక సామ్నాలో పవార్‌తో జరిగిన ప్రయివేటు సంభాషణ గురించి రాయకుండా ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. ‘సామ్నాలో ప్రచురితమైన వ్యాసంలో పవార్‌కూ, తనకూ మధ్య జరిగిన సంభాషణను ప్రస్తావించకుండా ఉండాల్సింది...ఇది పూర్తిగా ప్రైవేట్ సంభాషణ’ అని రౌత్ అన్నారు.
‘దేశ రాజకీయాల్లో ఎవరూ ఎవరికీ శత్రువులు కాదు...మేము సిద్ధాంతపరంగానే శత్రువులం..కేంద్ర కేబినెట్‌లో సూలేకు మోదీ మంత్రి పదవి ఆఫర్ చేస్తే దాన్నిరాజకీయ కిచిడిగా భావించడం సరికాద’న్నారు. ప్రధాని గురించి ప్రస్తావన ఉన్నందున ఈ చర్చ ప్రచురితం కాకుండా ఉంటే బాగుండేదని పవార్ అభిప్రాయపడ్డారని రౌత్ చెప్పారు.