చేనేత రుణాలు మాఫీ చేస్తాం
నెల రోజుల్లో రుణమాఫీ పత్రాలు అందిస్తాం
మళ్లీ జనతా వస్త్రాలు ఇస్తాం
జాతీయ చేనేత దినోత్సవంలో మంత్రులు కొల్లు, ప్రత్తిపాటి, దేవినేని
విజయవాడ బ్యూరో: చేనేత రంగానికి చేయూతనిచ్చేలా రాష్ట ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో మంత్రులు మాట్లాడారు. చేనేత జౌళి శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో వెయ్యి చేనేత సొసైటీలకు చెందిన 2.80లక్షల మంది కార్మికుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు.
చేనేత కార్మికులకు రూ.125 కోట్ల రుణాలు రద్దు చేస్తామని, నెలరోజుల్లోగా 25వేల మందికి రుణమాఫీ పత్రాలు అందిస్తామని చెప్పారు. జనతా వస్త్రాల పథకాన్ని మళ్లీ అమలులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వ్యవసాయ మంత్రి ప్రతిపాటి పుల్లారావు చెప్పారు. ఈ సందర్బంగా చేనేతలో విశేష సేవలందించిన కూన మల్లికార్జున్, రామయ్యలను సత్కరించారు. సభకు ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అధ్యక్షత వహించారు.