
హ్యాకింగ్ చేసి.. అసభ్య చిత్రాలు.. అరెస్టు
చండీగఢ్: హర్యానాలో ఫేస్ బుక్ ఖాతాలను హ్యాక్ చేసి వాటిల్లో అసభ్య చిత్రాలు పెడుతూ అవతలి వ్యక్తులనుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడిన ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం యమునా నగర్ కు చెందిన అరవింద్ సింఘాల్ (24) అనే యువకుడు దాదాపు 20 ఫేస్ బుక్ ఖాతాలను హ్యాక్ చేశాడు. ఆరు నెలలుగా వారి ఖాతాల్లోకి పోర్న్ చిత్రాలను పెడతానని బెదిరిస్తూ డబ్బు గుంజడం ప్రారంభించాడు.
అతడిని అరెస్టు చేసిన పోలీసులు మొత్తం 17 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఫేస్ బుక్ పాస్ వర్డ్స్ కోసం ఉపయోగించేవాడని పోలీసులు తెలిపారు. తన ఫేస్ బుక్ ఖాతాలోకి అసభ్య చిత్రాలు వస్తుండటంతో నహన్ ప్రాంతానికి చెందిన సర్వేశ్ శర్మ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరవింద్ ఆగడాలకు అడ్డుకట్ట పడింది. మే 15న కేసు నమోదు చేసుకున్న పోలీసులు కొద్ది కాలానికే అతడిని అరెస్టు చేశారు.