రాయచోటి పరిస్థితిపై వైఎస్ జగన్ ఆరా
- శాంతియుత వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలకు సూచన..
- అదుపులో శాంతిభద్రతలు
రాయచోటి: వైఎస్సార్ జిల్లా రాయచోటి పట్టణంలో శనివారం రాత్రి చోటు చేసుకొన్న పరిణామాలపై వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ఆరా తీశారు. రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, కడప ఎమ్మెల్యే అంజాద్‌బాషాలకు ఫోన్ చేసి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సంఘటన దురదృష్టకరమని, శాంతియుత వాతావరణం నెలకొల్పేలా కృషి చేయాలని సూచించారు. పలువురు ముస్లిం మైనార్టీ నాయకులతో కూడా ఆయన ఫోన్ ద్వారా మాట్లాడారు.
వైఎస్ జగన్ సూచన మేరకు ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, అంజాద్‌బాషా పోలీసు అధికారులతో చర్చించారు. పట్టణ పెద్దలతోనూ సంప్రదింపులు జరిపారు. స్థానిక ఎంపీ మిథున్‌రెడ్డి కూడా వివరాలు తెలుసుకున్నారు. రాయచోటిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో శనివారం రాత్రి నుంచి 144 సెక్షన్‌తో 30 పోలీసు యాక్టును అమలు చేస్తున్నారు. పట్టణంలో ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి వరకు రాయచోటిలో పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో రంగంలోకి దిగిన జిల్లా ఎస్పీ నవీన్ గులాటీ పట్టణ పెద్దలతో చర్చించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.