అక్షయ్.. అసలైన హీరో!
మన సెలబ్రిటీలు మీడియాకు ఫోజులిచ్చి మరీ సాయం చేస్తారు. చేసే గోరంత సాయానికి కొండంత ప్రచారం చేసుకుంటారు. కానీ వీరందరికీ భిన్నంగా
హీరో అంటే.. అన్యాయాన్ని ఎదిరించేవాడు!
హీరో అంటే.. ఆపదల్లో ఉన్నవారిని
ఆదుకునేవాడు!
హీరో అంటే.. సమస్యకు సరైన పరిష్కారం చూపేవాడు!
ఇవన్నీ చేస్తున్నాడు కనుకే
అక్షయ్ అసలైన హీరో!!
మరి మిగతా హీరోలంతా ఇవే చేస్తున్నారు కదా..?
కానీ అక్షయ్ తెరమీద కాదు.. నిజజీవితంలో చేస్తున్నాడు. అందుకే అతణ్ని అసలు సిసలైన హీరో అంటున్నాం.
ఇంతకీ ఏం చేశాడో తెలియదా...?
అయితే చదవండి..
తుపానులు వచ్చినప్పుడో, వరదలు ముంచెత్తినప్పుడో, భూకంపాలు సంభవించినప్పుడో.. ఇలా ఏదైనా విపత్తు తలెత్తినప్పుడు మాత్రమే మన సెలబ్రిటీల్లోని మానవత్వం మేల్కొంటుంది. మీడియాకు ఫోజులిచ్చి మరీ సాయం చేస్తారు. చేసే గోరంత సాయానికి కొండంత ప్రచారం చేసుకుంటారు. కానీ వీరందరికీ భిన్నంగా.. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తనలోని దాతృత్వాన్ని చాటుకుంటున్నాడు. సామాజిక సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ తనవంతు సాయం చేయడమే కాకుండా దేశ ప్రజల్లోనూ సమస్యపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇటీవలే ముష్కరుల దాడిలో మన సైనికులు చనిపోయారు. వెంటనే చలించిన అక్షయ్ వారి కుటుంబాలకు కోటిరూపాయల ఆర్థిక సాయం అందజేశాడు. నేరుగా సైనికుల కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమయ్యేలా ఓ లింక్‌ను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. అంతే.. దేశ ప్రజల నుంచి కూడా కోట్లాది రూపాయల విరాళాలు అందాయి.
దేశంలో ఏ ఘటనలు జరిగినా వాటి మీద కూడా ఎటువంటి బెరుకు, సంశయాలు లేకుండా తన అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పడం అక్షయ్‌కు అలవాటు. ఈ మధ్య బెంగళూరు నటిపై జరిగిన దాడిని కూడా అతను ఖండించాడు. ఎక్కడ ఎటువంటి ఘటన జరిగినా స్పందించాలని కోరాడు. ఆ తర్వాత వరుసపెట్టి బాలీవుడ్ అంతా బెంగళూరు ఘటనను ఖండించింది.
పరిశుభ్ర భారత్ కోసం..
ఇప్పుడు మరొక వినూత్న కార్యక్రమం ద్వారా అక్కీ మన ముందుకు రాబోతున్నాడు. అదే టాయిలెట్ వీడియో. ఆరు నిమిషాల నిడివి గల ఈ వీడియో పేరు ‘‘సోచ్ ఔర్ సాచ్’’ దీనిలో మనదేశంలో టాయిలెట్ల అవసరాన్ని తెలుపుతూ.. ప్రజలలో అవగాహన కల్పించడం కోసమే ఈ వీడియో రూపొందించినట్లు ఆయన తెలిపారు. త్వరలో విడుదలయ్యే తన సినిమా ‘‘టాయిలెట్– ఒక ప్రేమ కథ’’ షూటింగ్ సందర్భంగా తెలుసుకున్న విషయాలు తనను కదిలించాయని అక్షయ్ తెలిపారు.అందుకనే బహిరంగ మల విసర్జనపై ప్రజల్లో అవగాహన.. మన దేశంలో మరుగుదొడ్ల కొరత గురించి ఈ వీడియోలో చూపించామన్నారు. ఆ
వీడియోలో అక్షయ్ ఏమన్నాడంటే..
‘గ్రామాలలో మహిళల పరిస్థితి దారుణంగా ఉంది. వారికి మరుగు దొడ్లు లేక ప్రతిరోజు ఉదయం లేదా రాత్రి పూట బహిర్భూమికి వెళ్తున్నారు. భారతదేశం అత్యంత శక్తిమంతమైన దేశంగా ఎదుగుతోంది. కానీ ఇప్పటికి చాలా మంది స్త్రీలు మరుగుదొడ్లు వాడటానికి ఇష్టపడటంలేదు. ఇలా బహిర్భూమికి వెళ్లే స్త్రీలు, పిల్లలు ప్రమాదకరమైన వ్యాధులబారిన పడుతున్నారు. దీనివల్ల రోజుకి దాదాపు 1000 మంది పిల్లలు చనిపోతున్నారు. మీకందరికి ఒకే ఇంట్లో పడక గది, ఒక కిచెన్ కావాలి. మరి మరుగు దొడ్డి ఎందుకు వద్దు? ఆరోగ్యంగా ఉండడం కోసం ప్రతిఒక్కరూ వ్యక్తిగత శుభ్రతను పాటించాలి. అందరూ పరిశుభ్రంగా ఉంటేనే స్వచ్ఛ్‌భారత్ కల నెరవేరుతుంది. ప్రజలంతా కొంత డబ్బుని సాయం చేయడం ద్వారా మత సంబంధిత కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో మరుగుదొడ్లు నిర్మించవచ్చు.
- సాక్షి, స్కూల్ ఎడిషన్