
కొబ్బరి పాలు + పుల్ల మజ్జిగ..!
పంట పెట్టడం ఒకెత్తయితే.. అది ఆరోగ్యంగా ఎదిగేలా చూసుకోవడం ఒకెత్తు.
పంట పెట్టడం ఒకెత్తయితే.. అది ఆరోగ్యంగా ఎదిగేలా చూసుకోవడం ఒకెత్తు. మార్కెట్‌లో నూరారు పేర్లతో గ్రోత్ ప్రమోటర్లను అమ్ముతున్నారు. అయితే, వీటిని కొనకుండా కొద్దిపాటి శ్రమతో ఇంటి వద్దే పెద్ద ఖర్చేమీ లేకుండా తయారు చేసుకోవచ్చు. మొక్కల ఎదుగుదలకు ఉపయోగపడే అక్సిన్స్, గిబ్బర్లిన్ తదితరాలు ‘నర్రెంగ’ మొక్కలో దండిగా ఉన్నాయి. దీని శాస్త్రీయ నామం ‘అల్బీజీయా అమరా’. నర్రెంగ ఆకులను ఒక కిలో తీసుకొని.. ఐదు లీటర్ల పుల్ల మజ్జిగలో వేసి.. వారం రోజుల పాటు పులియబెట్టాలి. ఆ తరువాత వడకట్టి లీటర్ ద్రావణాన్ని 20 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.
నర్రెంగ మొక్కలు దొరక్కపోతే? మరో మార్గం ఉంది. పచ్చి కొబ్బరిని రుబ్బి, పాలు తీయాలి. ఐదు లీటర్ల కొబ్బరి పాలకు ఐదు లీటర్ల మజ్జిగను చేర్చి.. ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో పోసుకొని పులియబెట్టు కోవాలి. వారం తరువాత ద్రావకాన్ని వడకట్టుకొని లీటరు ద్రావణాన్ని 20 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ రెండు ద్రావణాలు పంటల ఎదుగుదలకే కాకుండా పూత, పిందె బాగా రావడానికి ఉపయోగపడతాయి.