ఆయన సృష్టించిన చరిత్రను చెరిపేయడం ఎవరి తరం కాదు
ఎమ్మెల్సీ, ‘మండలి’ చీఫ్‌విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సృష్టించిన చరిత్రని చెరిపేయటం ఎవరి తరం కాదని ఎమ్మెల్సీ, శాసన మండలి చీఫ్‌విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్పష్టంచేశారు. ప్రజల అవసరాలే తన ఎజెండా అని చెప్పిన ఏకైక నాయకుడు ఆయనేనని కొనియాడారు. ఇలాంటి నాయకుడికి ప్రజలందరి ఆశీస్సులు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరించి భారీ కేక్‌ను కట్ చేశారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పేదలకు దుస్తులు పంపిణీ చేశారు.
అనంతరం జరిగిన సభలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. చంద్రబాబుకు అధికారం మీద మాత్రమే ప్రేమ అని.. ప్రజలు, వారి అవసరాల మీద ఏమాత్రం లేదన్నారు. ఈ ఐదేళ్లలో నేను మంచి చేశాననిపిస్తేనే ఓటెయ్యమని సీఎం జగన్ అంటున్నారని.. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ ఇలాంటి నాయకుడ్ని చూడలేదని ఉమ్మారెడ్డి అన్నారు.
అన్నిచోట్లా వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్..
గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. ముగ్గురు కాదు 30 మంది కలిసొచ్చినా వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీదే గెలుపు అని స్పష్టంచేశారు. 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలను వైఎస్సార్‌సీపీ స్వీప్ చేయబోతోందన్నారు. వైఎస్ జగన్ లాంటి సీఎం మాకు కూడా ఉంటే బాగుంటుందని ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా కోరుకుంటున్నారన్నారు.
చరిత్ర సృష్టించటం సీఎం జగన్‌కే సాధ్యమని.. కుప్పంలో చంద్రబాబుని, మంగళగిరిలో లోకేశ్‌ని ఓడించి తీరుతామని మంత్రి ధీమా వ్యక్తంచేశారు. గుంట నక్కలు, తోడుదొంగలు చేసే నీచ రాజకీయాలను ఎదుర్కొనేందుకు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని జోగి రమేష్ పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ‘మండలి’లో విప్ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ అంటేనే విశ్వసనీయతకు మారుపేరని.. ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టోను అమలుచేసిన ఘనత ఆయనదేనని కొనియాడారు.
అన్ని వర్గాలకూ అండగా సీఎం జగన్..
ఇక వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. 13 ఏళ్లుగా ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి వైఎస్ జగన్ అని తెలిపారు. రైతులు, కార్మికులు, మహిళలు, యువత.. ఇలా అన్ని వర్గాలకు ఆయన అండగా నిలిచారన్నారు. ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ.. సీఎం జగన్ ఉంటేనే అందరికీ మేలు జరుగుతుందని స్పష్టంచేశారు. ఆయన్ని అణచివేయాలని ఎంతోమంది చూశారని.. కానీ, ఎన్ని కుట్రలు పన్నినా ఎదుర్కొని సీఎం జగన్ విజేతగా నిలిచారన్నారు.
ఐదేళ్లలో హామీలన్నీ నెరవేర్చారు..
ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. పార్టీ పెట్టినప్పటి నుండి సీఎం జగన్ పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావని.. వాటన్నింటినీ ఎదుర్కొని, తట్టుకుని అధికారం సాధించారన్నారు. ఈ ఐదేళ్లలో ఆయన చెప్పిన హామీలన్నింటినీ నెరవేర్చారని గుర్తుచేశారు. ఇక చంద్రబాబు ఢిల్లీలో బీజేపీ నేతల ఇళ్ల ముందు పడిగాపులు కాశారని.. ఇలాంటి వారు ప్రజలకు ఏం చేస్తారని సురేశ్ ప్రశ్నించారు. మోసాలలో పుట్టి మోసాలు చేసే చంద్రబాబు అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో ప్రజలందరికీ తెలుసునన్నారు.
అంతకుముందు.. వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నేత పానుగంటి చైతన్య నాయకత్వంలో విద్యార్థులు, యువజనులు జైజై నినాదాలతో భారీగా తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు సలహాదారులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, కార్యకర్తలు, ఎన్‌ఆర్‌ఐ ప్రతినిధులూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే, పార్టీ 14వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ రకాల సేవా కార్యక్రమాలు ఏర్పాటుచేశారు.
‘జగన్ అనే నేను’..
ఇదిలా ఉంటే.. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద డిజిటల్ బోర్డు ఏర్పాటుచేశారు. మంత్రి జోగి రమేష్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డితో పాటు పలువురు పార్టీ నేతలు ‘జగన్ అనే నేను..’ ఈ కౌంట్‌డౌన్ బోర్డును ఆవిష్కరించారు. 73 రోజుల్లో జగన్ మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారని చెప్పేందుకు చిహ్నంగా ఈ బోర్టు పెట్టినట్లు పార్టీ నేతలు తెలిపారు.
మరోసారి గొప్ప విజయం సాధించేందుకు మీరంతా సిద్ధమా?
వైఎస్సార్‌సీపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ పిలుపు
సాక్షి, అమరావతి: ‘నేడు మన వైఎస్సార్‌సీపీ 14వ వ్యవస్థాపక దినోత్సవం. ఆనాడు వందమంది ఏకమై మనపై యుద్ధానికి వస్తే.. అప్పుడు నాకు రక్షణగా నిలిచిన ప్రజల కోసం ప్రారంభమైన పార్టీ మన వైఎస్సార్‌సీపీ. ఇన్నాళ్లూ నా ప్రతి అడుగులోనూ అండగా నిలిచిన ప్రతి ఒక్క కార్యకర్తకు, అభిమానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు’ అంటూ ఎక్స్‌లో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ మంగళవారం పోస్ట్ చేశారు. ప్రజాక్షేత్రంలో మరోసారి మనం గొప్ప విజయం సాధించేందుకు మీరంతా సిద్ధమా? అంటూ కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment