క్షమాపణలు ఎవరు అడిగారు?
ఆయన ఎయిరిండియా ఉద్యోగి. వయసు దాదాపు 60 ఏళ్లు ఉంటాయి. అలాంటి వ్యక్తి పొరపాటున ఏదైనా మాట అన్నా.. మహా అయితే గట్టిగా మందలించొచ్చు. అంతేగానీ ఏకంగా 25 సార్లు చెప్పుతో కొడతారా? అలా కొట్టింది కూడా ఎవరో ఊరూ పేరూ లేని వ్యక్తి కాదు. లోక్‌సభ సభ్యుడు. తాను రాజకీయ నాయకుడిని అన్న గర్వమో ఏమో గానీ, శివసేన ఎంపీ రవీంద్ర విశ్వనాథ్ గైక్వాడ్ ఎయిరిండియాలో పనిచేసే సుకుమార్ అనే మేనేజర్‌ను చెప్పుతో కొట్టారు. తాను 25 సార్లు అతడిని కొట్టినట్లు మర్నాడు చెప్పారు కూడా. దాంతో ఒక్క ఎయిరిండియా మాత్రమే కాదు.. దాదాపు అన్ని విమానయాన సంస్థలూ ఆయనను బహిష్కరించాయి. తమ విమానాల్లో ఎక్కడానికి వీల్లేదంటూ ఆయన బుక్ చేసుకున్న ప్రతిసారీ టికెట్లు రద్దు చేసేశాయి. దాంతో ఒకసారి కారులో, మరోసారి రైల్లో ఇంకోసారి ఏకంగా చార్టర్డ్ విమానంలో ఆయన ప్రయాణించారు. అంతవరకు బాగానే ఉంది గానీ, లోక్‌సభలో ఈ అంశాన్ని ప్రస్తావించినప్పుడు.. కావాలంటే పార్లమెంటుకు తాను క్షమాపణ చెబుతాను గానీ ఎయిరిండియాకు మాత్రం చెప్పబోనని అన్నారు.
అసలు ఎయిరిండియానే కాదు, ఏ విమానయాన సంస్థ కూడా రవీంద్ర గైక్వాడ్‌ను క్షమాపణలు అడగనే లేదు. ఒకవేళ ఆయన క్షమాపణ చెబితే తాము మళ్లీ ఆయనను విమానం ఎక్కించుకోవాల్సి ఉంటుందని, అందువల్ల అసలు సారీ చెప్పనక్కర్లేదని కూడా ఎయిరిండియా ఉద్యోగులు స్పష్టం చేశారు. కేవలం ముంబై, ఢిల్లీలలోనే కాకుండా హైదరాబాద్ నుంచి బుక్ చేసుకున్న టికెట్లను కూడా రద్దు చేసిన ఎయిరిండియా.. అసలు తమ విమానాల్లో ఎక్కడా గైక్వాడ్‌ను ఎక్కించుకునేది లేదని స్పష్టం చేసింది. విమానయాన సంస్థల నియమ నిబంధనలలోనే ఇబ్బందికరంగా ప్రవర్తించే ప్రయాణికులను ఎక్కించుకోకుండా వాళ్లను నిరాకరించే అవకాశం తమకు ఉంటుందని స్పష్టం చేస్తారు.
తోటి ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించేవారిని, సిబ్బంది పట్ల అనుచిత ప్రవర్తన కలిగి ఉండేవారిని చేతులకు బేడీలు వేసి బంధించే అధికారం కూడా విమానాల్లోని సిబ్బందికి ఉంటుంది. అలాంటప్పుడు తనను ఎక్కించుకున్నారా సరే.. లేకపోతే అసలు ముంబై నుంచి ఎయిరిండియా విమానాలు ఎలా ఎగురుతాయో చూస్తా అంటూ రౌడీలా బెదిరించడం ఎంతవరకు సబబు? అంతేకాదు, పౌర విమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజును లోక్‌సభలో చుట్టుముట్టారు కూడా. అది కూడా స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను వాయిదా వేసిన తర్వాత!! ఇలాంటి చర్యల ద్వారా శివసేన ఎంపీలు.. ముఖ్యంగా రవీంద్ర గైక్వాడ్ ఏం చెప్పాలనుకుంటున్నారో ఆయనకే తెలియాలి!