‘లెవీ’ మారినా.. మారని రైతన్న తలరాత! | Has become the procurement process. | Sakshi
Sakshi News home page

‘లెవీ’ మారినా.. మారని రైతన్న తలరాత!

Published Wed, Nov 12 2014 11:07 PM | Last Updated on Sat, Sep 2 2017 4:20 PM

‘లెవీ’ మారినా..  మారని రైతన్న తలరాత!

‘లెవీ’ మారినా.. మారని రైతన్న తలరాత!

ధాన్యం సేకరణ విధానం మారింది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి కొత్త లెవీ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇన్నాళ్లూ లెవీ విధానాన్ని మార్చాలన్న మిల్లర్లు ఇప్పుడు కొత్త రాగం అందుకున్నారు. కొత్త విధానం తమకు నష్టదాయకమంటూ ధాన్యం ధర తగ్గించి కొంటున్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో కొనుగోళ్లు చేపడితే తప్ప.. ధాన్యం రైతు దైన్యస్థితి నుంచి బయటపడే పరిస్థితి లేదంటున్నారు వ్యాసకర్త సత్యకృష్ణ.
 
బియ్యం మిల్లర్లను కట్టడి చేసి బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలకు అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో గత నెలలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రా - తెలంగాణ రాష్ట్రాల్లో ప్రవేశపెట్టిన నూతన లెవీ విధానం రెండు రాష్ట్రాల వరి రైతులకు చుక్కలు చూపిస్తోంది. నూతన లెవీ విధానంతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో తెలుగు రాష్ట్రాల ధాన్యం మార్కెట్‌లో చిత్రమైన పరిస్థితి తలెత్తింది. చాలాకాలంగా తాము కోరుతున్న లెవీ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుండటంతో ఆనందించవలసిన ధాన్యం మిల్లర్లు.. తీరా అమల్లోకొచ్చాక ఇప్పుడీ విధానం వద్దు మొర్రో అంటున్నారు. ఏతావాతా ధాన్యం సేకరణ విధానం మారినా రైతులకు గిట్టుబాటు ధర దక్కని దుస్థితే కొనసాగుతోంది.
 
ధాన్యం సేకరణ ఖర్చు తగ్గింపు లక్ష్యంగా..

25:75 లెవీ విధానం వల్ల కేంద్రానికి ధాన్యం సేకరణ వ్యయం 15 నుంచి 20 శాతం తగ్గుతుంది. అందువల్లనే దేశమంతటా ఒకే విధమైన ధాన్యం సేకరణ విధానం ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. ఈ విధానం ఉత్తరాది రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో అమల్లో ఉంది. ముఖ్యంగా పంజాబ్, ఛత్తీస్‌గఢ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ విధానం విజయవంతంకావటంతో దేశమంతటా దీన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరమే గట్టి నిర్ణయం తీసుకుంది. అయితే, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఒక ఏడాది గడువు కోరాయి. గడువు తీరినప్పటికీ.. విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు మరో ఏడాది గడువు కోరాయి. అందుకు కేంద్ర ప్రభుత్వం ససేమిరా అంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్ ఒకటో తేదీ నుంచి 75:25 లెవీ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. మిల్లర్లు గతంలో 100 బస్తాల బియ్యం తయారు చేస్తే 75 బస్తాలు బియ్యం భారత ఆహార సంస్థ(ఎఫ్.సి.ఐ.)కు లెవీగా ఇచ్చి, 25 బస్తాలు బహిరంగ మార్కెట్‌లో అమ్ముకునేవారు. ఇప్పుడు 25 బస్తాల బియ్యం లెవీగా ఇచ్చి 75 బస్తాలు బహిరంగ మార్కెట్‌లో అమ్ముకోవాల్సి ఉంటుంది. ఇది తమకు గిట్టుబాటుకాదని మిల్లర్లు అంటున్నారు. అక్టోబర్ 27న ఇరు రాష్ట్రాల ధాన్యం మిల్లుల సంఘం అధ్యక్షుడు నేరుగా ఢిల్లీ వెళ్లి కేంద్ర ఆహార, వినియోగదారుల మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్‌కు కొత్తలెవీ విధానం ప్రకారం 75 శాతం బియ్యాన్ని తాము అమ్ముకోలేమని మొరపెట్టుకున్నా కేంద్రం పట్టించుకోలేదు.

మాట మార్చిన మిల్లర్లు

పాత విధానం(75:25)తో తమకు తీవ్ర నష్టాలొచ్చేస్తున్నాయంటూ ఇంతకాలం మిల్లర్లు గగ్గోలు పెడుతూ వచ్చారు. కొన్ని సందర్భాల్లో ఈ సాకుతో మద్దతు ధరలో 10 శాతం కోత పెట్టేవారు. బియ్యం మార్కెట్‌లో కృత్రిమ కొరత సృష్టించి ముఖ్యంగా సన్న బియ్యం ధర పెంచేసి లాభాలు గడించేవారు. అందుకే, ధాన్యం సేకరణ ఖర్చును తగ్గించుకోవడంతోపాటు బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలకు కళ్లెం వేసే లక్ష్యంతో కేంద్రం తెలివిగా లెవీని 25 శాతానికి కుదించింది. అయితే, మిల్లర్లు ఇప్పుడు మాట మార్చి.. పెద్ద మొత్తంలో బియ్యం అమ్ముకునే అవకాశం లేనందున ధాన్యం కొనుగోళ్లు ఆపేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు.
 
తెగనమ్ముకుంటున్న రైతులు


ఈలోగా నవంబర్ మొదటి వారంలో వరి కోతలు మొదలయ్యాయి. విధానం మారినా రైతు పరిస్థితి మెరుగుపడలేదు. మిల్లర్లు ఇచ్చే ధరకే రైతులు ధాన్యాన్ని తెగనమ్ముకోవాల్సిన దుస్థితే కొనసాగుతోంది. ఈ కొత్త విధానం వల్ల గత ఏడాదితో పోల్చి చూస్తే బస్తా(75 కిలోలు)కు కనీసం రూ. 50 నుంచి 100 ధరను కోల్పోతున్నట్లు రైతులు చెబుతున్నారు. ముఖ్యంగా సన్నరకాల ధాన్యం అమ్మకాలపైనే ఆశలన్నీ పెట్టుకున్న వారికైతే మరింత నష్టం జరుగుతోంది. సన్న రకాల ధాన్యం బస్తా రూ. 1,400 అమ్మవలసి ఉండగా, రూ. 1,200 కూడా గిట్టుబాటు కావటం లేదు. సాధారణ రకాలకు రూ. వెయ్యి నుంచి రూ. 1,100 ఆశిస్తే రూ. 900 నుంచి 950 లభిస్తున్నాయి.  కేంద్ర ప్రభుత్వం ధాన్య సేకరణ విధానాన్ని సమూలంగా మార్చివేసినా రాష్ట్ర ప్రభుత్వం అంతగా పట్టించుకోకపోవటం ఆంధ్రప్రదేశ్ రైతులను కలవరపరుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం మొదట్లో నూతన లెవీ విధానాన్ని స్వాగతించినా తర్వాత వ్యతిరేకించింది. తెలంగాణ ప్రభుత్వ వాదనను కేంద్రం పట్టించుకోదని తేలిపోయింది. కానీ, ఆంధ్రప్రదేశ్ రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత కేంద్ర మంత్రి పాశ్వాన్‌కు ఇటీవల విజ్ఞప్తి చేసినా సానుకూలంగా స్పందించలేదు. అయితే, ముఖ్యమంత్రి దీన్ని అంతగా పట్టించుకున్న దాఖలాల్లేవు.

మిల్లర్లకు ముకుదాడు వేసేందుకు ప్రభుత్వం నేరుగా ఎఫ్.సి.ఐ., సివిల్ సప్లయిస్ కార్పొరేషన్, మహిళా సంఘాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాల్సి ఉంటుంది. అయితే, ఇంకా ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇంకా ఏర్పాటు కాక రైతులు ధాన్యాన్ని తెగనమ్ముకుంటున్నారు. వాస్తవానికి ప్రభుత్వ కేంద్రాలకు వెళ్లి ధాన్యం అమ్ముకునే అలవాటు తెలంగాణ జిల్లాల్లో కొంతవరకు ఉంది. కానీ, ఆంధ్రా రైతులకు ఆ అలవాటు అంతగా లేదు. నేరుగా కళ్లాల్లోనే అమ్ముకోవటం వారికి ఇష్టం. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ఎంతమేరకు చిత్తశుద్ధిని చూపుతుందో, ఈ కేంద్రాలు రైతులను ఎంతమేరకు ఆదుకుంటాయో వేచిచూడాలి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement