ఫేస్‌బుక్ లాగౌట్ కాకుండానే..
మీరు ఫేస్‌బుక్ ఓపెన్ చేసి అలాగే ఉంచి.. ఇతర వెబ్‌సైట్లు బ్రౌజ్ చేస్తారా? ఫేస్‌బుక్‌ను లాగౌట్ చేయకుండానే పోర్న్ వెబ్‌సైట్లను చూస్తున్నారా? అయితే మీ గుట్టు మొత్తం ఫేస్‌బుక్ చిక్కే అవకాశముంది.
సోషల్ మీడియా దిగ్గజమైన ఫేస్‌బుక్ మీరు ఆన్‌లైన్‌లో ఏం చేస్తున్నారనే ప్రతిదానిని ట్రాక్ చేస్తుంది. గూగుల్ తరహాలోనే మీ బ్రౌజర్‌లో ఓపెన్ అయ్యే ప్రతి వెబ్‌సైట్ గురించి సమాచారాన్ని ఫేస్‌బుక్ సేకరిస్తుంది. అదేవిధంగా మీరు పెద్దల వెబ్‌సైట్లలోకి తొంగిచూసినా, పోర్న్ వెబ్‌సైట్లను గాలించినా ఆ సమాచారాన్ని ఫేస్‌బుక్ సేకరిస్తుంది. అంతేకాకుండా ఆయా వెబ్‌సైట్లలో ఫేస్‌బుక్ ప్లగిన్స్ కూడా ఉంటాయి. వీటి ద్వారా మీ సమాచారం గుట్టు మొత్తం అటు-ఇటు మారే అవకాశం ఉంటుంది.
చెప్పి మరీ చేస్తోంది..
ఫేస్‌బుక్ మీ ఆన్‌లైన్ వ్యవహారాలన్నింటిపైనా ఓ కన్నేసి పెట్టడం నిజానికి రహస్యమైన విషయం కాదు. ఫేస్‌బుక్ ఈ విషయాన్ని బాహాటంగా చెప్పి మరీ చేస్తున్నది. మీ అభిరుచికి తగిన వాణిజ్య ప్రకటనలను ఇచ్చేందుకు మీ బ్రౌజింగ్ సమాచారం సమస్తాన్ని తాను సేకరిస్తున్నట్టు ఫేస్‌బుక్ డాటా పాలసీ స్పష్టంగా వెల్లడిస్తోంది. గూగుల్ కూడా ఇదే తరహాలో యూజర్లకు అనుగుణమైన వాణిజ్య ప్రకటనలు ఇచ్చేందుకు వారు బ్రౌజ్ చేస్తున్న సమస్త వెబ్‌సైట్ల సమాచారాన్ని సేకరిస్తున్నది.
అయితే మీరు పోర్న్ వెబ్‌సైట్లు చూసినంత మాత్రాన మీకు అన్ని పోర్న్ వాణిజ్య ప్రకటనలనే ఫేస్‌బుక్ మీకు పంపించే అవకాశం లేదు. కానీ మీరు ఏయే వెబ్‌సైట్‌ను ఎంతసేపు చూస్తున్నారు? వేటిమీద ఎంత ఆసక్తి పెడుతున్నారా? అన్నది నిఘా వేసి పెడుతోంది. మీరు రహస్యంగా జరిపే ఇలాంటి కార్యకలాపాలు ఫేస్‌బుక్ కంటికి చిక్కకుండా ఉండాలంటే దానిని లాగౌట్ చేసి పూర్తిగా బయటకు వచ్చిన తర్వాతే చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.