కాండం తొలిచే పురుగులకు కషాయాలతో కట్టడి! | Can be protected paddy crops with Saffrons from Insects | Sakshi
Sakshi News home page

కాండం తొలిచే పురుగులకు కషాయాలతో కట్టడి!

Published Mon, Aug 11 2014 12:25 AM | Last Updated on Sat, Sep 2 2017 11:41 AM

కాండం తొలిచే పురుగులకు కషాయాలతో కట్టడి!

కాండం తొలిచే పురుగులకు కషాయాలతో కట్టడి!

* వరిలో 20-80% వరకు దిగుబడి
* నష్టం జరిగే అవకాశం
* అగ్నిఅస్త్రం, బ్రహ్మాస్త్రం వంటి కషాయాలతో నివారణ సాధ్యమే
* వీటిని స్వల్ప ఖర్చుతో రైతు స్వయంగా తయారు చేసుకోవచ్చు


రైతుల ఆశలకు నీరు పోసి, పాదుచేస్తుందని ఆశపడిన విజయనామ సంవత్సరం నిప్పులు పోసింది. సగం వానాకాలం వెళ్లిపోయినా నీరు నిండి మసక్కమ్మిన కళ్లతో రైతులింకా వాన మేఘాల జాడ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. బోర్లలో అందుబాటు నీటితో అక్కడో ఇక్కడో కొద్దిమంది సాగుబాటు చేసి వరినాట్లు పూర్తి చేసుకున్నారు. గోరుచుట్టు మీద రోకటిపోటులా వరిలో కాండం తొలిచే పురుగు, తాటాకు తెగులు ఆశించినట్లు తెలుస్తోంది. వరి పంటను నష్టపరిచే పురుగుల్లో కాండం తొలిచే పురుగు ముఖ్యమైనది. దీని వల్ల పంట నష్టం 20-50 శాతం వరకు ఉంటుంది. తీవ్రత పెరిగితే నష్టం 80 శాతానికి ఎగబాకే ప్రమాదం ఉంది.

కాండం తొలిచే పురుగు వరి సాగు చేసే ప్రాంతాలంతటా ఉంది. ఇందులో ప్రధానంగా ఆరు రకాలున్నాయి. పసుపు పచ్చ,  తెలుపు, గులాబీ,  చారల పురుగు, బంగారు అంచు పురుగులు ఆశిస్తుంటాయి. ప్రధానంగా పసుపు, తెల్ల పురుగులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. కాండం తొలిచే పురుగు నారు పోసింది మొదలు వెన్నువేసే వరకు ఏ దశలోనైనా దాడి చేసే అవకాశం ఉంది.

నిలువ నీరు అధికంగా ఉండే డెల్టా ప్రాంతాల్లో కాండం తొలిచే పసుపు పచ్చ పురుగులు, మెట్ట ప్రాంతాల్లో ఇతర రకాలు ఎక్కువగా ఆశిస్తాయి. ఇవి ఆకుల అంచుల మీద గుడ్డు పెట్టి పొదుగుతాయి. వెలువడిన లార్వాలు అక్కడి నుంచి మొగిని చేరుకొని కాండాన్ని తినివేస్తాయి. కాండం తొలిచే పురుగు ఉధృతికి చేలో కలుపు, అధిక నత్రజని వినియోగం దోహదం చేస్తాయి. ఆలస్యంగా నాట్లు వేసిన ప్రాంతాల్లో దీని దాడి మరింత పెరిగే అవకాశం ఉంది. కొద్దిపాటి మెలకువతో ఉంటే వీటి నివారణ సాధ్యమే.

ఎలా గుర్తించాలి?
ఎదిగే దశలో కర్రను లాగితే మొగి ఊడి వస్తుంది. దానిలో లార్వాలు కనిపిస్తాయి. వరి పిలకల మీద చిన్న చిన్న రంధ్రాలుంటాయి. వెన్నువేసే దశలో ఐతే తాలు కంకులు కనిపిస్తాయి. కాండం తొలిచే పురుగు, కాయతొలిచే పురుగులకు సుభాష్ పాలేకర్ రూపొందించిన అగ్ని అస్త్రం, బ్రహ్మాస్త్రం కషాయాలు అద్భుతంగా పనిచేస్తాయి.

అగ్ని అస్త్రం తయారీ ఇలా..
అగ్ని అస్త్రం తయారీకి 20 లీటర్ల ఆవు మూత్రం సేకరించాలి. అర కిలో పచ్చిమిర్చి ముద్ద, కిలో పొగాకు రద్దు, అర కిలో వెల్లుల్లి ముద్ద ఆవు మూత్రానికి కలిపి, ఆ ద్రావణాన్ని ఓ బాణలిలో పోయాలి. మూడుసార్లు పొంగు వచ్చేటట్లు మరగకాచిన తరువాత.. పొయ్యి మీద నుంచి దించి నీడలో పెట్టాలి. రెండు రోజుల పాటు ఈ ద్రావణం పులిసిన తరువాత వడకట్టి మరో పాత్రలో నిలువ చేసుకోవాలి. ఎకరా పొలానికి పిచికారీ చేసేందుకు రెండున్నర లీటర్ల అగ్ని అస్త్రం ద్రావణాన్ని 100 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. పురుగు ఉధృతిని బట్టి వారం ఎడంతో రెండుసార్లు పిచికారీ చేస్తే సరిపోతుంది.

బ్రహ్మాస్త్రం తయారీ ఇలా..
బ్రహ్మాస్త్రం తయారీకి 2 కిలోల ముద్దగా నూరిన వేపాకు, రెండు కిలోల సీతాఫలం ఆకుల ముద్ద, 2 కిలోల ఉమ్మెత్త ఆకుల ముద్దను సిద్ధం చేసుకోవాలి. వీటిని 20 లీటర్ల ఆవు మూత్రంలో కలిపి నాలుగు పొంగులు వచ్చే వరకు మరిగించి చల్లార్చాలి. వడకట్టిన ద్రావణం ప్లాస్టిక్ డబ్బాలో నిలువ చేసుకొంటే ఆరు నెలల వరకు వినియోగించుకోవచ్చు. రెండు నుంచి రెండున్నర లీటర్ల బ్రహ్మాస్త్రం 100 లీటర్ల నీటికి కలిపి ఒక ఎకరా పొలానికి పిచికారీ చేసుకోవచ్చు. 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకుంటే పూర్తి ఫలితం ఉంటుంది.

కాండం తొలిచే పురుగు నివారణకు ఇతర చర్యలు:ఙఞ్చట-    పురుగు ఆశించిన పొలాన్ని ఆరగట్టాలి. దీని వలన లార్వాలు మరణిస్తాయి. ఆరగట్టడం వీలుకాని డెల్టా ప్రాంతంలో నీటి మట్టం పెంచి, తీస్తూ ఉండాలి. దీని వలన లార్వాలకు ప్రాణవాయువు అందక మరణిస్తాయి.
సాగు నీటి కాలువలో పచ్చి పేడ వేయాలి. ఇది నీటిలో కరిగి పొలమంతా విస్తరించి లార్వాలను నాశనం చేస్తుంది. వాసనకు పురుగులు పారిపోతాయి.
- ఉత్తరాంధ్ర ప్రాంతంలో కంపురొడ్డ, మిడత కర్ర అనే కలుపు మొక్కలు విరివిగా పెరుగుతాయి. వీటిని కోసి తెచ్చి గట్ల మీద కుప్పలుగా వేయడం, నీటి కాలువలో వేయడం వలన ఈ వాసనకు పురుగులు పారిపోతాయి.
-    పొలం గట్ల మీద వాయిలాకు, సీతాఫలం ఆకులను కాల్చి పొగపెట్టడం ద్వారా కూడా మంచి ఫలితాలుంటాయన్నది తమిళనాడు రైతుల అనుభవం.
- ఆవు మూత్రం, వాయిలాకు, ఇంగువ కషాయం తయారు చేసుకొని వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసి కూడా ఈ పురుగు బెడదను వదిలించుకోవచ్చు
-    అరలీటరు వేప నూనెను 4 కిలోల మట్టిలో కలిపి.. దానికి మరో 4 కిలోల పేడతో పిసికి ముద్ద చేసి పెట్టుకోవాలి. పులిపచ్చిగా ఉన్న దశలో పొలమంతా వెదజల్లుకోవాలి
-    వాయిలాకు, పిసింగి ఆకు, వేపగింజల పొడి, కలబందలను కిలో చొప్పున సేకరించి.. 20 లీటర్ల ఆవు మూత్రంలో కలిపి.. బాగా మరిగించి వడకట్టి పెట్టుకోవాలి. 100 లీటర్లకు 2 లీటర్ల ఈ ద్రావణం కలిపి ఎకరా పొలానికి పిచికారీ చేసుకోవచ్చు.
-    సహజ క్రిమినాశక ద్రావణాలను పిచికారీ చేసిన తరువాత వారం రోజుల్లో పంటను పరిశీలించి.. అవసరమైతే  రెండోసారి పిచికారీ చేసుకోవాలి
    కాండం తొలిచే పురుగు ఆశించిన పైరు కోసిన తరువాత కొయ్యకాళ్లు తగలబెడితే అందులోని లార్వాలు, గుడ్లు నశిస్తాయి. జీవనియంత్రణ పద్ధతిలో ట్రైై కోగ్రామా కార్డులను వాడడం ద్వారా నియంత్రించవచ్చు.
- జిట్టా బాల్‌రెడ్డి, ‘సాగుబడి’ డెస్క్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement