పెళ్లి ఇష్టంలేక..
► నిశ్చితార్థం ఏర్పాట్లు చేస్తుండగా ఘటన
► విషాదంలో యువతి కుటుంబీకులు
ఇబ్రహీంపట్నం(కోరుట్ల): ఓ వైపు నిశ్చితార్థం ఏర్పాట్లు చేస్తుండగా.. పెళ్లి ఇష్టంలేక యువతి ఆత్మహత్య చేకున్న ఘటన ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో జరిగింది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన బట్టు రాజేశ్‌కు ముగ్గురు కుమార్తెలు. రాజేశ్ ఇటీవలే సౌదీకి వెళ్లి వచ్చాడు. పెద్ద కుమార్తె అయిన సుప్రియ(23)ఇటీవలే డిగ్రీ పూర్తి చేసింది.
దీంతో పెళ్లి చేయాలని నిర్ణయించి.. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం గుమ్మిర్యాలకు చెందిన ఓ యువకుడితో పెళ్లి నిశ్చయించారు. ఆదివారం నిశ్చితార్థం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పెళ్లి ఇష్టం లేని సుప్రియ శనివారం సాయంత్రం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సంఘటన స్థలాన్ని హెడ్ కానిస్టేబుల్ కనకయ్య పరిశీలించి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.