వరంగల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన పరామర్శ యాత్ర రెండో రోజు కొనసాగుతోంది. మంగళవారం జనగామ నియోజక వర్గంలో షర్మిల యాత్ర మొదలైంది. యాత్రలో భాగంగా ఈరోజు ఆమె ఏడు కుటుంబాలను పరామర్శించనున్నారు. ముందుగా నియోజకవర్గంలోని బచ్చన్నపేట మండల కేంద్రంలోని గుడిసెల లచ్చవ్వ, ఆలువాల యాదగిరి కుటుంబాలను షర్మిల పరామర్శించారు. అనంతరం ఇదే మండలంలోని పోచన్నపేటలోని నేలపోగుల యాదగిరి కుటుంబానికి ఆమె భరోసా ఇచ్చారు. వారికి అండగా ఉంటామని ధైర్యాన్ని ఇచ్చారు. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం షర్మిల స్టేషన్ఘన్పూర్ మండలం నమిలిగొండలోని గాదె శంకర్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం ఇదే మండల కేంద్రంలోని వల్లాల లక్ష్మయ్య కుటుంబానికి, తాటికొండలోని ఎడమ మల్లయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. చివరగా కిష్టాజిగూడెంలోని జక్కుల కొమురయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. రెండో రోజు ఏడు కుటుంబాలను పరామర్శించే క్రమంలో షర్మిల 78 కిలో మీటర్ల దూరం మేర యాత్ర సాగనుంది.