
సాగుబడి.. ఈ వారం వ్యవసాయ సూచనలు
వరి: నాట్లు వేసేటప్పుడు నీరు పలుచగా లేదా బురదగా ఉండాలి. ఎండలు ఎక్కువగా ఉంటే నాటిన వెంటనే 5 సెం.మీ. వరకు నీరు నిలువ ఉంచాలి. మూన తిరిగిన తరువాత దుబ్బ కట్టు వరకు 2-3 సెం.మీ. నీరు ఉంచాలి. నీరు ఎక్కువైతే పిలకల శాతం తగ్గుతుంది.
మామిడి: బూడిద తెగులు ఆశించడానికి, త్వరగా వ్యాపించడానికి ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా ఉంది. దీన్ని గమనించిన వెంటనే నివారణకు 3 గ్రా. నీటిలో కరిగే గంధకం లేదా 1 మి.లీ. కారాధేన్ లీటరు నీటితో పిచికారీ చేయాలి.
నువ్వులు: ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఫిబ్రవరి రెండో వారం వరకు శ్వేత తిల్, రాజేశ్వరి రకాలు విత్తుకోవచ్చు.
మల్లె: నాణ్యమైన, అధిక మల్లెపూల దిగుబడికి కొత్త చిగురు, మొగ్గ దశలో లీటరు నీటికి 2.5 గ్రా. జింక్‌సల్ఫేట్, మెగ్నీషియం సల్ఫేట్ 5 గ్రా. లీటరు నీటికి కలిపి రెండు మూడు దఫాలు పిచికారీ చేయాలి.
బెండ: ఫిబ్రవరి ఆఖరి వరకు బెండ విత్తుకోవచ్చు. పల్లాకు తెగులు తట్టుకొనే రకాలైన అనామిక, ఆర్క అభయ రకాలను లేదా ప్రైవేటు హైబ్రిడ్స్‌ను ఎంచుకోవాలి. వరుస మధ్య ఒకటిన్నర అడుగు, మొక్కల మధ్య అర అడుగు దూరం ఉండాలి.
వేరుశనగ: రాయలసీమ ప్రాంతంలో వేసిన వేరుశనగ పంటకు ప్రస్తుత వాతావరణ పరిస్థి తుల్లో ఆకు మచ్చ తెగులు సోకే అవకాశం ఉంది. నివారణకు మొకోజెబ్ 2 గ్రా. లేదా కార్బెండిజమ్ 2 గ్రా. లేదా హెక్సాకొనజోల్ 2 మి.లీ. లేదా క్లోరోథెలనిల్ 2 మి.లీ. లీటరు నీటికికలిపి పిచికారీ చేయాలి.
ఆరుతడి పంటలు: ప్రస్తుత సీజన్‌లో అన్ని ఆరుతడి పంటలకు పొగాకు లద్దె పురుగు ఆశించే అవకాశం ఉంది. కాబట్టి, జాగ్రత్తగా ఉండి తొలి దశలోనే నివారణ చర్యలు చేపట్టాలి.
- డా. ఎ. లలిత, రమావత్ బాలాజీ నాయక్
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం
వనామీ రొయ్యల్లో మందగించిన ఎదుగుదల
వనామీ రొయ్యల్లో ఇటీవల ఎటువంటి అవలక్షణాలు లేకపోయినప్పటికీ, వాటి ఎదుగుదల మందగించిందని రైతులు చెబుతున్నారు. వాతావరణం, సీడ్, ఫీడ్ సంబంధిత అంశాలే ఇందుకు కారణమని గుర్తించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
సూర్యోదయం సమయంలో డీవో (నీటిలో కరిగిన ప్రాణవాయువు) 4-5 పీపీఎంకు తగ్గకుండా ఉంటే.. చెరువు వాతావరణం బాగున్నట్లే.
సాధారణ ఎయిరేటర్లతోపాటు లాంగ్ ఆర్మ్, గొట్టాలతో కూడిన ఎయిరేటర్లను వాడడం మంచిది.
