Ravindra Kollam
-
చేనేత రుణాలు మాఫీ చేస్తాం
నెల రోజుల్లో రుణమాఫీ పత్రాలు అందిస్తాం మళ్లీ జనతా వస్త్రాలు ఇస్తాం జాతీయ చేనేత దినోత్సవంలో మంత్రులు కొల్లు, ప్రత్తిపాటి, దేవినేని విజయవాడ బ్యూరో: చేనేత రంగానికి చేయూతనిచ్చేలా రాష్ట ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో మంత్రులు మాట్లాడారు. చేనేత జౌళి శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో వెయ్యి చేనేత సొసైటీలకు చెందిన 2.80లక్షల మంది కార్మికుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు. చేనేత కార్మికులకు రూ.125 కోట్ల రుణాలు రద్దు చేస్తామని, నెలరోజుల్లోగా 25వేల మందికి రుణమాఫీ పత్రాలు అందిస్తామని చెప్పారు. జనతా వస్త్రాల పథకాన్ని మళ్లీ అమలులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వ్యవసాయ మంత్రి ప్రతిపాటి పుల్లారావు చెప్పారు. ఈ సందర్బంగా చేనేతలో విశేష సేవలందించిన కూన మల్లికార్జున్, రామయ్యలను సత్కరించారు. సభకు ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అధ్యక్షత వహించారు. -
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు : మంత్రి రవీంద్ర
మచిలీపట్నం టౌన్ : వసతి గృహాల్లో అధికారులు, సిబ్బంది లేని తీరు, నీళ్ల చారు.. కూర వండి వడ్డించని వైనం.. పురుగులతో కూడిన సుద్దన్నం.. మరుగుదొడ్లలో లైట్లు వెలగని స్థితి.. కాలం చెల్లిన మందులు.. అస్తవ్యస్తంగా హాజరు పట్టీల నిర్వహణ.. పిచ్చిమొక్కలు, గడ్డి దట్టంగా పెరిగిన ఆవరణలతో కూడిన వసతి గృహాలు సాక్షాత్తూ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు దర్శనమిచ్చిన దృశ్యాలు. మంత్రి రవీంద్ర ఆదివారం స్ధానిక పోతేపల్లి రోడ్లో ఉన్న బీసీ, ఎస్టీ సంక్షేమ బాలికల వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంలో కన్పించిన సం ఘటనలు. స్వయంగా తానే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని వసతి గృహాల పరిస్థితి చూసి మంత్రి ఆశ్చర్యపోయారు. తొలుత ఆయన బీసీ సంక్షేమ బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేశారు. ఈ సమయంలో వసతిగృహంలో వార్డెన్‌తో పాటు మరో ముగ్గురు సిబ్బంది లేరు. విద్యార్థులకు వడ్డించేందుకు అన్నం, నీళ్లచారును అక్కడి సిబ్బంది సిద్ధం చేశారు. కూర మాత్రం వండలేదు. బాలికల వసతి గృహంలో ఉద్యోగులు బాధ్యతగా ఉండకుండా వసతి గృహానికే రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న ఎస్టీ బాలికల వసతి గృహాన్ని ఆయన పరి శీలిస్తుండగా బీసీ వసతి గృహ వార్డెన్ టీ అనితకుమారి అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తీరుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ వసతి గృహ బాలికలతో కొద్దిసేపు మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. వార్డెన్ గదిలోకాలం చెల్లిన మందులు ఉంచడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతి గృహాల నిర్వహణకు ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నా అధికారుల నిర్లక్ష్యంతో లక్ష్యం నీరుగారుతోందన్నారు. ఎస్టీ బాలికల వసతి గృహంలో ఉన్న 19మంది విద్యార్థినులకు కూర లేకుండా నీళ్లచారు.. పురుగులతో కూడిన అన్నాన్ని వడ్డించిన వైనంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతి గృహంలోని మరుగుదొడ్లకు లైట్లు వెలగకున్నా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. హాజరుపట్టీల నిర్వహణ కూడా అస్తవ్యస్తంగా ఉం దని, విద్యార్థినుల మూమెంట్ రిజిస్టర్‌ను నిర్వహించకపోవడాన్ని మంత్రి పశ్నించారు. త్వరలో బయోమెట్రిక్ విధానం విధుల నిర్వహణలో వసతిగృహాల అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన విలేకరులతో మాట్లాడారు. బందరులోని వసతి గృహాలలో సిబ్బంది నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారితీరును ఉపేక్షించేది లేదన్నారు. ప్రతి నెలా పేరెంట్స్ మీటింగ్‌లు పెట్టాలని సూచించారు. త్వరలో అన్ని వసతి గృహాలలో విద్యార్థులు, సిబ్బందికి బయోమెట్రిక్ విధానం ద్వారా హాజరు వేసే పద్ధతిని అమలు చేస్తామన్నారు. మునిసిపల్ చైర్మన్ మోట మర్రి బాబా ప్రసాద్, వైస్ చైర్మన్ పంచపర్వాల కాళీవిశ్వనాథం, బీసీ సంక్షేమశాఖ డీడీ సీహెచ్ చినబాబు పాల్గొన్నారు. -
ప్రజాసంక్షేమానికి ప్రాధాన్యత
మంత్రి కొల్లు రవీంద్ర చిలకలపూడి (మచిలీపట్నం) : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రజా సంక్షేమానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ పింఛన్లు, సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పని చేస్తోందన్నారు. గత ప్రభుత్వాలు డెల్టాఆధునికీకరణపై నిర్లక్ష్యం వహించడం వల్లే కాలువలు బలహీన పడ్డాయని తెలిపారు. బెల్ కంపెనీ విస్తరణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఇందుకోసం కంపెనీకి 25 నుంచి 50 ఎకరాల మధ్యలో భూమి కేటాయింపు కోసం రెవెన్యూ అధికారులతో చర్చించామన్నారు. కృష్ణా యూనివర్సిటీ భవన నిర్మాణ పనుల కోసం జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతామని చెప్పారు. భవానీపురం వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తామన్నారు. అక్టోబరు 2 గాంధీ జయంతి రోజున పింఛన్ల పెంపు కార్యక్రమం, ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం, ఎన్టీఆర్ ఆరోగ్య కార్యక్రమాలు, జన్మభూమి - మనఊరు కార్యక్రమాలను ప్రారంభిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 400 మద్యం దుకాణాల్లో ప్రభుత్వం నేరుగా విక్రయాలు జరిపేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రూ.5 కోట్లతో మంగినపూడిబీచ్ అభివృద్ధి పనులు, రూ. 3 కోట్లతో గిలకలదిండి ఫిషింగ్ హార్బర్ వద్ద రిసార్ట్స్ ఏర్పాటు చేసి బోటు షికార్ ఏర్పాటు చేస్తామన్నారు. రూ.25 లక్షలతో చిలకలపూడి పాండురంగస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. మచిలీపట్నం మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, టీడీపీ నాయకులు నారగాని ఆంజనేయప్రసాద్, కుంచే దుర్గాప్రసాద్ (నాని) పాల్గొన్నారు.