పెళ్లికి నిరాకరించాడని..
పెగడపల్లి(కరీంనగర్): మనసిచ్చినోడు మనువుకు నిరాకరించడంతో ఓ యువతి తనువు చాలించింది. ప్రేమించినవాడు నమ్మించి మోసం చేయడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో ఆదివారం వెలుగచూసింది. గ్రామానికి చెందిన పెద్దకంటి శ్రుతి(18) జగిత్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. సొంత గ్రామం నుంచి రోజు బస్సులో జగిత్యాలకు రాకపోకలు సాగిస్తోంది.
ఈ క్రమంలో గత రెండేళ్ల క్రితం మల్యాల మండలం నాడెంపల్లి గ్రామానికి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా పెరిగి ప్రేమగా మారింది. రెండేళ్లుగా ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం సాగుతుండటంతో.. పెళ్లి చేసుకోమని శ్రుతి ప్రియుడిని కోరింది. పెళ్లికి అతడు నిరాకరించడంతో.. శనివారం రాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.