తెలుగువారిదీ... ఇడ్లీదీ... కలివిడి గుణం...
అల్లప్పచ్చడితో, ఆవకాయతో, సాంబార్‌తో, కారప్పొడితో, చట్నీతో,
దేనితోనైనా ఇట్టే కలిసిపోతుంది....
జాతీయ సమైక్యతకు చిహ్నం ఇడ్లీ...
మన సంస్కృతుల్లాగే ఇడ్లీకీ అనేక రూపాలు.
రవ్వ ఇడ్లీ, బటన్ ఇడ్లీ, ఓట్స్ ఇడ్లీ, సాంబారిడ్లీ!
అన్నం పరబ్రహ్మ స్వరూపమైతే...
ఇడ్లీది అపర ధన్వంతరి రూపం.
అందుకే ఇడ్లీ... నిత్యభోజనం.. పథ్యభోజనం
రండి... రకరకాల ఇడ్లీలను నోటిలో ఉంచుకుందాం.
పలురకాలైన వాటిని పంటి కింద నంజుకుందాం.
కారంపొడి ఇడ్లీలు
కావలసినవి:
ఇడ్లీలు - 10, మినప్పప్పు - కప్పు, శనగపప్పు - ముప్పావు కప్పు, ఎండుమిర్చి - 6, ఇంగువ - అర టీ స్పూను, నూనె - 2 టేబుల్‌స్పూన్లు, ఉప్పు - తగినంత, ఆవాలు - అర టీ స్పూను, జీలకర్ర - అర టీ స్పూను, కొత్తిమీర - కొద్దిగా
తయారి:
బాణలిలో నూనె వేసి కాగాక, మినప్పప్పు, శనగపప్పు వేసి వేయించాలి
ఎండుమిర్చి జత చేసి, బాగా కలిపి దించేయాలి
చల్లారాక, ఇంగువ, ఉప్పు జత చేసి మిక్సీలో వేసి పొడి చేసి పక్కన ఉంచాలి
బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి
ఇడ్లీలు వేసి జాగ్రత్తగా కలపాలి
తయారుచేసి ఉంచుకున్న కారంపొడి జల్లి బాగా కలపాలి
కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
ఇడ్లీ వెజిటబుల్ సాండ్‌విచ్
కావలసినవి:
ఇడ్లీపిండి - 3 కప్పులు; బంగాళదుంప కూర - కప్పు; వంటసోడా - చిటికెడు
కూరకు కావలసినవి:
బంగాళదుంపలు - 3, ఉడికించిన బఠాణీ - అర కప్పు, ఉల్లితరుగు - అర కప్పు, పచ్చిమిర్చి తరుగు - 2 టీ స్పూన్లు, పసుపు - పావు టీ స్పూను, శనగపప్పు - టేబుల్ స్పూను, మినప్పప్పు - టీ స్పూను, ఆవాలు - అర టీ స్పూను, కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు - 2 రెమ్మలు, ఉప్పు - తగినంత, నూనె - 2 టేబుల్ స్పూన్లు
తయారి:
బంగాళదుంపలను ఉడికించి మెత్తగా మాష్ చేయాలి
బాణలిలో నూనె కాగాక ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేసి వేయించాలి
పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, ఉల్లితరుగు వేసి వేయించాలి
ఉడికించిన బఠాణీలు జత చేయాలి
పసుపు, ఉప్పు, బంగాళదుంప పేస్ట్ వేసి రెండుమూడు నిమిషాలు ఉడికించాలి
కొత్తిమీర జత చేసి కలిపి దించి చల్లారనివ్వాలి
ఇడ్లీ రేకులకు నూనె రాసి, టేబుల్ స్పూను ఇడ్లీ పిండి వేసి, దాని మీద తయారుచేసి ఉంచుకున్న కూర, ఆ పైన రెండు టేబుల్‌స్పూన్ల ఇడ్లీ పిండి వేసి, కుకర్‌లో ఉంచి, ఒక విజిల్ వచ్చాక దించేయాలి
ఇడ్లీలను తీసి, మధ్యకు కట్ చేసి, చట్నీతో సర్వ్ చేయాలి.
ఉల్లి మసాలా ఇడ్లీ
కావలసినవి:
ఇడ్లీ పిండి - 3 కప్పులు, ఉల్లి తరుగు - పావు కప్పు, నానబెట్టిన శనగపప్పు - పావు కప్పు, కొత్తిమీర తరుగు - 3 టేబుల్ స్పూన్లు, క్యారట్ తురుము - పావు కప్పు, కరివేపాకు - 2 రెమ్మలు, పచ్చిమిర్చి పేస్ట్ - టీ స్పూను, వంటసోడా - పావు టీ స్పూను, ఆవాలు - అర టీ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - టేబుల్ స్పూను
ఇడ్లీ పిండికి.... ఉప్పుడు బియ్యం - 4 కప్పులు; మినప్పప్పు - కప్పు, అటుకులు - కప్పు; మెంతులు - టీ స్పూను, ఉప్పు - తగినంత
తయారి:
ఉప్పుడు బియ్యం, మినప్పప్పులను విడివిడిగా ముందురోజు రాత్రి నానబెట్టాలి
ఇడ్లీలు తయారుచేయడానికి రెండు గంటల ముందు అటుకులు, మెంతులను విడిగా నానబెట్టాలి మినప్పప్పును గ్రైండర్‌లో వేసి మెత్తగా చేసుకోవాలి
బియ్యం, అటుకులు, మెంతులను విడిగా మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి
ఒక గిన్నెలో రెండురకాల పిండులను వేసి సుమారు 9 గంటలు నానబెట్టాలి
బాణలిలో నూనె కాగాక ఆవాలు వేసి చిటపటలాడాక, ఉల్లితరుగు, పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేయించి, దించి చల్లారనివ్వాలి
నానబెట్టి ఉంచుకున్న శనగపప్పును ఇడ్లీపిండిలో వేయాలి
క్యారట్ తురుము, కొత్తిమీర తరుగు, కరివేపాకు, ఉప్పు వేసి బాగా కలిపి ఇడ్లీలు వేసుకోవాలి.
