చెప్పుతో కొట్టినా.. విమానం ఎక్కచ్చు! | ShivSena MP Ravindra Gaikwad May Soon Fly Again, Rules May Change | Sakshi
Sakshi News home page

చెప్పుతో కొట్టినా.. విమానం ఎక్కచ్చు!

Published Tue, Mar 28 2017 8:42 AM | Last Updated on Fri, Aug 17 2018 6:15 PM

చెప్పుతో కొట్టినా.. విమానం ఎక్కచ్చు! - Sakshi

చెప్పుతో కొట్టినా.. విమానం ఎక్కచ్చు!

విధి నిర్వహణలో ఉన్న ఎయిర్ ఇండియా మేనేజర్‌ను 25 సార్లు చెప్పుతో కొట్టిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ మళ్లీ విమానాలు ఎక్కేయొచ్చట. పలు విమానయాన సంస్థలు ఆయనను ఎక్కించుకోడానికి నిరాకరించి, అప్రకటిత నిషేధం విధించడంతో పార్టీలతో సంబంధం లేకుండా చాలా మంది ఎంపీలు ఆయనను వెనకేసుకొచ్చారు. దాంతో ఆయనను మళ్లీ విమానాలు ఎక్కించుకునే పరిస్థితి దాదాపు వచ్చేసింది. ఇందుకోసం ఏకంగా కొన్ని నిబంధనలు కూడా మార్చేస్తారట. ఢిల్లీ నుంచి ముంబై వెళ్లాలనుకున్న గైక్వాడ్ (57)ను ఏకంగా ఆరు విమానయాన సంస్థలు తమ విమానాల్లో ఎక్కించుకునేది లేదంటూ ఆయన టికెట్లు రద్దు చేసేశాయి. దాంతో ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో రైల్లో వెళ్లాల్సి వచ్చింది. సుకుమార్ అనే 60 ఏళ్ల మేనేజర్‌ను మెట్ల మీద నుంచి తోసేసి, చెప్పుతో కొట్టడాన్ని చాలా గర్వంగా చెప్పుకొన్న గైక్వాడ్‌ క్షమాపణలు చెబుతామన్నా కూడా తమకు అవసరం లేదని విమానయాన సంస్థలు గట్టిగా చెప్పాయి.

ప్రయాణికులు, సిబ్బంది భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని ప్రభుత్వం చెప్పినా, చివరకు అన్ని పార్టీలకు చెందిన ఎంపీలు బలవంతం చేయడంతో కొన్ని నిబంధనలను మార్చేందుకు ఒప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. 'ఎంపీలు కూడా ఇలా దొరికేస్తారని నేను కలలో కూడా అనుకోలేదు' అంటూ పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు లోక్‌సభలో వ్యాఖ్యానించారు. అయితే, పార్లమెంటు సభ్యుడు ప్రతిసారీ పార్లమెంటుకు రావడానికి రైలు ఎక్కాలంటే కష్టంగా ఉంటుందని, అందువల్ల దీనిపై మరోసారి ఆలోచించాలని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సూచించారు.  దీనిపై ఆమె మంత్రి అశోక్, శివసేన ఎంపీలతో 45 నిమిషాల పాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రవీంద్ర గైక్వాడ్ చేసింది తప్పేనని శివసేన కూడా ఒప్పుకొంది గానీ, విమానాల్లో ఎక్కకుండా నిషేధించడం మరీ తీవ్రమైన నిర్ణయమంది. చివరకు శివసేన ఒత్తిడికి తలొగ్గిన సర్కారు.. ఎంపీని విమానాల్లో ఎక్కించుకునేందుకు వీలుగా సంబంధిత నియమ నిబంధనలను మారుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement