సరిహద్దులు లేని ప్రమాదం
ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం పెరగటం ఆందోళనకరం
శాంతియుత, సురక్షిత పొరుగు ప్రాంతాన్ని కోరుకుంటున్నాం
కిర్గిజిస్థాన్ అధ్యక్షుడితో భేటీ అనంతరం ప్రధాని మోదీ వెల్లడి
బిషెక్: తీవ్రవాదం, ఉగ్రవాదం సరహద్దులు లేని ప్రమాదమని ప్రధాని మోదీ అభివర్ణించారు. దానిపై పోరాడాల్సిన ఆవశ్యకతను ఉద్ఘాటించారు. ‘‘మన ప్రాంతంలో సవాళ్లు నెలకొని ఉన్న ఈ కాలంలో శాంతియుతమైన, సురక్షితమైన పొరుగు ప్రాంతం ఉండాలని మా ఇరు దేశాలూ కోరుకుంటున్నాయి’’ అని ఆయన కిర్గిజిస్థాన్ అధ్యక్షుడు అల్మాజ్‌బెక్ అతాంబాయేవ్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. మధ్య ఆసియాలో ఆరు దేశాల పర్యటనలో భాగంగా శనివారం రాత్రి కిర్గిజిస్థాన్ చేరుకున్న మోదీ ఆదివారం ఆ దేశాధ్యక్షుడితో చర్చలు జరిపారు. ఇరు దేశాలూ.. వార్షిక సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించటంతో సహా రక్షణ సహకారం, సాంస్కృతిక సహకారంపై ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. రెండు దేశాల ఎన్నికల సంఘాల మధ్య సహకారంపై అవగాహన ఒప్పందం, ప్రమాణాల రంగంలో సహకారంపై ఎంఓయూలపై సంతకాలు చేశాయి. అంతర్జాతీయ ఉగ్రవాదం, ఇతర నేరాలపై పోరాటానికి సంబంధించి ఒప్పందం చేసుకోవటాన్ని వేగవంతంగా పరిశీలించాలని అంగీకారానికి వచ్చాయి.
మధ్య ఆసియాలో కిర్గిజ్ కీలకం...
మధ్య ఆసియాలోని మొత్తం ఐదు దేశాల్లో తన పర్యటన.. ఈ ప్రాంతంతో సరికొత్త సమునున్నత సంబంధాలకు భారత్ ఇస్తున్న ప్రాధాన్యతను విశదీకరిస్తుందని మోదీ పేర్కొన్నారు. ఈ విషయంలో కిర్గిజిస్థాన్ ఒక కీలకమైన భాగమని అభివర్ణించారు. కిర్గిజ్ సాయుధ బలగాలకు.. భారత్ నుంచి చిన్నపాటి క్షేత్ర వైద్య పరికరాలను అందించటం తనకు సంతోషాన్నిస్తోందని చెప్పారు. కిర్గిజ్‌తో భారత్‌తో టెలీ-మెడిసిన్ అనుసంధానం కోసం తాను నిరీక్షిస్తున్నాని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత శాశ్వతసభ్యత్వానికి కిర్గిజ్ బలంగా మద్దతు ఇస్తుండటం పట్ల మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
ఐరాస శాంతి స్థాపన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తమ సైనికాధికారులకు భారత్ శిక్షణ ఇవ్వటం పట్ల కిర్గిజ్ కృతజ్ఞతలు తెలిపింది. తమ దేశంలో మైనింగ్, ఫార్మా రంగాల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా భారత ఆర్థిక వాణిజ్యసంస్థలను ఆహ్వానించింది. కిర్జిజ్‌లో భారత ఆయుష్ (ఆయుర్వేద, యోగా - నాచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి) కేంద్రాన్ని స్థాపిస్తామన్న భారత్ ప్రతిపాదనకూ సమ్మతించింది.