వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ స్పష్టీకరణ
• కర్నూలు జిల్లాలో మూడో రోజు ‘రైతు భరోసా యాత్ర’
రైతు భరోసా నుంచి ‘సాక్షి’ ప్రతినిధి, కర్నూలు: ‘‘రామాయణం, మహాభారతం, ఖురాన్, బైబిల్... ఇలా మనం చదివే పవిత్ర గ్రంథాలన్నీ చెప్పేది ఒక్కటే... ప్రలోభాలు, మోసాలు ఒడిపోతాయి. అబద్ధాలు చెప్పేవాళ్లు, మోసాలు చేసేవాళ్లు బంగాళాఖాతంలో కలిసిపోతారు. చివరకు న్యాయం, ధర్మమే గెలుస్తాయి’’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు భరోసా కల్పించేందుకు కర్నూలు జిల్లాలో జగన్ చేపట్టిన ‘రైతు భరోసా యాత్ర’ మూడో రోజు శనివారం వెలుగోడు మండలం వేల్పనూరు నుంచి ప్రారంభమైంది. వేల్పనూరులో భారీ జనసందోహాన్ని ఉద్దేశించి జగన్ మాట్లాడారు. జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే...
‘‘ఇప్పటివరకు మనం చూసినా సినిమా అంతా ఇంటర్వెల్ వరకే నడిచింది. ఇప్పటిదాకా విలన్‌దే పైచేయిగా కనిపిస్తోంది. సినిమాలో 14 రీళ్లు ఉంటే 13వ రీల్ వరకూ విలన్‌దే పైచేయిగా ఉంటుంది. క్లైమాక్స్‌లో కథ అడ్డం తిరుగుతుంది. 14వ రీల్‌లో విలన్‌ను హీరో చితకబాదుతాడు. దేవుడు పై నుంచి కరుణించి ఆశీర్వదిస్తాడు, ప్రజలు దీవిస్తారు. ఇక్కడ కూడా ఇదే జరుగుతుంది. ఇది సినిమా అయినా కానీ, ఏ కథ అయినా కానీ చివరకు ముగింపు ఇదే.
బాబువన్నీ మోసాలు,అబద్ధాలు, ప్రలోభాలే
వేల్పనూరు గ్రామానికి ఒక విశిష్టత ఉంది. ఇక్కడి నుంచి ఇదే కుటుంబం (బుడ్డా) నుంచి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా బుడ్డా రాజశేఖరరెడ్డిని మీరంతా ఆశీర్వదించి దీవించారు. కానీ ప్రలోభాలకు, మోసాలకు, అన్యాయాలకు పాల్పడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరినీ వదిలిపెట్టలేదు. ఆయన మోసాలు, అబద్ధాలు, ప్రలోభాలు ఏ స్థాయికి చేరాయంటే చివరికి వీరి (బుడ్డా శేషారెడ్డిని చూపిస్తూ) కుటుంబాన్ని కూడా వదిలిపెట్టలేదు. ఈ కుటుంబంపై నాకు నమ్మకం ఉంది. కుటుంబంలో ఒకరు తప్పు చేసినా క్షమించే మంచి గుణాన్ని మనందరికీ దేవుడు ఇచ్చాడు. శేషును(బుడ్డా శేషారెడ్డి) మీరందరూ దీవించండి. మీ అందరి ఆశీస్సులు శేషుపై చూపించండి.
హామీలిచ్చారు.. దగా చేశారు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేయకుండా ఎవరినీ వదిలిపెట్టలేదు. ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే రైతుల రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తామన్నారు. బ్యాంకుల్లో ఉన్న బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని ఎన్నికల ముందు మైకు పట్టుకుని చెప్పారు. అప్పుడు ఏ టీవీలో చూసినా ఇవే హామీలు, ఏ గోడలపై చూసినా ఇవే రాతలు. ఆడవాళ్లని కూడా చూడకుండా డ్వాక్రా అక్కాచెల్లెమ్మలను దగా చేశారు. అధికారంలోకి రాగానే రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు. గద్దెనెక్కాక విస్మరించారు. చివరకు చదువుకుంటున్న పిల్లలను, చదువులు పూర్తిచేసుకొని ఉద్యోగా ల కోసం వెతుక్కుంటున్న వారిని కూడా వదల్లేదు.
జాబు కావాలంటే బాబు ముఖ్య మంత్రి కావాలని ప్రచారం చేశారు. ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. చివరకు మొండిచేయి చూపారు. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధరలు లభించడం లేదు. పేదలకు కనీసం ఒక్క ఇల్లు కూడా కట్టివ్వలేదు. మోసాలకు, అన్యాయాలకు పాల్పడుతున్న చంద్రబాబు ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయం’’ అని జగన్ తేల్చి చెప్పారు. అనంతరం అబ్దుల్లాపురంలో పొలంలో పనిచేస్తున్న వ్యవసాయ కూలీలు, రైతులతో ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడినుంచి బయలుదేరి వెలుగోడులో రోడ్‌షో నిర్వహించారు.
అనంతరం బోయరేవుల గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న చాకలి వెంకటేశ్వర్లు కుటుంబాన్ని పరామర్శించారు. అక్కడి నుంచి మోత్కూరు, తిమ్మనపల్లి వరకూ రైతు భరోసా యాత్ర కొనసాగింది. అనంతరం జగన్ అబ్దుల్లా పురం, మోత్కూరు గ్రామాల్లో స్థానిక రైతులు, కూలీలతో మాట్లాడి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. వారు తమకు పంట గిట్టు బాటు ధర లభించని తీరును, పింఛన్లు అందని వైనాన్ని జగన్ దృష్టికి తెచ్చారు. వారందరికి ఆయన ధైర్యం చెప్పారు. ప్రజల సమస్యలపై వైఎస్సార్ సీపీ పోరాడుతోందని భరోసా ఇచ్చారు.
న్యాయం, ధర్మానిదే గెలుపు
Published Sun, Jan 8 2017 1:07 AM | Last Updated on Sat, Jul 28 2018 3:33 PM
Advertisement
Advertisement