
'నాయుళ్లది ఇద్దరిదీ చెరో మాట'
హైదరాబాద్: ఢిల్లీ వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఏం అడిగారని వైఎస్ఆర్ సీపీ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. రాష్ట్రంలోని కీలక సమస్యలపై కేంద్రంతో చర్చించారా, ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తారా అని నిలదీశారు. చంద్రబాబు నాయుడు ఒకమాట, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మరో మాట చెబుతున్నారని విమర్శించారు.
ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు చర్చించిన అంశాలపై నివేదికను బయటపెట్టాలని బొత్స డిమాండ్ చేశారు. ప్రజలకు వాస్తవాలను వివరించాలని, రాష్ట్రాన్ని సంక్షోభం దిశగా తీసుకెళ్లవద్దని సూచించారు. స్థానిక సంస్థలకు పన్నులు చెల్లిస్తున్నారని, కొత్తగా స్వచ్ఛ భారత్ పన్ను ఎందుకని ప్రశ్నించారు.