షియోమి ఎయిర్ ప్యూరిఫైర్2 వచ్చేసింది!
షియోమి ఎయిర్ ప్యూరిఫైర్2 వచ్చేసింది!
Published Wed, Sep 21 2016 8:09 PM | Last Updated on Mon, Sep 4 2017 2:24 PM
న్యూఢిల్లీ : చైనీస్ బహుళ జాతీయ కంపెనీ షియోమి రెండు కొత్త ఉత్పత్తులను భారత మార్కెట్లోకి ఆవిష్కరించింది. మి ఎయిర్ ప్యూరిఫైర్ 2 తో పాటు, వేరియబుల్ బ్యాండు మి బ్యాండు 2ను భారత వినియోగదారుల చెంతకు తీసుకొచ్చింది. ఎంఐ ఎయిర్ ప్యూరిఫైర్తో గృహోపకరణలోకి అడుగుపెట్టిన షియోమి, తాజాగా మి ఎయిర్ ప్యూరిఫైర్ 2 పేరుతో మరో ఉత్పత్తిని తీసుకొచ్చింది. రూ.9999కు ఈ మి ఎయిర్ ప్యూరిఫైర్ 2ను , మి డాట్ కామ్లో సెప్టెంబర్ 26 నుంచి అందుబాటులో ఉంచనున్నట్టు ప్రకటించింది. ఫ్లిప్కార్ట్ ప్లాట్ఫామ్లో దీన్ని అక్టోబర్ 2 నుంచి విక్రయిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. అదేవిధంగా మి బ్యాండు 2ను 1,999రూపాయలకు మి డాట్ కామ్లో సెప్టెంబర్ 27 నుంచి అందుబాటులో ఉంచుతున్నట్టు పేర్కొంది. సెప్టెంబర్ 30 నుంచి కూడా ఈ బ్యాండును అమెజాన్లో కొనుగోలు చేసుకోవచ్చని వెల్లడించింది.
పాత వెర్షన్‌తో పోలిస్తే మి ఎయిర్ ఫ్యూరిఫైర్ 2 డిజైన్ చాలా దృఢంగా ఉంటుందని కంపెనీ చెపుతోంది. మి ఎయిర్ ప్యూరిఫైర్ 2, భారత ఎయిర్ ప్యూరిఫైర్ రంగంలో సమూల మార్పులు తీసుకొస్తుందని షియోమి వైస్ ప్రెసిడెంట్ హ్యగో బరా తెలిపారు. వై-ఫై కనెక్షన్తో దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చని చెప్పారు. సంప్రదాయం ఎయిర్ ప్యూరిఫైర్ల మాదిరిగా కాకుండా మూలమూలలా గాలిని ఇది శుద్ధి చేస్తుందని 360 డిగ్రీల్లో ఇది పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో దొరుకుతన్న వాటికంటే ఇది చాలా అధికం. ఎయిర్ ఫ్యూరిఫైర్ 2 గాలిలోని కాలుష్యాన్ని 99.7 శాతం వరకు తగ్గిస్తుందని షియోమి వెల్లడించింది.అంతే కాకుండా దీని క్లీన్ ఎయిర్ డెలివరీ రేట్ (సీఏడీఆర్) సామర్థ్యం గంటకు 330 క్యూబిక్ మీటర్లని పేర్కొంది. మి బ్యాండు 2 పేరుతో తీసుకొచ్చిన వేరియబుల్ బ్యాండు ఓలెడ్ డిస్ప్లేతో, తక్కువ బరువు కలిగి ఉంటుందని షియోమి తెలిపింది. ఇది చాలా స్లిమ్గా ఉంటుందని చెప్పింది. దీన్ని బ్యాటరీ లైఫ్ 20 రోజుల వరకు ఉంటుందని కంపెనీ హామీ ఇచ్చింది.
Advertisement