
బ్రాహ్మణులంటే బాబుకు చులకన
- ఏపీ సీఎంపై ధ్వజమెత్తిన మల్లాది విష్ణు
విజయవాడ సెంట్రల్ : బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎప్పుడూ చిలకనగానే చూస్తారని, అందుకు ఒకానొక నిదర్శనం ఐవైఆర్ కృష్ణారావును బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి అకారణంగా తొలగించడమని కాంగ్రెస్ పార్టీ విజయవాడ సిటీ అధ్యక్షుడు మల్లాది విష్ణు అన్నారు.
పార్టీ నాయకులతో కలిసి విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో మల్లాది విలేకరులతో మాట్లాడారు. నీతి, నిజాయితీగా బాధ్యతలు నిర్వహిస్తున్న కృష్ణారావును పదవి నుంచి తొలగించడం అనైతికంమని, తద్వారా రాష్ట్రంలో బ్రాహ్మణుల మనోభావాలను బాబు దెబ్బతీశారని మండిపడ్డారు.
‘ఆరునెలలుగా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదంటే కృష్ణారావు ఎంత మానసిక వేదన అనుభవించి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. కార్పొరేషన్ చైర్మన్ హోదాలో కృష్ణారావు.. స్థానిక వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతిని కలిస్తే తప్పేంటి? చంద్రబాబు సంక్షేమ పథకాలకు రాజకీయ రంగు పూస్తున్నారనడానికి ఇది తాజా నిదర్శనం కాదా?’ అని మల్లాది ప్రశ్నించారు.
విశాఖ భూకుంభకోణంపై కేంద్రానికి ఫిర్యాదు
ఇదేఏపీసీసీ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక, రవాణా మాఫియాలు పేట్రేగుతున్నాయన్నారు. విశాఖ భూ కుంభకోణంపై పార్టీ పెద్దలతో కల్సి ఈనెల 22న కేంద్రహోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆందోళనకు కాంగ్రెస్ పూర్తి మద్ధతు ప్రకటించిందన్నారు.