అమ్మ.. అవని.. సృష్టి గతికి కేంద్ర బిందువులు. పల్లైనా, ఢిల్లీ అయినా ప్రతిరోజూ పంటిన కొరికే మెతుకు స్త్రీ మూర్తుల స్వేద బిందువుల్లో తడిసి మొలిచిన పంటే. సమాజంలో సకల విద్యలు నేర్చి అన్నింటా తాముగా ఉన్న మహిళలు.. మట్టిపోగుల్లోంచి బంగరు పంటలు సృష్టించడంలోనూ దిట్టలే. జీవన పోరాటంలో ఎన్ని ఒడిదుడుకులెదురైనా, ఎదురుదెబ్బలు తగిలినా.. కాడి కిందపడెయ్యని ధీశాలురు మహిళా రైతులు. సంక్షుభిత వ్యవసాయాన్ని మనోనిబ్బరంతో కొత్తపుంతలు తొక్కించడంలోనూ వీరి పాత్ర అమోఘం. ఒక్కమాటలో.. వ్యవసాయమే వీరి జీవన సర్వస్వం! అంతర్జాతీయ కుటుంబ వ్యవసాయ సంవత్సరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. పైరుపచ్చని జీవితేచ్ఛను నింపుకున్న వీరి గుండె చప్పుళ్లు.. ఈ వారం ‘సాగుబడి’ పాఠకుల కోసం.. - సేకరణ: పంతంగి రాంబాబు, ‘సాగుబడి’ డెస్క్
ఇటు వ్యవసాయం.. అటు ఉద్యమం..
ముగ్గురు ఆడపిల్లలు పుట్టారని మా ఆయన వేరే పెళ్లి చేసుకుంటే.. పిల్లలను తీసుకొని పుట్టింటికి వచ్చేశా. మాకున్న ఎకరం పొలంలో పదేళ్ల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. దీంతోపాటు కొంత కొండపోడులో కూడా పంటలు పండిస్తున్నాం. నీవొక్కదానికే కాదు సమస్యలు అందరికీ ఉన్నాయని నాన్న ధైర్యం చెప్పారు. గిరిజన హక్కుల ఉద్యమాన్ని పరిచయం చేశారు.. నా కాళ్ల మీద నేను నిలబడగలనన్న ధైర్యం వచ్చింది. నాన్న చనిపోయాక కూడా వ్యవసాయం చేసుకుంటూ ఉద్యమంలో కొనసాగుతున్నాను. 4 మండలాల్లో గిరిజనులతో కలసి భూమిపై శాశ్వత హక్కు కోసం పోరాడుతున్నాం. రసాయనాలు వాడకుండా చిరుధాన్యాలను పండిస్తున్నాం. రసాయనాల్లేని పంటల వల్ల మనుషులు, పశువులు, భూమి బాగుంటాయి. సొంత భూమి, సొంత విత్తనం ఉండాలి, సొంత పంట తినాలి.. సొంత సంస్కృతిని నిలబెట్టుకోవాలనేది లక్ష్యంగా పనిచేస్తున్నాను. వ్యవసాయ కుటుంబాల్లో పనులన్నీ స్త్రీపైనే ఆధారపడి ఉంటాయి. మహిళా రైతులు ధైర్యంగా నిలబడాలి..
- పడాల భూదేవి, గిరిజన రైతు, సవర స్వర్లంగి,
హీర మండలం, శ్రీకాకుళం జిల్లా
మనలో శక్తి మనకు తెలీదు..!
