నేటి నుంచి షర్మిల పరామర్శ యాత్ర
వరంగల్ జిల్లాలో రెండోదశ
* పాలకుర్తి నియోజకవర్గంలో ప్రారంభం
* 11వ తేదీ వరకు కొనసాగనున్న యాత్ర
* 31 కుటుంబాలను పరామర్శించనున్న షర్మిల
* ఏర్పాట్లు పూర్తి చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
సాక్షి ప్రతినిధి, వరంగల్: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబ సభ్యులను తమ కుటుంబంగా భావించి వైఎస్ తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల సోమవారం నుంచి వరంగల్ జిల్లాలో రెండో దశ పరామర్శ యాత్ర చేపడుతున్నారు.
సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు వరంగల్ జిల్లాలో షర్మిల రెండో దశ పరామర్శ యాత్ర సాగనుంది. ఐదు రోజుల యాత్రలో భాగంగా 31 కుటుంబాలను ఆమె పరామర్శిస్తారు. పాలకుర్తి, మహబూబాబాద్, నర్సంపేట, పరకాల, భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాల్లో వైఎస్ తనయ పర్యటిస్తారు. అన్నదాతలు, మహిళలు, పేదలు... అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పాలన సాగించిన వైఎస్ రాజశేఖరరెడ్డి 2009 సెప్టెంబర్ 2న అకాల మరణం పొందారు. ఈ ఘోరాన్ని తట్టుకోలేక వరంగల్ జిల్లాలో చాలా మంది చనిపోయారు.
ఇలా చనిపోయిన వారి కుటుంబాలకు అండగా ఉంటానంటూ జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలు జిల్లా నల్లకాల్వ వద్ద మాట ఇచ్చారు. ఇచ్చిన మాటను ఆచరణలో చూపేందుకు వైఎస్సార్ కుటుంబ ప్రతినిధిగా షర్మిల వరంగల్ జిల్లాలో ఆగస్టు 24 నుంచి 28 వరకు మొదటి దశ పరామర్శ యాత్ర చేపట్టారు. ఐదు రోజులపాటు జిల్లాలోని 32 కుటుంబాలను ఓదార్చారు. వరంగల్ జిల్లాలో ఇంకా 43 కుటుంబాలను పరామర్శించాల్సి ఉంది.
పరామర్శ యాత్ర రెండోదశలో భాగంగా షర్మిల తొలి రోజు సోమవారం పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం గండ్లకుంటలోని ఎడెల్లి వెంకన్న కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఈ యాత్ర కోసం వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు పార్టీ జిల్లా ఇన్‌చార్జి కొండా రాఘవరెడ్డి, జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి.
తొలి రోజు ఇలా...
హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఉదయం 8.30 గంటలకు షర్మిల పరామర్శయాత్రకు బయలుదేరుతారు. జనగామ మీదుగా కొడకండ్ల మండలంలోని గండ్లకుంటకు చేరుకుని ఎడెల్లి వెంకన్న కుటుంబాన్ని పరామర్శిస్తారు. తర్వాత ఇదే మండలంలోని రేగులలో కొత్తగట్టు శాంతమ్మ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఓదారుస్తారు. అక్కడి నుంచి రాయపర్తి మండలం కేశవపురంలో రావుల మహేందర్ కుటుంబాన్ని పరామర్శిస్తారు.
అనంతరం రాయపర్తి మండల కేంద్రంలోని ముద్రబోయిన వెంకటయ్య కుటుంబాన్ని ఓదారుస్తారు. అక్కడి నుంచి తొర్రూరు మండలంలోని నాంచారీ మడూరులో గద్దల ముత్తయ్య, మందపురి కొండమ్మ ఇళ్లకు వెళ్లి వారి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు.
పరామర్శ టూర్ షెడ్యూల్ ఇది...
* సెప్టెంబర్ 7న పాలకుర్తి నియోజకవర్గంలో ఆరు కుటుంబాలకు...
* 8న మహబూబాబాద్ నియోజకవర్గంలో ఏడు కుటుంబాలకు...
* 9న నర్సంపేట నియోజకవర్గంలోని నాలుగు కుటుంబాలకు, ములుగు నియోజకవర్గంలోని ఒక కుటుంబానికి..
* 10న నర్సంపేట, నియోజకవర్గంలో రెండు కుటుంబాలకు, పరకాల నియోజకవర్గంలో ఒక కుటుంబానికి, భూపాలపల్లి నియోజకవర్గంలో నాలుగు కుటుంబాలకు...
* 11న పరకాల నియోజకవర్గంలో నాలుగు కుటుంబాలకు, భూపాలపల్లి నియోజకవర్గంలో రెండు కుటుంబాలకు పరామర్శ.