సరిహద్దుల్లో పాక్ దాష్టీకం!
విచక్షణారహితంగా కాల్పులు.. ఒక మహిళ మృతి
పూంచ్: జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దుల్లో పాకిస్థాన్ దాష్టీకం పెరిగిపోతోంది. పూంచ్ జిల్లాలోని వాస్తవాధీన రేఖకు సమీపంలో పాకిస్థాన్ బలగాలు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచాయి. శనివారం ఉదయం విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఒక మహిళ మృతిచెందారు. మృతురాలిని రుఖియా బీగా గుర్తించారు.
పూంచ్ జిల్లాలోని బాలాకోట్ సెక్టార్‌లో ఉదయం 5 గంటల సమయంలో భారీ ఎత్తున కాల్పులకు తెగబడిందని, దీంతో భారత బలగాలు దీటు బదులిచ్చాయని, కాల్పులు కొనసాగుతున్నాయని రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. మరోవైపు కుప్వారా జిల్లాలోని ఆర్మీ ప్రధాన కార్యాలయంపై ఉగ్రవాదుల దాడి చేశారు. ఈ దాడిలో ఒక జవానుకు గాయాలు అయ్యాయి. దీంతో ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా దళాలు ప్రత్యేక ఆపరేషన్‌ను చేపట్టాయి.