ఓట్స్ ఇడ్లీ
కావలసినవి:
ఓట్లు - కప్పు; గోధుమరవ్వ - అర కప్పు; పెరుగు - అర కప్పు; క్యారట్ తురుము - 3 టేబుల్ స్పూన్లు; క్యాబేజీ తురుము - 2 టేబుల్ స్పూన్లు; బఠాణీ - 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు - తగినంత; నీరు - కప్పు, అల్లం తురుము - టీ స్పూను; పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను; మిరియాలపొడి - అర టీ స్పూను; నిమ్మరసం - అర టీ స్పూను; కొత్తిమీర తరుగు - 2 టీ స్పూన్లు; నూనె - 2 టేబుల్ స్పూన్లు; ఆవాలు - అర టీ స్పూను, మినప్పప్పు - టీ స్పూను; శనగపప్పు - టీ స్పూను, కరివేపాకు - 2 రెమ్మలు; ఇంగువ - కొద్దిగా
తయారి:
బాణలిలో నూనె కాగాక ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేసి వేయించాలి
క్యారట్ తురుము, క్యాబేజీ తురుము, బఠాణీలు వేసి మరో మారు వేయించాలి గోధుమరవ్వ, ఓట్స్ వేసి రెండు నిముషాలు వేయించాలి
ఉప్పు జత చేసి కలిపి దించేయాలి
చల్లారాక పెరుగు, నీళ్లు వేసి ఇడ్లీపిండి మాదిరిగా కలపాలి
కరివేపాకు, నిమ్మరసం జత చేయాలి
ఇడ్లీ రేకులకు నూనె రాసి, పిండిని ఇడ్లీలుగా వేసి, కుకర్‌లో ఉంచి పావుగంట తరువాత దించేయాలి.
మసాలా మినీ ఇడ్లీ ఫ్రై
కావలసినవి:
బటన్ ఇడ్లీలు - 18; ఉల్లితరుగు - పావు కప్పు; రెడ్ క్యాప్సికమ్ తరుగు - అర కప్పు; టొమాటో తరుగు - పావు కప్పు, బఠాణీ - పావు కప్పు; కరివేపాకు - 2 రెమ్మలు; జీలకర్ర - అర టీ స్పూను; ఆవాలు - అర టీ స్పూను; కారం - అర టీ స్పూను; పసుపు - పావు టీ స్పూను; నూనె - 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు - తగినంత
తయారి:
బాణలిలో నూనె కాగాక, ఆవాలు, జీలకర్ర వేసి వేగాక, ఉల్లి తరుగు, రెడ్ క్యాప్సికమ్ తరుగు, టొమాటో తరుగు వేసి వేయించాలి
బఠాణీ, కరివేపాకు, పసుపు, కారం, ఉప్పు జత చేయాలి
బటన్ ఇడ్లీలను జత చేసి, జాగ్రత్తగా కలిపి సర్వ్ చేయాలి.
మసాలా ఇడ్లీ ఫ్రై
కావలసినవి:
ఇడ్లీలు - 6; ఇడ్లీకారం - 2 టేబుల్ స్పూన్లు, పసుపు - పావు టీ స్పూను; ఆలివ్ ఆయిల్ - టేబుల్ స్పూను, నూనె - అర టీ స్పూను, ఉప్పు - తగినంత;
పోపు కోసం:
నువ్వుపప్పు - టేబుల్ స్పూను, ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - అర టీ స్పూను, మినప్పప్పు - టీ స్పూను; శనగపప్పు - అర టీ స్పూను, ఉల్లితరుగు - పావు కప్పు; పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను, వెల్లుల్లి రేకలు - 2; కరివేపాకు - 2 రెమ్మలు, ఇంగువ - చిటికెడు; కొత్తిమీర - కొద్దిగా
తయారి:
ఇడ్లీలను పొడవుగా కట్ చేసి, బాణలిలో నూనె కాగాక అందులో వేసి దోరగా వేయించాలి
నూనె రాసిన అల్యూమినియం ఫాయిల్ మీద ఈ ముక్కలను ఉంచి, ఆలివ్ ఆయిల్ చిలకరించాలి
180 డిగ్రీల దగ్గర ప్రీ హీట్‌చేసిన అవెన్‌లో ఈ ఫాయిల్స్‌ను సుమారు పావుగంటసేపు ఉంచి తీసేయాలి
బాణలిలో అర టీ స్పూను నూనె కాగాక, ఆవాలు, జీలకర్ర, నువ్వుపప్పు వేసి వేయించాలి
వెల్లుల్లిరేకలు, పచ్చిమిర్చి తరుగు, ఇంగువ జత చేయాలి
ఉల్లితరుగు, కరివేపాకు, నిమ్మరసం, ఇడ్లీ ముక్కలు వేసి కలపాలి
కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి.