
సాగుబడి.. (మార్చి 4 నుంచి 17 వరకు)
ఈ వారం వ్యవసాయ సూచనలు
పుబ్బ కార్తె (మార్చి 4 నుంచి 17 వరకు)
రాష్ర్టంలోని వివిధ ప్రాంతాలలో ముఖ్యంగా తెలంగాణ జిల్లాల్లో అకాల వర్షాలు, వడగండ్ల వాన నేపథ్యంలో రైతులు కొన్ని ముందు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా నష్ట తీవ్రతను తగ్గించుకోవచ్చు.
వరి: తెలంగాణ జిల్లాల్లో వరికి అగ్గి తెగులు ఇంతకు ముందే ఆశించింది. మారిన వాతావరణ పరిస్థితుల్లో ఈ తెగులు వేగంగా వ్యాపించే అవకాశం ఉంది. నివారణకు గాను లీటరు నీటికి ఇసోప్రోథాయెలిన్ 1.5 మి.లీ.లు లేదా కాసుగామైసిన్ 2.5 మి.లీ.లు లేదా 0.6 గ్రాముల ట్రైసైక్లోజోల్‌లలో ఏదో ఒక మందును మార్చి మార్చి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి. పైపాటుగా ఎకరానికి 15-20 కిలోల పొటాష్ ఎరువు వేయాలి.
మామిడి: అకాల వర్షాలు, వడగళ్లు పడటం వలన పిందె నాణ్యతను పెంచడానికి, తెగుళ్లు ఆశించకుండా నిరోధించేందుకు చర్యలు చేపట్టాలి. సూక్ష్మపోషకాల మిశ్రమాన్ని లేదా మల్టీ-కే మిశ్రమాన్ని లీటరు నీటికి 10 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఆకుమచ్చ (పక్షికన్ను) తెగులు, బూడిద తెగులు నివారణకు లీటరు నీటికి కార్బన్‌డిజమ్ 1 గ్రాము లేదా నీటిలో కరిగే గంధకము 3 గ్రాములు చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి.
మిరప: తడిసిన కాయలను నేరుగా నేలమీద ఆరబెడితే భూమిలోని తేమ వల్ల బూజుపట్టి తెల్లకాయలుగా ఏర్పడే అవకాశముంది. కాయలను టార్పాలిన్ మీద కానీ, గచ్చు మీద కానీ ఆరబెట్టి.. విడిగా అమ్ముకోవడం మంచిది.
కూరగాయ పంటలు: వర్షాల తర్వాత గాలిలో, భూమిలో ఎక్కువ తేమ ఉంటుంది. ఎండ తీక్షణంగా కాస్తుంది. ఈ పరిస్థితుల్లో అన్ని రకాలైన కూరగాయల పంటల్లో బూడిద తెగులు, రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువయ్యే అవకాశం ఉంది. బూడిద తెగులు నివారణకు ముందు జాగ్రత్త చర్యగా ఎకరానికి 600 గ్రాముల నీటిలో కరిగే గంధకం లేదా 200 మి.లీ.లు కెరాథేన్ మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. రసంపీల్చే పురుగుల నివారణకు ఒక లీటరు నీటికి 1.5 గ్రాముల అసిఫేట్ లేదా 2 మిల్లీ లీటర్ల ఫిప్రోనిల్ కలిపి మార్చి మార్చి వారం-పది రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి. టమాటాలో ఆకుమాడు తెగులు నివారణకు లీటరు నీటికి 2 గ్రాముల క్లోరోథాలోనిల్ లేదా 3 గ్రాముల కాప్టాన్ కలిపి పిచికారీ చేయాలి.
- వ్యవసాయ విస్తరణ సంచాలకులు
ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ వర్సిటీ, రాజేంద్రనగర్, హైదరాబాద్
పాలలో వెన్న శాతం పెంచుకోవడం ఎలా?
* సూర్తి గేదెలు, జెర్సీ ఆవుల పెంపకం లాభదాయకం కావాలంటే పాలలో వెన్న శాతం బాగుండాలి. 1% వెన్న పెరిగితే లీటరుకు రూ. 2-3 చొప్పున రైతుకు ఆదాయం పెరుగుతుంది.
* 2, 3 ఈతల పశువుల పాలల్లో వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది. ఈనిన 4-5 వారాలకు వెన్న శాతం పెరుగుతుంది.
* రోజూ ఒకే సమయానికి పాలు పిండాలి. పచ్చి మేత తిన్న పశువు కడుపులో అసిటిక్ ఆమ్లం తయారై వెన్న శాతాన్ని పెంచుతుంది.
* పశువులకూ వ్యాయామం అవసరం. రోజుకు 3-4 కిలోమీటర్లు నడిచే పశువుల పాలలో వెన్న ఎక్కువగా ఉంటుంది.
* తొలి పాల ధారలు దూడకు తాపాలి. మలి పాల ధారలు మనం పిండుకోవాలి. చివరి పాలల్లోనే వెన్న శాతం ఎక్కువ.
- డా. ఎం.వి.ఎ.ఎన్. సూర్యనారాయణ (99485 90506),
సీనియర్ శాస్త్రవేత్త, పశు పరిశోధన కేంద్రం,
గరివిడి, విజయనగరం జిల్లా
రన్నింగ్ మోర్టాలిటీని మందులు అడ్డుకోలేవు!
* వెనామీ చెరువుల్లో రోజూ కొద్ది సంఖ్యలో రొయ్యలు చనిపోతుండడాన్ని రన్నింగ్ మోర్టా లిటీ(ఆర్.ఎం.) అంటారు. అయినా, అవగా హన కలిగిన రైతుకు దీని వల్ల ప్రమాదం లేదు. అవగాహన లేని రైతులు నష్టపోతున్నారు.
* రసాయనిక మందులు, యాజమాన్య చర్యల ద్వారా దీన్ని అరికట్టలేం.
* ఎకరానికి 5 వేల నుంచి 3 లక్షల పిల్లలు వేసిన అన్ని చెరువుల్లోనూ ఆర్.ఎం. కనిపిస్తోంది. దీనికి మూలకారణం ఏమిటో ఇదమిత్థంగా నిర్ధారణ కాలేదు. విబ్రియో బాక్టీరియా కలిగిస్తున్న నష్టం వల్ల ఇది సోకిన రొయ్యలు మేత తీసుకోవడం మానేసి చెరువు అంచుల్లోకి, ఎయిరేటర్ల కిందకు చేరి చనిపోతాయి. నీటి పైకి తేలడం తక్కువ. పునికించడం ద్వారా ఎన్ని చనిపోతున్నదీ తెలుసుకుంటూ ఉండాలి.
* ఎక్కువ రొయ్యలు మేత తినడం నిలిపివేస్తే పట్టుబడి చేయక తప్పదు.
- ప్రొ. పి. హరిబాబు (98495 95355),
మత్స్య కళాశాల, ముత్తుకూరు, నెల్లూరు జిల్లా
చేపల రోగ నిరోధక శక్తిని పెంచడం ముఖ్యం
* చేపల వ్యాధులు నియంత్రణలో అతిముఖ్య వ్యూహం చేప రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం. ఆ తర్వాతే మందుల వాడకం సంగతి.
* బలహీనంగా ఉన్న చేపకు ఏ వ్యాధులైనా సులభంగా సోకుతాయి. ఏ మందులు వాడినా సులభంగా నయం కావు.
* బలహీనంగా ఉన్న తెల్ల చేపలకు రెడ్ డిసీజ్, తాటాకు తెగులు, చేపపేను, మొప్ప పురుగు వ్యాధులు తగ్గినట్టే తగ్గి.. అనేక సార్లు తిరగ బెడుతుండడంతో రైతులు నానా తిప్పలు పడుతున్నారు.
* రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహజాహారం(ప్లాంక్టన్), మేత, ఉత్తమ నీటి యాజమాన్యం దోహదపడతాయి.
- డా. రావి రామకృష్ణ (98480 90576),
సీనియర్ ఆక్వా శాస్త్రవేత్త, ఫిష్‌నెస్ట్, ఏలూరు
ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తల సలహాలకు ఉచిత ఫోన్ నంబర్లు
1100, 1800 425 1110
కిసాన్ కాల్ సెంటర్ :1551
మీ అభిప్రాయాలు, ప్రశ్నలు, సూచనలు పంపవలసిన చిరునామా:
ఎడిటర్, సాక్షి (సాగుబడి), సాక్షి టవర్‌స, 6-3-249/1,
రోడ్డు నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్- 500 034
saagubadi@sakshi.com