మా వారు హఠాన్మరణం చెందిన తర్వాత ఉద్యోగంలో చేరకుండా వ్యవసాయంలోకి వచ్చా. ఇంకో జీవితం ఉందిలే అన్న ఆలోచనతో స్వగ్రామం చేరుకొని 18 ఎకరాల సొంత భూమిలో వ్యవసాయం ప్రారంభించా. 8 ఏళ్లుగా వరి, కూరగా యలను సేంద్రియ పద్ధతుల్లో పండిస్తున్నా. పశుపోషణ, వర్మీ కంపోస్టు తయారీ, బయోగ్యాస్ ఉత్పత్తి ద్వారా స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తూ నిలబడ్డా. మా తల్లిదండ్రులు, బంధువుల తోడ్పాటు లేకుంటే అవార్డులు సాధించే స్థితికి వచ్చేదాన్ని కాదు. మనలో శక్తి మనకు తెలీదు. కృషికి అదృష్టం తోడైతే మన శక్తి వెలికి వస్తుంది.. రైతుకు గిట్టుబాటు ధర ఏదీ? కూలీల కొరత, విద్యు త్ సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తేనే వ్యవసాయం నిలుస్తుంది. అయినా, సాగులో ఉన్న స్వేచ్ఛ, సంతృప్తి మరెక్కడా దొరకవు. స్త్రీలు ఉన్న చోటే నిలదొక్కుకొని బతకాలి.
- కర్ర శశికళ, సేంద్రియ రైతు,
దుగ్గిపల్లి, త్రిపురారం మండలం, నల్లగొండ జిల్లా
ఎన్ని బాధలున్నా వ్యవసాయమే మేలు!
మాకు 3 ఎకరాల పట్టాలేని పొలం ఉంది. దీనికి తోడు 6 ఎకరాలు కౌలుకు తీసుకొని మిర్చి, పత్తి, వేరుశనగ పండించే వాళ్లం. బావి తవ్వించడానికి రూ.లక్ష ఖర్చయింది. పత్తిలో నష్టం వచ్చింది. పిడుగుపడి పశువులు చనిపోయాయి. అప్పు రూ.2 లక్షలకు పెరిగిందని నా భర్త భిక్షపతి 28.6.2011న ఉరేసుకొని చనిపోయాడు. కాగితాలన్నీ ఇచ్చినా, ప్రభుత్వం ఇప్పటికీ పట్టించుకోలేదు. బాధలు దిగమింగుకొని.. ఒంటరిదాన్నయినా వ్యవసాయం చేయడమే మంచిదనుకున్నా. పత్తి వేయడం మానేశా. బావి కింద ఎకరంలో వరి రెండు పంటలు పండిస్తున్నా. మిగతా రెండెకరాల్లో సీడ్ మొక్కజొన్న, సీడ్ చిక్కుడు, పెసర వేశా. ముగ్గురు పిల్లలు, మా అత్త, వికలాంగురాలైన మామ చెల్లె.. కలిసే ఉంటున్నం. పిల్లలు చదువుతున్నారు. ఖాళీ ఉన్నప్పుడల్లా మా పొలంలో పని చేస్తారు లేదా కూలికెళ్తారు. బాధలెన్ని ఉన్నా ఎలాగోలా నెట్టుకొస్తున్నా. ఇంకా తీర్చాల్సిన అప్పు రూ. 30 వేలుంది.. ప్రభుత్వం సాయపడాలి.
- గుడిశాల భాగ్యమ్మ, మహిళా రైతు,
ఇప్పగూడెం, స్టేషన్ ఘన్‌పూర్ మండలం, వరంగల్ జిల్లా
ఆరేడు నెలల్లో ప్రకృతి వ్యవసాయం నేర్చుకున్నా..!
మా నాన్న, తాత కూడా వ్యవసాయం చేయలేదు. కానీ, బీటెక్, ఎంబీఏ చదివిన నేను పాలేకర్ రాసిన పుస్తకం చదివి ఆరేడు నెలల్లో ప్రకృతి వ్యవసాయం నేర్చుకున్నా. జీవామృతంతో మొదట ఇంటి దగ్గర కూరగాయలు సాగు చేశా. ఆరేళ్లుగా కాయని ఉసిరి చెట్టుకు కాపు రావడంతో ప్రకృతి వ్యవసాయం చేయొచ్చన్న ధైర్యం వచ్చింది. తర్వాత శిక్షణ పొందా. వందెకరాల్లో వరి, చెరకు, వేరుశనగ, శనగ, గోధుమ, బంగాళదుంప తదితర పంటలు సాగు చేస్తున్నా. మంచి దిగుబడులొస్తున్నాయి. ఆరోగ్యదాయకమైన పంట దిగుబడులను కూడా స్థానికంగా మార్కెట్ ధరకే అమ్ముతున్నా. గాలివానకు రూ.20 లక్షల పెట్టుబడిని నష్టపోయిన కౌలు రైతు ఆత్మహత్యే శరణ్యమని ఇటీవల టీవీలో చెబుతుంటే బాధనిపించింది. పెట్టుబడులు తగ్గించుకుంటే జీవితం ఇంతగా తల్లకిందులవ్వదు. అన్నీ సరిగ్గా చేస్తే పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం మంచి ఫలితాలిస్తుంది. మహిళ ఏ స్థాయిలో ఉన్నా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలగాలి. ధైర్యంగా ఉండాలి.
- శిల్పా కాళేశ్వర్, యువ మహిళా రైతు,
పెనుకొండ, అనంతపురం జిల్లా
పొలానికెళ్లిరానిదే నిద్ర పట్టదు!
మా నాన్న గారు పొలం పనులు చేయడం నేర్పించారు. మాకు ఏడెకరాల పొలం ఉంది. మా వారు సంజీవరెడ్డితో కలసి పాతికేళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నా. మనల్ని కన్న తల్లి పెంచేది 20 ఏళ్లే. ఎల్లకాలం పెంచేది నేలతల్లి. వరి, చక్కెరకేళి, పసుపు, మొక్కజొన్న, ధనియాలు, వాము, మెంతులు, ఆముదాలు, మిరప, కొబ్బరి పండించుకుంటున్నాం. మాంసం, గుడ్లు తప్ప ఏదీ కొనడం లేదు. కూరగాయలు, ఆకుకూరలు మేం తినగా నలుగురికి ఇస్తున్నాం. పొలానికెళ్లిరానిదే నిద్ర పట్టదు. అమ్మను చూడకుండానైనా కొద్ది రోజులు ఉంటా. కానీ, పొలాన్ని చూడకుండా ఉండలేను.
అయినా, పొలం వెళ్లకుండా ఏం చేయాలి? టీవీ సీరియళ్లు చూడడం, ఖాళీగా కూర్చొని ముచ్చట్లాడడం నాకు నచ్చదు. స్వయంగా పొలం పనులు చేస్తూ ఉంటే.. లేబర్ మల్లే పొలం పోతున్నదని వాళ్లూ వీళ్లూ అనేవారు. ఐదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ పేరు సంపాదించాక వాళ్ల నోళ్లు మూతపడ్డాయి. నా చిన్నప్పుడు పిండి కట్టలు(రసాయనిక ఎరువులు) వేయకపోయినా ఎకరానికి పది బస్తాల మినుములు పండేవి. ఇప్పుడు పిండి వేసినా 4 బస్తాలైతే గగనం. ప్రకృతి వ్యవసాయంలో అట్లా కాదు. ఖర్చు బాగా తక్కువ.. ఆదాయం ఎక్కువ. చక్కెరకేళి పంటలో ఎకరానికి ఈ ఏడాది రూ.లక్షన్నర నికరాదాయం వచ్చింది. ఎప్పటికైనా అందరూ ప్రకృతి వ్యవసాయం దారికి రాక తప్పదు.
- అన్నపురెడ్డి మల్లీశ్వరి, మహిళా రైతు, నూతక్కి,
మంగళగిరి మండలం, గుంటూరు జిల్లా
మేతలో వెదురు బొగ్గుపొడి కలిపితే మేలు!
మంచినీటి చెరువుల్లో చేపల పెంపకాన్ని లాభాల దిశగా నడిపించడానికి ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు నిరంతరం సాగుతూనే ఉన్నాయి. తైవాన్‌లోని ఫిషరీస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ఎఫ్.ఆర్.ఐ.) చేపల మేతపై చేస్తున్న పరిశోధనల్లో ఇటీవల సరికొత్త విషయం వెలుగులోకి వచ్చింది. వెదురు బొంగుల బొగ్గును పొడిగా మార్చి చేపల మేతలో కలిపి వాడితే చేపల పెరుగుదల మెరుగైనట్లు ఎఫ్.ఆర్.ఐ. శాస్త్రవేత్తలు ‘చైనా పోస్టు’ పత్రికతో చెప్పారు.
తైవాన్ తిలాపియా చేపలకు ఇచ్చే మేతలో వెదురు బొగ్గుపొడిని వాడినప్పుడు వాటి బరువు పెరిగింది. ఈ చేపల పొడవు, ఎదుగుదల కూడా సాధారణం కంటే పెరిగినట్లు గుర్తిం చారు. వెదురు బొగ్గు పొడితోపాటు వెదురు వెనిగర్‌ను కూడా కలిపి వాడితే.. ఎదుగుదల మరింత వేగవంతమైనట్లు గుర్తించారు. ఇదేవిధంగా కర్ర బొగ్గు, ఉడ్ వెనిగర్‌ను మేతలో కలిపినప్పుడు చేపల ఆరోగ్యం మెరుగ్గా ఉండడంతో పాటు రోగనిరోధక శక్తి గణనీయంగా పెరిగిందని తైవాన్ శాస్త్రవేత్తలు ప్రకటించారు. తిలాపియా చేపల్లో మాంసంతోపాటు కాలేయ పరిమాణం కూడా పెరిగినట్లు ఎఫ్‌ఆర్‌ఐ ప్రకటించింది.
అయితే.. ఇదే మేతను తెల్ల(కార్ప్) చేపలకు వేసినప్పుడు చెరువుల్లో నత్రజని, భాస్వరం వలన ఏర్పడే ప్రతికూల ప్రభావాలు తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. చేపల చెరువుల్లోని విషతుల్య ర సాయనాలను కరిగించడంలో మామూలు కర్రబొగ్గు పొడి కంటే వెదురు బొగ్గుపొడి మెరుగైన ఫలితాలనిచ్చిందని పరిశోధకులు తెలిపారు. వెదురు బొగ్గు పొడిని పశువుల దాణాలో కలిపినప్పుడు కూడా సత్ఫలితాలు వచ్చాయని శాస్త్రవేత్తలు తెలిపారు. కోళ్ల మేతలో వెదురు బొగ్గు పొడిని కలిపినప్పుడు కోళ్ల మాంసం మదువుగా ఉండి, గుడ్ల ఉత్పత్తి పెరిగింది. గొర్రెల దాణాలోనూ వెదురు బొగ్గు పొడి కలిపినప్పుడు.. వీటికి మాంసకృత్తులను హరాయించుకునే శక్తి పెరిగినట్లు ఎఫ్.ఆర్.ఐ. శాస్త్రవేత్తలు తెలిపారు.
పేటెంట్ వచ్చాక గుట్టు విప్పేస్తా!
‘బోర్లు రెండు.. మోటారు ఒకటే!’ శీర్షికన నల్లగొండ జిల్లాకు చెందిన పందిరి పుల్లారెడ్డి అనే రైతు ఆవిష్కరణపై ‘సాగుబడి’ పేజీ(3-3-2014)లో ప్రచురితమైన కథనానికి రైతులోకం అపూర్వస్థాయిలో స్పందిస్తోంది. పుల్లారెడ్డికి ఫోన్ కాల్స్ వరదలా వస్తున్నాయి. ‘రోజుకు 8 గంటల చొప్పున ఫోన్ కాల్స్‌కు సమాధానం చెబుతున్నా ఫోన్లు వస్తూనే ఉన్నా యి. ఫోన్‌కు లౌడ్ స్పీకర్లు పెట్టి సమాధానాలు చెబుతున్నాను. పేటెంట్ మంజూరైన తర్వాత రైతు సోదరులకు దీనికి సంబంధించిన గుట్టు విప్పి పూర్తిగా విడమర్చి చెబుతాను. రెండు బోర్లను ఒక మోటారుతో ఎలా నడుపుతున్నానో స్వయంగా వచ్చి చూసెళ్లవచ్చు. ఇప్పటికే రోజూ కొందరు చూసెళ్తున్నారు..’ అని పుల్లారెడ్డి ‘సాగుబడి’తో చెప్పారు.
- పందిరి పుల్లారెడ్డి, రైతు శాస్త్రవేత్త,
ముకుందాపురం, నల్లగొండ జిల్లా
సాగుబడి.. సాగే సర్వస్వం!
Published Mon, Mar 10 2014 12:10 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement