ప్రేమ పేరుతో మోసం
కరీంనగర్ క్రైం: ప్రేమ పేరుతో ఓయువకుడు యువతిని లొంగదీసుకుని పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెందిన బాధితురాలు ఆత్మహత్యకు యత్నించి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. గంగాధర మండలం గట్టుబూత్కూర్‌కు చెందిన కట్కూరి శంకరయ్య(27) అదే గ్రామానికి చెందిన పొత్తూరి కల్పన(22)ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలతో నమ్మించి లొంగదీసుకున్నాడు. కొద్ది రోజులు ప్రేమాయణం సాగించారు. తీరా పెళ్లి మాటెత్తేసరికి దూరం కొట్టాడు. దీంతో ఆమె అతడిని నిలదీసింది. తన తల్లిదండ్రులు రూ.3.50లక్షలు కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకోవాలంటున్నారని చెప్పాడు.
అంత డబ్బు తమ వద్ద లేదని, ఎలాగైనా తనను పెళ్లి చేసుకోవాలని బతిమిలాడింది. అయినా ఆకపట మనిషి కరగలేదు. ఇంకోసారి పెళ్లి మాట ఎత్తవద్దని, తన ఇంటివైపు రావద్దని హెచ్చరించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కల్పన ఈనెల 24వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో క్రిమిసంహారకమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. కొద్దిసేపటికి ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను గమనించి కరీంనగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా మారి కోమాలోకి వెళ్లింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెకు నాలుగురోజులుగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
నిందితుడిపై చర్యలు తీసుకోని పోలీసులు
ప్రేమ పేరుతో మోసపోయిన కల్పన ఆత్మహత్యకు యత్నించడంతో ఆమె తండ్రితో పాటు గ్రామ సర్పంచ్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించి విచారణ జరపాల్సిన పోలీసులు నాలుగు రోజులకు గ్రామానికి ఓకానిస్టేబుల్‌ను పంపించి వివరాలు సేకరించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువతి వాగ్మూలాన్ని సేకరించాల్సిన ఎస్సై కనీసం పట్టించుకోవడంలేదని బాధితురాలి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల నుంచి విమర్శలు ఎదురుకావడంతో బాధితురాలి తండ్రిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించుకుని ఫిర్యాదు స్వీకరించిన గంగాధర పోలీసులు కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. నిందితుడు దర్జాగా తిరుగుతున్నా చర్యలు తీసుకోవడంలేదు. ఇప్పటికైనా కల్పన ఆత్మహత్యాయత్నానికి కారణమైనవారిని కఠినంగా శిక్షించాలని ఆమె బంధువులు కోరుతున్నారు.