
అరక లేకుండానే అంతర కృషి!
పత్తి చేను కోసం గొర్రును తయారు చేసుకొని.. రెండేళ్లుగా వాడుతున్న రైతు తెలకపల్లి నరసింహారావు
ఏటా ఎకరాకు రూ. 6 వేల వరకూ అరకల ఖర్చు ఆదా
ఈ గొర్రుంటే కలుపు మందు అవసరం లేదంటున్న శాస్త్రవేత్త డా. మల్లిఖార్జున్ రావు
మనుషులు గుంజే గొర్రును తయారుచేసి రెండేళ్లుగా అరక అవసరం లేకుండానే మూడెకరాల పత్తి పొలంలో పైపాటు(అంతర కృషి) చేస్తున్నారు తెలకపల్లి నరసింహరావు (94403 56925) అనే రైతు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పడమటి లోకారం ఆయన స్వగ్రామం. ఈయనకు సొంత అరకల్లేవు. బాడుగ అరకల కోసం తిరిగి విసిగిపోయి మనుషులు సులువుగా గుంజేందుకు వీలుగా ఉండే గొర్రును తయారు చేయించారు.
వేరే గ్రామంలో ఒక రైతు గొర్రును గుంజుతూ పైపాటు చేస్తుండగా చూసిన నరసింహారావు ఆసక్తిగా వివరాలు తెలుసుకు న్నారు. ఆ గొర్రు 15 కిలోల బరువుంది. భూమిలోకి చొచ్చుకువెళ్లే పాయింట్లు 3 ఉన్నాయి. ఇవి కూడా పెద్దగా ఉన్నాయి. దీన్ని వాడుతున్నప్పుడు భూమిలోకి లోతుగా దిగబడుతున్నది. చాలా బలంగా లాగాల్సి వస్తున్నది. ఇద్దరు మనుషులు కూడా దీనితో పైపాటు చేయటం కష్టంగానే ఉంది.
ఆ గొర్రును పరిశీలనగా చూసిన తర్వాత.. కొన్ని మార్పులు చేస్తే దాన్ని సులువుగా ఉపయోగించుకోవచ్చన్న ఆలోచన నరసింహరావు మదిలో మెదిలింది. గొర్రు బరువును 5 కిలోలకు తగ్గించాడు. పాయింట్ల సైజు బాగా తగ్గించి, సంఖ్యను 5కు పెంచాడు. రూ. వెయ్యితో గొర్రు తయారైంది. పెద్దగా బలం ఉపయోగించనవసరం లేదు. ఆడవాళ్లు కూడా దీనితో సులభంగా గుంజుతూ అంతర కృషి చేయవచ్చు. దానిపైన 3 కిలోల బరువు ఉంచి ఒక్క మనిషే పైపాటు పని చేసుకోవడా నికి వీలుగా ఉంది. గత రెండేళ్లుగా ఈ గొర్రుతోనే నరసింహారావు తన పత్తి పొలంలో పైపాటు చేస్తున్నారు. గొర్రు గుంజిన తర్వాత మిగిలే కలుపును పూర్తిగా తొలగించడానికి చిన్న గుంటకను కూడా ఉపయోగిస్తున్నారు. ట్రాక్టర్లు, అరకతో పైపాటు చేసేటప్పుడు గట్ల వెంబడి మొక్కలు విరిగిపోతాయి. దీనితో ఆ ఇబ్బంది లేదు. పత్తి మొక్కలు బాగా పెరిగాక కూడా కొమ్మలు పక్కకు జరుపుకుం టూ పైపాటు చేయవచ్చు.
మూడెకరాల పత్తిలో ఈ గొర్రుతోనే పైపా టు చేస్తూ నరసింహరావు ఎకరాకు రూ. 6 వేల వరకూ అరకల ఖర్చు తగ్గించుకుంటున్నారు. దీని ప్రయోజనాన్ని గుర్తించిన ఆ గ్రామ రైతులు 30 మంది ఇటువంటి గొర్రులను తయారు చేయించి వాడుతున్నారు.
- ప్రేమ్‌చంద్, వైరా, ఖమ్మం జిల్లా .
చిన్న రైతులకు ఉపయోగం
కలుపు చిన్నగా ఉన్నప్పుడే ఈ గొర్రుతో నిర్మూలిస్తే కలుపు మందులు వాడాల్సిన అవసరం ఉండదు. చిన్న రైతులు అరకల కోసం రోజుల తరబడి ఎదురుచూడకుండా ఈ గొర్రుతో రోజుకు కొంతమేరకు స్వయంగా అంతర సేద్యం చేసుకోవచ్చు.
- డా. మల్లిఖార్జున్‌రావు
(99896 23831),
కృషి విజ్ఞాన కేంద్రం, వైరా, ఖమ్మం