
'ఇలాంటి కేబినెట్ భేటీని ఎన్నడూ చూడలేదు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా కేబినెట్ సమావేశం తీవ్ర నిరాశ పరిచిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ కేబినెట్ భేటీలో ప్రజలకు ఊరట కలిగించే ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన తెలుగుతేజం పీవీ సింధుకు వైఎస్‌ఆర్‌సీపీ తరఫున అభినందనలు తెలిపారు.
సింధుకు ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహం ప్రకటించడం సంతోషకరమన్నారు. కానీ సింధుకు ప్రోత్సాహం ప్రకటించడం, టీటీడీకి, ఓ ప్రైవేటు కంపెనీకి భూములు కేటాయించడం మినహా కేబినెట్‌లో ప్రజా సమస్యలపై చర్చించకపోవడం, ప్రధాన సమస్యల గురించి ప్రస్తావన కూడా చేయకపోవడం దారుణమని విమర్శించారు. ఇలాంటి కేబినెట్ భేటీ గతంలో ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
- రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సమస్యల గురించి కేబినెట్ భేటీలో చర్చించకపోవడం దురదృష్టకరం.
- ప్రధాన సమస్యల గురించి మాట మాత్రమైన మాట్లాడలేదు.
- ప్రజలు ఎంతోగానో కోరుతున్న ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు ఆశ వదులుకున్నారా?
- ప్రత్యేక హోదాపై బాబు మౌనముద్ర దాల్చారు
- పార్లమెంటు సమావేశాల తర్వాత ప్రత్యేక హోదా గురించి ప్రధానితో చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదు?
- నిరుద్యోగ భృతిపై కేబినెట్ భేటీలో కనీస ప్రస్తావన చేయలేదు
- భూముల కేటాయింపులపై ఉన్న శ్రద్ధ ప్రభుత్వానికి సమస్యల పరిష్కారంలో లేదు
- ప్రభుత్వం ఇష్టరాజ్యంగా భూములు కేటాయిస్తున్నది
- ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లో రూ. 4.67 లక్షల కోట్ల మేర పెట్టుబడుల కోసం ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. కానీ వాటి పరిస్థితి ఏమిటో తెలియదు.
- రాష్ట్రంలో 40లక్షల హెక్టార్ల ఖరీఫ్ సాగు విస్తీర్ణం ఉంటే.. అందులో 50శాతం కూడా సాగుకు నోచుకోలేదు .
- ఓవైపు వర్షాభావం, మరోవైపు రుణాలు దొరకక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కరువు పొంచి ఉంది.
- అయినా కేబినెట్ భేటీలో ఏ ఒక్క అంశం కూడా చర్చకు రాలేదు.
- పరిస్థితి విషమంగా ఉన్నా ఏ ఒక్క అంశంపై ప్రభుత్వం సమీక్ష నిర్వహించలేదు.
- పోలవరం అంశంపైనా కేబినెట్ చర్చించలేదు.