సాక్షి నెట్‌వర్క్: ‘ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయండి.. లేదా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి’ అనే డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరులో చేపట్టిన సమర దీక్షకు సంఘీభావంగా సీమాంధ్ర జిల్లాల్లో వైఎస్సార్ సీపీ నేతలు చేపట్టిన ఆమరణ దీక్షలు కొనసాగుతున్నాయి. ఆరోగ్యం క్షీణిస్తున్నా లెక్కచేయక మొక్కవోని ధైర్యంతో కొనసాగిస్తున్న వీరికి జనమద్దతు పోటెత్తుతోంది. పార్టీలు, వర్గాలకతీతంగా ప్రజలు దీక్షాశిబిరాలను సందర్శించి సంఘీభావం ప్రకటిస్తున్నారు.
అనంతపురం జిల్లా పుట్టపర్తిలో డాక్టర్ హరికృష్ణలు చేపట్టిన ఆమరణ దీక్ష శుక్రవారంతో ఐదో రోజులు పూర్తి చేసుకుని శనివారం ఆరోరోజుకు చేరాయి. ఆరోగ్యం క్షీణించినా దీక్ష విరమించేదిలేదని వారు స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ కర్నూలు నియోజకవర్గం సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి ఆమరణ దీక్ష శనివారంతో ఆరో రోజుకు చేరింది. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రచార కన్వీనర్ విజయ చందర్ దీక్షా శిబిరాన్ని సందర్శించి ఎస్వీ మోహన్‌రెడ్డికి సంఘీభావం ప్రకటించారు. వైఎస్సార్ జిల్లా కడప కలెక్టరేట్ వద్ద వైఎస్సార్ సీపీ యువజన విభాగం అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, అంజాద్‌బాష, నాగిరెడ్డి దీక్షలు శుక్రవారంతో ఐదవ రోజులు పూర్తయి శనివారంతో ఆరోరోజుకు చేరాయి.
శుక్రవారం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సమైక్యవాదులు పెద్దఎత్తున తరలిరావడంతో కలెక్టరేట్ ప్రాంతం జనసంద్రమైంది. శ్రీకాకుళంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ బొడ్డేపల్లి పద్మజ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శుక్రవారంతో మూడురోజులు పూర్తి చేసుకుని శనివారంతో నాలుగురోజుకు చేరింది. అదేవిధంగా పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు తిరివీధి వేణుగోపాల్, చింతలపూడిలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కర్రా రాజారావు, ధర్మాజీగూడెంలో మట్టా సురేష్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. అనంతపురం జిల్లా కదిరిలో ఎన్‌ఎండీ ఇస్మాయిల్ ఆమరణ దీక్ష మూడో రోజుకు చేరుకుంది. ఇక సీమాంధ్రలోని అన్ని జిల్లాల్లోనూ విజయమ్మ దీక్షకు మద్దతుగా చేపట్టిన రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి.
కాపు భారతి, పైలాల దీక్ష భగ్నం
సాక్షి నెట్‌వర్క్: వైఎస్ విజయమ్మ సమరదీక్షకు మద్దతుగా అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సతీమణి కాపు భారతి, తాడిపత్రిలో వైఎస్‌ఆర్‌సీపీ సీఈసీ సభ్యుడు పైలా నర్శింహయ్య గత ఐదురోజులుగా చేపట్టిన ఆమరణ దీక్షలను శుక్రవారం పోలీసులు భగ్నం చేశారు. రాయదుర్గంలో ఐదురోజులుగా దీక్ష చేస్తున్న భారతి ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు సూచించడంతో పోలీసులు మధ్యాహ్నం పెద్దసంఖ్యలో శిబిరం వద్దకు చేరుకున్నారు. పోలీసుల రాకతో శిబిరంలో ఒక్కసారిగా ఉద్రిక్తవాతావరణం నెలకొంది.
భారతి ప్రతిఘటించినా, కార్యకర్తలు అడ్డుకున్నా పెద్దసంఖ్యలో మోహరించిన పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే, వైద్యసేవలకు సహకరించకుండా ఆస్పత్రిలోనూ దీక్ష కొనసాగిస్తానని ఆమె పట్టుబట్టారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తోందని చెప్పిన వైద్యులు ఎట్టకేలకు ఆమెను ఒప్పించి సాయంత్రం నుంచి వైద్యసేవలు ప్రారంభించారు. తాడిపత్రిలో పైలా నర్శింహయ్య దీక్షను శుక్రవారం రాత్రి 9.30 గంటలకు పోలీసులు భగ్నం చేశారు. సాయంత్రం ఆయన్ను పరీక్షించిన వైద్యులు.. ఆరోగ్యం క్షీణించిందని పోలీసులకు చెప్పడంతో దీక్ష స్థలికి చేరుకున్న వారు పైలాను బలవంతంగా 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. దీక్ష విరమణకు ఆయన ససేమిరా అనడంతో బలవంతంగా సెలైన్ ఎక్కించారు.
ఆరోగ్యం క్షీణిస్తున్నా లెక్కచేయక...
Published Sat, Aug 24 2013 2:29 AM | Last Updated on Fri, May 25 2018 9:10 PM
Advertisement
Advertisement