ఈ కాలమ్ రొయ్యలు సాగు చేస్తున్న రైతులకు సాంకేతిక సూచనలు అందించడానికి మాత్రమే. ఏ ప్రాంతాల్లోనైనా కొత్తగా సాగు చేయాలనుకునే వారు సాధారణ సమాచారం కోసం స్థానిక అధికారులు, టెక్నీషియన్లు, రైతులను సంప్రదించడం ఉత్తమం.
- ప్రొ. పి. హరిబాబు (98495 95355),
మత్స్య కళాశాల, ముత్తుకూరు, నెల్లూరు జిల్లా
ఆరోగ్యంగా ఉన్న చేప పెరుగుదల ఆగదు
ఆరోగ్యంగా ఉన్న చేప పెరుగుదల ఆగమన్నా ఆగదు.
తెల్ల చేపల చెరువులో నెలకు (లేదా 15 రోజులకు) ఒకసారి ట్రైల్ నెట్ వేసి వివిధ జాతుల చేపల పెరుగుదల తీరును పరిశీలించాలి.
ఒకే చెరువులో కొన్ని వ్యాధులు ప్రత్యేకించి రోహు లేదా కట్ల చేపలకు మాత్రమే సోకుతాయి. కొన్ని రెంటికీ సోకవచ్చు.
నెలవారీ చేపల పెరుగుదల సగటుకన్నా తక్కువగా ఉంటే కారణాలు గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాలి.
పెరుగుదల తగ్గడం వల్ల కలిగే నష్టం ఒక్కోసారి వ్యాధుల నష్టం కన్నా ఎక్కువగా ఉంటుంది.
- డా. రావి రామకృష్ణ (98480 90576),
సీనియర్ ఆక్వా శాస్త్రవేత్త, ఫిష్‌నెస్ట్, ఏలూరు
కొబ్బరి పిందెలు రాలకుండా జాగ్రత్తపడాలి
ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కొబ్బరి పిందెలు రాలకుండా రైతులు నీటి యాజమాన్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
చెట్టు పాదుల్లో నీటితడి ఆరకుండా ఉండేందుకు ఆచ్ఛాదనగా కొబ్బరి ఆకులు, డొక్కలు లేదా పీచును వేయాలి.
పది రోజులకోసారి కొబ్బరి చెట్లకు నీరు పెట్టాలి.
కొబ్బరి మొవ్వులో ఎలుకల ప్రభావం ఎక్కువగా ఉంటే బ్రోమో డయోలిన్ మందును నూకల్లో కలిపి మొవ్వు మొదల్లో పెట్టాలి.
- డా. జి.రామానందం (94414 74967),
ఉద్యాన పరిశోధన కేంద్రం, అంబాజీపేట, తూ.గో. జిల్లా
13 నుంచి ఉద్యాన ప్రదర్శన
రాష్ర్ట ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో హార్టీ ఎక్స్‌పో-2014 హైదరాబాద్‌లో ఈ నెల 13 నుంచి 17 వరకు జరగనుంది. నిజాం కాలేజీ గ్రౌండ్‌స(బషీర్‌బాగ్)లో ఏర్పాటయ్యే ఈ ప్రదర్శనలో పలు స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రవేశం ఉచితం.
13న ‘పాతపంటల పండుగ’ ముగింపు ఉత్సవం
మెదక్ జిల్లా జహీరాబాద్ పరిసరాల్లో జీవ వైవిధ్యంతో తులతూగే సంప్రదాయ పంటల సాగు సంస్కృతిని పాతపంటల పండుగ కళ్లకు కడుతుంది. సంక్రాంతి రోజున ప్రారంభమైన ఈ పండుగ ముగింపు ఉత్సవం ఈ నెల 13న జహీరాబాద్ సమీపంలోని మాచునూరులో జరుగుతుంది. సంప్రదాయ విత్తన సంపదను పరిరక్షించుకునే లక్ష్యంతో ఎడ్ల బండ్లు 55 గ్రామాల్లో ప్రచారం చేయడం విశేషం.
ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తల సలహాలకు
ఉచిత ఫోన్ నంబర్లు
1100, 1800 425 1110
కిసాన్ కాల్ సెంటర్ :1551