ఐఏఎస్, ఐపీఎస్‌లు కావాలనుందా ?
న్యూఢిల్లీ: జీవితంలో ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపీఎస్ అధికారులు కావాలనే ఏకైక లక్ష్యంతో ఏటా దాదాపు పది లక్షల మంది అభ్యర్థులు యూపీఎస్సీ పరీక్షలు రాస్తున్నారు. అందులో కొద్ది మందికే ఆ అవకాశం లభిస్తుంది. అందులోనూ లక్షల.. లక్షల రూపాయలు కోచింగ్ సెంటర్లకు తగులబెట్టి రాత్రింబవళ్లు చదివే వారికే ఎక్కువ అవకాశం వస్తుంది. తెలివి తేటలు దండిగా ఉన్నప్పటికీ, అకుంఠిత దీక్షతో చదివే పట్టుదల ఉన్నప్పటికీ పేదరికం కారణంగా ఎంతోమంది విద్యార్థులు తమ కలలను సాకారం చేసుకోలేక పోతున్నారు. అచ్చం అలాంటి వారి కోసమే ‘అన్‌అకాడమీ’ పేరిట ఆన్‌లైన్ ఉచిత కోచింగ్ సెంటర్ పుట్టుకొచ్చింది. ఎప్పటికప్పుడు కోచింగ్ వీడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడం ద్వారా ఈ ‘అన్‌అకాడమీ’ నేటికి పదిలక్షల ఫోలావర్స్‌ను కూడగట్టుకొని ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌లో కొత్త రికార్డును సృష్టించింది.
రోమన్ సాయిని, గౌరవ్ ముంజాల్ అనే మహానుభావులు ఈ ‘అన్‌అకాడమీ’ కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. పిన్న వయస్సులోనే ఉన్నత చదువులు చదివిన వీరిద్దరు బాల్య మిత్రులు. ఇరుగు పొరుగు వారు. ఉన్నత చదువుల్లో తమకెదురైన ఇబ్బందులు, ఇక్కట్లు తోటి విద్యార్థులకు, ముఖ్యంగా పేద విద్యార్థులకు ఎదురుకావద్దనే సదుద్దేశంలో ఈ అన్‌అకాడమీని ఏర్పాటు చేశారు. కోచింగ్ సెంటర్ల పేరిట కోట్లాది రూపాయలు దండుకుంటున్న అకాడమీల మీద కోపం, అశాస్త్రీయంగా వారనుసరిస్తున్న బోధనా పద్ధతులపై కోపంతోనే వారిద్దరు తమ ఆన్‌లైన్ కోచింగ్ సెంటర్‌కు ‘అన్‌అకాడమీ’ అని పేరు పెట్టారు. ఉన్నత ఉద్యోగస్థులైన వీరు తమ డ్యూటీ కాలాన్ని మినహాయించి, తమ వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టి కేవలం సామాజిక దృక్ఫథంతో ఈ అన్‌అకాడమీని నడుపుతున్నారు. ఏ రూపంలో కూడా విద్యార్థుల నుంచి నయా పైసా తీసుకోవడం లేదు.
రోమన్ సాయిని తన 16వ ఏట ఏమ్స్ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణుడై ఎంబీబీఎస్ కోర్సులో చేరాడు. ఆ కోర్సును పూర్తి చేసి డాక్టర్ పట్టా పుచ్చుకొన్నాక తన 23వ ఏట యూపీఎస్సీ పరీక్షలు రాసి ఐఏఎస్‌లో 18వ ర్యాంకు సాధించారు. ఐఏఎస్ అయిన డాక్టర్లలో అతి పిన్న వయస్కుడు రోమన్ సాయినినే. ఆయన ప్రస్తుతం జబల్పూర్ సబ్ కలెక్టర్‌గా పని చేస్తున్నారు. ఇక ఆయన బాల్య మిత్రుడు గౌరవ్ ముంజాల్ తాను ఏడవ తరగతి చదువుతున్నప్పటి నుంచే వెబ్‌సైట్లను క్రియేట్ చేయడం ప్రారంభించారు. ఆయన ప్రస్తుతవ ‘ఫ్లాట్ డాట్ టు’ అనే కంపెనీకి సహ వ్యవస్థాపకుడు, సీఈవో. దేశవ్యాప్తంగా విద్యార్థుల వసతి సౌకర్యాలను చూసే వెబ్‌సైట్ కంపెనీ ఇది.
