ఇక్కట్లు లేని ‘ఇంటిపంట’లకు దారిది! | Not the 'home of the crop' to way | Sakshi
Sakshi News home page

ఇక్కట్లు లేని ‘ఇంటిపంట’లకు దారిది!

Published Wed, Nov 12 2014 11:00 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

ఇక్కట్లు లేని  ‘ఇంటిపంట’లకు దారిది! - Sakshi

ఇక్కట్లు లేని ‘ఇంటిపంట’లకు దారిది!

ఇంటి పంట
 
ఆరవై నాలుగు కళల్లో వ్యవసాయం ఒక అద్భుతమైన కళ. ఆయా కళలు ఇంద్రియానుభూతులను సంతుష్టి పరిస్తే.. వ్యవసాయ కళ అన్ని ఇంద్రియాలకూ ఇంధనమైన అన్నాన్ని ఆర్జించి పెడుతుంది. అందుకే వ్యవసాయం అద్భుతమయింది. ఆధునికత పేర వచ్చిన మార్పులు టన్నులకొద్దిగా దించిన రసాయనాలు ఇప్పుడు నింగిని, నేలనే కాదు తినే తిండిని కూడా విషతుల్యంగా మార్చాయి. ఈ నేపథ్యంలో గ్రామసీమల్లో ప్రకృతి వ్యవసాయం,  పట్టణ ప్రాంతాల్లో ఆర్గానిక్ అర్బన్ ఫార్మింగ్ క్రమంగా ఉద్యమ రూపం తీసుకుంటున్నాయి. ‘ఇంటిపంట’ల సాగుదారులకు అందుబాటులో ఉన్న వనరులతో చేపట్టే సస్యరక్షణ పద్ధతులనందించి వారి కృషికి తోడ్పడడమే ఈ వ్యాసం ఉద్దేశం. సేంద్రియ ఇంటిపంటలు సాగుచేసే మిత్రులు దృష్టిలో ఉంచుకోదగిన ముఖ్యవిషయం: చీడపీడల నివారణ కాదు నియంత్రణే ప్రధానం.  మొక్కలను చీడపట్టిన తరువాత, తెగుళ్లు సోకిన తరువాత నివారణ చర్యలను చేపట్టడం కాకుండా.. మొక్కలు వేసింది మొదలు క్రమానుగతంగా నియంత్రణ చర్యలు చేపట్టాలి.

‘జనరల్ పర్పస్ స్ప్రే’

‘జనరల్ పర్పస్ స్ప్రే’ తయారీకి కావలసిన పదార్థాలు:
ఉల్లిపాయ 1  మిరపకాయ 1  వెల్లుల్లి గడ్డ 1            
ఈ మూడింటినీ మెత్తగా మిక్సీలో రుబ్బుకొని ఒక రాత్రంతా కొంచెం నీటిలో నానబెట్టుకోవాలి. వడకట్టి ద్రావణంలో 1:5 రెట్ల నీరు కలిపి మొక్కల మీద స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసే ముందు చిటికెడు సర్ఫ్ పొడి కలిపితే మొక్క ఆకులకు మందు అంటుకోవడానికి ఉపయోగపడుతుంది.
 
సబ్బు నీరు: సబ్బు నీరు పిచికారీతో పచ్చదోమ, తెల్లదోమ, పాకుడు పురుగులు, పిండి నల్లి, ఆకు దొలిచే పురుగు, ఎర్రనల్లి వంటి వాటిని పారదోలవచ్చు. తయారీ విధానం: 30 గ్రాముల బార్ సబ్బును సన్నగా తురుము కోవాలి. (డిటర్జెంట్ కాదు) దీనిని లీటర్ నీటిలో కరిగించాలి. ఈ ద్రావణానికి ఒక చెంచాడు వంట నూనె లేదా కిరసనాయిల్ కలిపి పిచికారీ చేసుకోవాలి.
 
వెల్లుల్లి రసం: గొంగళి పురుగు, క్యాబేజీ ఫ్లై, దోమలు, నత్తలు ఇతర రకాల పాకుడు పురుగులను నాశనం చేస్తుంది. దీనికి తోడు ఆకు ముడత, ఆకు మచ్చలు, తేనే మంచు, బూడిద తెగులును నిరోధిస్తుంది. తయారీ విధానం: 90 గ్రాముల వెల్లుల్లి తీసుకొని మెత్తగా దంచాలి. దీనికి రెండు చెంచాల కిరోసిన్ కలపాలి. ఈ మిశ్రమాన్ని 600 మిల్లీ లీటర్ల నీటిలో నానబెట్టాలి. రెండు రోజుల తరువాత వడకట్టి 25 గ్రాముల సబ్బుపొడిని కలిపి పిచికారీ చేసుకోవాలి.

వెల్లుల్లి-పచ్చిమిర్చి రసం: ఇది వెల్లుల్లి రసం కన్నా ప్రభావశీలంగా పనిచేస్తుంది. తయారీ విధానం: 10 వెల్లుల్లి రెబ్బలు, 5 పచ్చి మిరపకాయలు, 3 ఓ మోస్తరు ఉల్లిపాయలు మెత్తగా రుబ్బుకొని మిశ్రమాన్ని లీటర్ నీటికి కలిపి మరిగించాలి. రెండు, మూడు పొంగుల తరువాత దించి చల్లారనివ్వాలి.  వడపోసుకున్న ద్రావణాన్ని ఒక సీసాలో నిలువ చేసుకోవాలి. పిచికారీ మోతాదు: ఒక కప్పు ద్రావణాన్ని 10 లీటర్ల నీటికి కలిపి ఒక షాంపూ ప్యాకెట్ లేదా కుంకుడు రసం లేదా పచ్చి పాలు కొంచెం కలిపి పిచికారీ చేసుకోవాలి. ఆకు ముడత వచ్చిన మొక్కలకు వరుసగా వారం రోజుల పాటు పిచికారీ చేసుకుంటే సమస్య పరిష్కారమౌతుంది.
 
పచ్చిపాల ద్రావణం: పచ్చిపాల ద్రావణం బూడిద తెగులుపై బాగా పనిచేస్తుంది. పచ్చి పాలను రెట్టింపు నీటితో కలిపి పిచికారీ చేస్తే వైరస్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ప్రధానంగా మొజాయిక్ వైరస్‌పై ఇది బాగా పనిచేస్తుంది.

 పుల్ల మజ్జిగ: నాలుగైదు రోజులు పులియబెట్టాలి. ఈ పుల్ల మజ్జిగను ఒకటికి తొమ్మిది పాళ్లు నీరు కలిపి మొక్కలపై పిచికారీ చేయాలి. పుల్ల మజ్జిగ వివిధ కీటకాలను పారదోలడమే కాక వాటి గుడ్లను నశింపజేస్తుంది.   
 
కీటకాల రసం: పంట మీద ఏదైనా పురుగు ఉధృతంగా కనిపిస్తుంటే.. ఆ పురుగులు కొన్నిటిని ఏరి రెండు కప్పుల నీరు కలిపి రుబ్బాలి. ఆ రసాన్ని లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చేస్తే ఆ పురుగులు పారిపోతాయి.దవనం ఆకుల కషాయం: ఒక లీటర్ నీటిలో గుప్పెడు దవనం ఆకులను కలిపి మరిగించాలి. ఈ కషాయానికి రెట్టింపు నీరు చేర్చి పిచికారీ చేస్తే దోమ, పెంకు పురుగు, నత్తలు, క్యాబేజీ తొలిచే పురుగులు వైదొలగుతాయి.
 
ఉప్పు నీళ్ల స్ప్రే: 60 గ్రాముల ఉప్పు, 2 చెంచాల సబ్బు పొడి, 4.5 లీటర్ల గోరు వెచ్చటి నీటిలో బాగా కలిపి వడకట్టుకోవాలి. ఈ ద్రావణం క్యాబేజీని తొలిచే పురుగులపై బాగా పనిచేస్తుంది.

ఎప్సమ్ సాల్ట్: వైరస్ ఆశించిన మొక్కల ఆకులు పచ్చగా మారి బలహీన పడతాయి. మెగ్నీషియం లోపం కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో 50 గ్రాముల ఎప్సమ్ సాల్ట్ (మెగ్నీషియం సల్ఫేట్) నాలుగు లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.  పండుటీగ నిరోధక ద్రావణం: 15 లీటర్ల నీటిలో ఒక కిలో పంచదార వేసి కరిగించాలి. ఈ ద్రావణానికి ఒక లీటరు సముద్రపు నీరు లేదా సైంధవ లవణం కరిగించిన నీటితోపాటు.. ఒక లీటరు బెల్లం ద్రావణం లేదా డయటోమసియా ఎర్త్ లేదా పుట్టమన్నును కరిగించి.. వడకట్టి నీరు కలిపి పిచికారీ చేయాలి. పలుమార్లు పిచికారీ చేస్తే పండుటీగ హాని తొలగిపోతుంది.
 - జిట్టా బాల్‌రెడ్డి
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement