ఆ మేడ.. పంటల వైవిధ్యానికి నెలవు!
ఇంటి పంట
పచ్చని ఇంటి పంటలతో టై కళకళ
బ్యాగ్స్, సిమెంటు సంచుల్లో
ఆకుకూరలు, కూరగాయల సాగు
ప్రకృతి వ్యవసాయ పద్ధతిని అనుసరించి గుంటూరులోని ఏటీ అగ్రహారం వాస్తవ్యురాలైన ఎల్లాప్రగడ జయలక్ష్మి తమ మేడ పైన 3 నెలలుగా రసాయన రహిత కూరగాయలు, ఆకుకూరలు పెంచుతున్నారు. వృత్తి రీత్యా క్లినికల్ సైకాలజిస్ట్ అయిన ఆమె ఆరోగ్యదాయకమైన కూరగాయలు పండించడాన్ని ప్రవృత్తిగా మార్చుకొని పదుగురికి స్ఫూర్తినిస్తున్నారు. తన తండ్రి, విశ్రాంత వ్యవసాయ విస్తరణాధికారి అయిన ఎస్‌ఎస్‌ఎన్ మూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఇచ్చిన సలహాల ప్రకారం తృప్తిగా ఇంటిపంటలు పండిస్తున్నారు జయలక్ష్మి (77999 92038). ఆమె ఇంటి మేడపై పంటల జీవవైవిధ్యం కనువిందు చేస్తున్నది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..
64 గ్రోబ్యాగ్స్.. 60 సిమెంటు సంచులు
‘కుండీలకు బదులు తక్కువ ఖరీదైన గ్రోబ్యాగ్స్‌ను, ఖాళీ సిమెంటు సంచులను వాడుతున్నాం. రెండు సైజుల్లో గల 64 గ్రోబ్యాగ్స్, 60 సంచులలో బేబీకార్న్, టమాటా, వంగ, బెండ, క్యాబేజీ, కాకర, బీర, సొర లాంటి కాయగూరలు.. తోటకూర, పాలకూర, మెంతికూరలతోపాటు గులాబీ, బంతి వంటి పూల మొక్కలనూ పెంచుతున్నాం. దోమపోటు, పేనుబంక వంటి రసంపీల్చే పురుగుల బారి నుంచి కూరగాయ మొక్కలను కాపాడటానికి జొన్న, సజ్జ మొక్కలను పది సంచుల్లో పెంచుతున్నాం. దీని వల్ల పురుగుమందులు పిచికారీ చేయాల్సిన అవసరం రావడం లేదు. వీటిపై పురుగులేమైనా కనిపిస్తే తీసేసి నాశనం చేస్తున్నాం.
మట్టి మిశ్రమం తయారీ ఇలా..
కొబ్బరి పొట్టు, వర్మీ కంపోస్టు, ఎర్రమట్టి, పశువుల ఎరువును సమపాళ్లలో కలిపిన మట్టి మిశ్రమాన్ని బ్యాగ్స్‌లో నింపాము. విత్తనాలు, మొక్కలు నాటే ముందు ‘బీజామృతం’తో తప్పకుండా శుద్ధి చేస్తున్నాం. ఒక్కో బ్యాగ్‌లో నాటేముందు, తరువాత నెలకోసారి 50 గ్రాముల చొప్పున ఘనజీవామృతాన్ని వేస్తున్నాం. ఏడాది తర్వాత మట్టి మిశ్రమాన్ని బ్యాగ్‌లలో నుంచి తీసి.. పశువుల ఎరువు, ఘనజీవామృతం, వర్మీకంపోస్టు కొద్ది మొత్తంలో కలిపి మళ్లీ బ్యాగ్‌లలో నింపుకోవాలి.
పది రోజులకోసారి జీవామృతం..
సొంతంగా తయారు చేసుకున్న జీవామృతాన్ని 1:10 నిష్పత్తిలో నీటిలో కలిపి.. మొక్కలపై పది రోజులకోసారి పిచికారీ చేస్తున్నాం. పదిహేను రోజులకోసారి మొక్కల మొదళ్ల వద్ద పోస్తాం. టై గోడలకు వెదురు బొంగులు కట్టి వైర్ అల్లి తీగజాతి మొక్కలను పాకిస్తున్నాం. ఎండల ప్రభావం మొదలవటంతో రెండు పూటలా నీరు పోస్తున్నాం. ఉదయం, సాయంత్రం అరగంట మొక్కల పనికి వెచ్చిస్తాను. నా పనులకు ఎటువంటి ఇబ్బంది లేకుండానే మా కుటుంబానికి అవసరమైన ఆకుకూరలను పండించుకుంటున్నా. వంగ, టమాటా పిందెలు వస్తున్నాయి. విషం లేని ఆహారం సొంతంగా పండించగలగడం సంతోషాన్ని కలిగిస్తోంది. మా నాన్న మూర్తి (9491582181) తోడ్పాటుతో మా చుట్టుపక్కల ఉండే వారికి ఇంటిపంటల సాగుపై శిక్షణ ఇప్పించా. శిక్షణ పొందిన ఆరుగురు ఇంటిపంటల సాగుకు ఉపక్రమిస్తున్నారు..’
ప్రెజెంటేషన్: దండేల కృష్ణ, ఇంటిపంట డెస్క్