‘ఆర్’.. అంటే హడలే! | will terror about calling 'R' letter | Sakshi
Sakshi News home page

‘ఆర్’.. అంటే హడలే!

Published Sun, Jul 19 2015 2:03 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

‘ఆర్’.. అంటే హడలే! - Sakshi

‘ఆర్’.. అంటే హడలే!

ఒకప్పుడు మావోయిస్టుల పేరు చెబితే ఉలిక్కిపడే పోలీసులు ప్రస్తుతం ‘ఆర్’ అక్షరానికి సంబంధించిన అంశాలంటే హడలిపోతున్నారట. ఏప్రిల్ నుంచి వరుసగా ఎదురవుతున్న సవాళ్ళే దీనికి కారణం. ‘ఎర్ర’దొంగల ఎన్‌కౌంటర్, రేవంత్‌రెడ్డి ఓటుకు కోట్లు ఇష్యూ, రాజమండ్రి తొక్కిసలాట.. ఇలా ‘ఆర్’ అక్షరంతో ప్రారంభమైనవన్నీ పోలీసుల పీక మీదికి కత్తి తీసుకువచ్చినవే. శేషాచలం అడవుల్లో ఏప్రిల్ 7న ఎర్రచందనం దొంగల వేటకు ఏర్పాటైన యాంటీ టాస్క్‌ఫోర్స్ చేసిన ఎన్‌కౌంటర్‌లో 20 మంది తమిళనాడు కూలీలు చనిపోయారు. ఇది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాకుండా పోలీసులపై కేసులు, న్యాయస్థానాల్లో విచారణ వరకూ వెళ్ళింది.
 
 ఈ ఎన్‌కౌంటర్ చివరికి ఎవరి మెడకు చుట్టుకుంటుందో కూడా తెలియదు. ఈ వేడి చల్లారకముందే మే 31న టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వ్యవహారం మరో కుదుపు కుదిపింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షల లంచం ఇస్తూ రేవంత్‌రెడ్డి తెలంగాణ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోవడం, ‘ఓటుకు కోట్లు’లో ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడినట్లు ఆడియో వెలుగులోకి రావడం.. వెరసి రాష్ట్ర నిఘా విభాగం అధిపతిపై వేటు పడేవరకూ వెళ్ళింది. ఇక గోదావరి పుష్కరాల ప్రారంభం రోజునే రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటలో 27 మంది అమాయకులు చనిపోవడం పోలీసు విభాగానికి అప్రతిష్టను తెచ్చిపెట్టింది. పుష్కరాల అనంతరం కొందరు పోలీసు అధికారులపై వేటు తప్పదని తెలుస్తోంది. ఈ వరుస ఉదంతాల నేపథ్యంలో ‘ఆర్’తో కూడిన వ్యవహారాలంటేనే పోలీసు అధికారులు హడలిపోతున్నారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement