పొరపాటున వేరే విమానమెక్కి..
న్యూయార్క్: అమెరికాలో ఒక విమానయాన సంస్థ తప్పిదంతో ఒక మహిళ దాదాపు 4,800 కిలోమీటర్లు తప్పు మార్గంలో ప్రయాణించాల్సి వచ్చింది. అమెరికాలోని నెవార్క్ నుంచి పారిస్ వెళ్లేందుకు ఏప్రిల్ 24న విమానమెక్కిన లూసీ చివరకు శాన్‌ఫ్రాన్సిస్కోలో దిగింది. అసలేం జరిగిందంటే.. చివరి నిమిషంలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ పారిస్ వెళ్లే విమానం బోర్డింగ్ గేట్‌ను మార్చింది.
మైక్ ద్వారా ప్రకటించినా.. లూసీకి ఇంగ్లిషు రాకపోవడంతో ఆ విషయం తెలియలేదు. బోర్డింగ్ సిబ్బంది కూడా టికెట్‌ను సరిగా చూడకుండా స్టాంప్ వేయడంతో ఆమె శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్లే విమానం ఎక్కేసింది. తన సీటులో ఎవరో కూర్చోవడంతో విషయాన్ని సిబ్బందికి తెలిపింది. వారు కూడా టికెట్‌ను సరిగా పరిశీలించకుండా వేరే సీటును కేటాయించారు. దీంతో ప్యారిస్ బదులు శాన్‌ఫ్రాన్సిస్కో చేరుకోవడంతో పాటు అక్కడ 11 గంటలపాటు వేచి ఉండాల్సి వచ్చింది. చివరకు అధికారులు క్షమాపణ చెప్పి ఆమెను గమ్యస్థానానికి చేర్చారు.