వీరిద్దరు కలసి 2010లో కంప్యూటర్ సైన్స్ విద్యార్థుల శిక్షణ కోసం వీడియోలను రూపొందించారు. వాటిని ఆన్‌లైన్ ద్వారా ఉచితంగా విద్యార్థులకు అందించడం కోసం యూట్యూబ్‌ను మాధ్యమంగా వాడుకున్నారు. అందులో భాగంగానే ‘అన్‌అకాడమీ’ని ఏర్పాటు చేశారు. 2013లో రోమన్ సాయిని ఐఏఎస్ సాధించారు. అప్పుడు తన అనుభవాలతో కూడిన వీడియోలను ఎందుకు పోస్ట్ చేయకూడదనే ఆలోచనతో వాటికి అన్‌అకాడమీ ద్వారా పోస్ట్ చేశారు. అప్పటి నుంచి యూపీఎస్సీ అభ్యర్థులే లక్ష్యంగా వీడియోల ద్వారా ఆన్‌లైన్ శిక్షణా కేంద్రాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. రోమన్ 120 వీడియోలను స్వయంగా రూపొందించగా, మరో 60, 70 వీడియోలకు అసిస్టెంట్‌గా సహకారం అందించారు.
ఇప్పడు తమ ఆన్‌లైన్ కోచింగ్ ద్వారా దాదాపు 400 వీడియోలు యూట్యూబ్‌లో ఉన్నాయని, వాటిలో సగం రోమన్ రూపొందించినవేనని గౌరవ్ తెలిపారు. విద్యార్థులు ఈ వీడియోలను తమకిష్టమైన సమయంలో ఇష్టమున్న చోట కూర్చొని వీక్షించే వీలుందని ఆయన చెప్పారు. నయాపైసా ఖర్చు లేకుండానే కావాల్సిన జ్ఞానాన్ని సముపార్జించుకునే అవకాశం ఉందని చెప్పారు. అంతేకాకుండా ఈ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా మిత్రులతో షేర్ చేసుకునే అవకాశం కూడా ఉందని అన్నారు. కొన్ని ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు కూడా తమ వీడియోలను వినియోగిస్తున్నట్టు తెల్సిందని గౌరవ్ వివరించారు.
సబ్ కలెక్టర్‌గా పనిచేస్తూ వీడియోలు తీయడానికి సమయమెలా చిక్కుతుందని రోమన్ సాయిని మీడియా ప్రశ్నించగా, తన ఉద్యోగం ఉదయం 9 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలతో ముగుస్తుందని, దాదాపు 8 గంటలు వీడియోల మెటీరియల్ కోసం రీసెర్చ్ చేస్తానని చెప్పారు. ఆ తర్వాత శని, ఆదివారాలు గౌరవ్, తాను కలసి వీడియోలను రూపొందిస్తామని తెలిపారు. ఇలా వారానికి రెండు వీడియోలను తీస్తామని చెప్పారు. ఇంతగా పనిచేయడానికి స్ఫూర్తినిచ్చేది ఏమిటని ప్రశ్నించగా, ‘ప్రతి ఏటా దాదాపు ఏడు లక్షల మంది ప్రిలిమనరీ పరీక్షలు రాస్తారు. వారిలో కేవలం లక్ష మందికి మాత్రమే కోచింగ్ సెంటర్లకు వెళ్లే స్తోమత ఉంటుంది. కొందరు పేదవారైనప్పటీకీ అప్పలు చేసి చదవిస్తారు. అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదనే ఉద్దేశంతో, వారికోసం మేము పనిచేస్తున్నాం.
అందులో మాకు ఎంతో తృప్తి ఉంది. తమ అన్‌అకాడమీ ద్వారా ఎంతోమంది విద్యార్థులు తమ సందేహాలను మాతో తీర్చుకుంటారు. మా వీడియాల ద్వారానే ఐఎఎస్, ఐపీఎస్‌లు సాధించామన్న వారూ ఉన్నారు. అది మాకు సంతృప్తినిచ్చేదే కదా! కెమరాలకే మాకు ఎక్కువ ఖర్చయింది. అదే మా పెట్టుబడి. సమయం కూడా. నేను డాక్టర్ కూడా అయినందున త్వరలో ఎంబీబీఎస్ ప్రవేశ పరీక్షల కూడా కోచింగ్‌ను ప్రారంభించాలనుకుంటున్నాం’ అని వివరించారు. విద్యార్థులు మరిన్ని వివరాల కోసం యూట్యూబ్, ఫేస్‌బుక్ లేదా వెబ్‌సైట్‌లో ‘అన్‌అకాడమి’ని సంప్రదించవచ్చు.