పెళ్లికి అంగీకరించలేదని... ఒంటిపై డీజిల్‌ పోసుకుని.. | Hyderabad: Youngster Dies After Being Set On Fire | Sakshi
Sakshi News home page

పెళ్లికి అంగీకరించలేదని... ఒంటిపై డీజిల్‌ పోసుకుని..

Published Mon, Jun 27 2022 1:06 AM | Last Updated on Mon, Jun 27 2022 1:24 AM

Hyderabad: Youngster Dies After Being Set On Fire - Sakshi

మహ్మద్‌ జమాల్‌ (ఫైల్‌)  

చాంద్రాయణగుట్ట: ప్రేమించిన బాలికతో పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ఓ యువకుడు ఒంటిపై డీజిల్‌ పోసుకొని నిప్పంటించుకుని సజీవ దహనమయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం రాత్రి కలకలం రేపింది. మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతానికి చెందిన అన్వర్‌ కుమారుడు మహ్మద్‌ జమాల్‌(21) ఫలక్‌నుమా అచ్చిరెడ్డినగర్‌కు చెందిన మోసిన్‌ అనే టైలర్‌ వద్ద నాలుగేళ్లుగా పనిచేస్తున్నాడు.

జమాల్‌ను అప్పుడప్పుడు లంచ్‌ బాక్స్‌ తేవడం లాంటి చిన్న, చిన్న పనుల నిమిత్తం మోసిన్‌ తన ఇంటికి పంపేవాడు. ఈ క్రమంలో మోసిన్‌ కుమార్తె(16)పై జమాల్‌ ఇష్టాన్ని పెంచుకున్నాడు. రెండు నెలల క్రితం జమాల్‌ తన తల్లిని తీసుకొని మోసిన్‌ ఇంటికి వెళ్లి ‘నీ కుమార్తెను ప్రేమిస్తున్నాను. పెళ్లి చేసుకుంటాను’అని చెప్పగా, ‘మా బంధువులలోనే ఒక అబ్బాయి ఉన్నాడు.

అతనికే ఇచ్చి పెళ్లి చేస్తాం’అని మోసిన్‌ కుటుంబసభ్యులు తేల్చిచెప్పారు. దీంతో అప్పటి నుంచి మోసిన్‌ వద్ద పనిమానేసిన జమాల్‌ తరచూ ఫోన్‌లో వేధించడంతోపాటు తాగిన మైకంలో వారి కుటుంబసభ్యులను బెదిరించేవాడు. దీంతో జమాల్‌ను నిలువరించాలంటూ అతడి సోదరుడిని శనివారం రాత్రి మోసిన్‌ తన ఇంటి సమీపంలోకి పిలిపించి చెబుతుండగా, అదే సమయంలోనే మోసిన్‌ ఇంటి మెట్లపై మంటలు చెలరేగాయి.

వెంటనే వెళ్లి చూడగా జమాల్‌ మంటల్లో కాలుతూ కనిపించాడు. అంతకుముందే జమాల్‌ చిన్నసైజ్‌ గ్యాస్‌ సిలిండర్, డీజిల్‌తో మోసిన్‌ ఇంటి మెట్లపైకి వెళ్లి డీజిల్‌ను ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. మంటల ధాటికి తాళలేక పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి మోసిన్‌ ఇంటి ముందు పడిపోయాడు.

కొన ఊపిరితో ఉన్న జమాల్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. అతని వద్ద సిలిండర్‌ సైతం ఉండడాన్ని బట్టి మోసిన్‌ కుటుంబసభ్యులను బెదిరించడమో, దాడి చేయడమో లాంటివి చేయాలనే ఉద్దేశంతోనే జమాల్‌ ఇక్కడికి వచ్చి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement