కరువును తరిమిన మహిళలు
♦ సేంద్రియ మిశ్రమ పంటల సాగుతో మరాఠ్వాడా మహిళా రైతుల స్వావలంబన
♦ కరువును ఎదిరించి గెలిచిన మహిళా రైతులు
♦ ఐక్యరాజ్య సమితి ఈక్వేటర్ పురస్కారానికి ఎంపిక
రసాయనిక వ్యవసాయ పద్ధతుల్లో ఏదో ఒకటే పంటను సాగు చేయడం వల్ల చిన్న, సన్నకారు రైతు కుటుంబాలు ఎడతెగని సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. చేస్తున్నది వ్యవసాయమే అయినప్పటికీ ఇంట్లోకి కూరగాయలు, పప్పులు కూడా కొనుక్కొని తినాల్సిన దుస్థితి. వెరసి పేదరికం, పౌష్టికాహార లోపం కుటుంబాలను కుంగదీస్తూ ఉంటుంది. ఇక రైతు ఆత్మహత్య పాలైన కుటుంబాల్లో కుటుంబ పోషణతోపాటు వ్యవసాయ బాధ్యతలు కూడా మహిళలపైనే పడుతోంది. మహారాష్ట్ర మరట్వాడా ప్రాంత మహిళా రైతులు పుణేకు చెందిన స్వయం శిక్షణ ప్రయోగ్ (ఎస్‌ఎస్‌పీ) సంస్థ తోడ్పాటుతో ఆర్థిక, పర్యావరణ సంక్షోభం నుంచి బయటపడుతున్నారు. సేంద్రియ పద్ధతుల్లో మిశ్రమ పంటల సాగుతో పౌష్టికాహర, ఆదాయ భద్రతను సాధిస్తున్నారు. అంతేకాదు.. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం(యు.ఎన్.డి.పి.) ఇచ్చే ప్రతిష్టాత్మక ఈక్వేటర్ పురస్కారాన్ని గెల్చుకున్నారు...
కరువు దెబ్బకు వందల మంది రైతులు ప్రాణాలొదిన నేల మహారాష్ట్రలోని మరట్వాడా ప్రాంతం అది. స్వయం శిక్షణ్ ప్రయోగ్ (ఎస్‌ఎస్‌పీ) సంస్థ సహకారంతో అదే కరువు భూమిలో సేంద్రియ సాగు చేపట్టిన సామాన్య మహిళలు ఆహార స్వావలంబన సాధించారు. కరువు లోనూ కుటుంబాలకు ఆహార భద్రత, ఆదాయ భద్రతను సాధించటమే లక్ష్యంగా ఎస్‌ఎస్‌పీ ఎకరా నమూనా విధానాన్ని రూపొందించింది. 2009లో తొలిసారిగా మరట్వాడా ప్రాంతంలో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసింది. అప్పటి వరకు.. అక్కడి రైతులు లాభార్జనే ధ్యేయంగా వాణిజ్య పంటలను సాగు చేసేవారు.
కానీ ఎకరం నమూనా పద్ధతిలో మాత్రం కుటుంబ అవసరాలకే పెద్దపీట. మరట్వాడా ప్రాంతంలో వరుసగా తీవ్ర కరువు తాండవించడం, రసాయనిక వ్యవసాయ పద్ధతిలో పత్తి వంటి ఏక పంటలను సాగు చేయడం అలవాటు. దీంతో, అప్పులపాలై ఏటా వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరెన్నో రైతు కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి దీన స్థితిలో ఉన్నాయి. సంక్షోభ పరిస్థితుల్లో చిన్న, సన్నకారు రైతు కుటుంబాల్లో బరువు బాధ్యతలన్నీ మహిళల నెత్తినే పడతాయి. అలాంటి కుటుంబాలలో మహిళలకు వెన్నుదన్నుగా నిలిచి, స్వల్ప ఖర్చుతో చేసే సేంద్రియ సేద్యం వైపు దృష్టి మళ్లించింది ఎస్‌ఎస్‌పీ సంస్థ.
మగవాళ్లయితే అధికాదాయం ఆశతో అధిక అప్పులు చేసి వాణిజ్య పంటలను సాగు చేసేవారు. కానీ మíßళలకు తమ ఇంటి పోషకాహార అవసరాలపై అవగాహన ఉంటుంది. అందుకే ఎస్‌ఎస్‌పీ మహిళలను దృష్టిలో ఉంచుకొని ఎకరం నమూనా సేంద్రియ సేద్య పథకానికి రూపకల్పన చేసింది. రసాయన ఎరువులకు బదులు జీవన, సేంద్రియ ఎరువులను వాడటం వల్ల ఖర్చు తగ్గింది. సాగు నీటిని పొదుపుగా వాడుకునేందుకు బిందు, తుంపర సేద్యాన్ని అనుసరించారు. హైడ్రోపోనిక్స్ పద్ధతిని కూడా పరిచయం చేశారు. నీటికుంటలు, బోరు బావుల రీచార్జి వల్ల భూగర్భ జలాలు పెరిగాయి. కరువు కాలంలోనూ ఎకరా నమూనా పద్ధతిలో మిశ్రమపంటలను సాగు చేయటంతో కుటుంబాలకు పోషకాహారం లభ్యమయింది. మరోవైపు భూసారం పెరిగి మంచి దిగుబడులు వచ్చి నికరాదాయం పెరిగింది.
ఇప్పుడు 600 గ్రామాల్లోని మహిళలు ఎకరా నమూనా పద్ధతిలో సాగు చేస్తున్నారు. వారు తమ ఉత్పత్తులు అమ్ముకునేందుకు 5,500 స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేశారు. 20 వేల మంది మహిళా రైతుల జీవితాల్లో ఎకరం నమూనా పద్ధతి కొత్త వెలుగులు నింపింది.
కరువు ప్రాంతాల్లో ప్రజల అభివృద్ధి కోసం చేసిన కృషికి గుర్తింపుగా ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపి) ఏటేటా ఇచ్చే ‘ఈక్వేటర్’ పురస్కారానికి ఎస్‌ఎస్‌పీ ఎంపికైంది. సెప్టెంబర్‌లో న్యూయార్క్‌లో జరిగే ఐక్యరాజ్య సమితి 72వ సర్వసభ్య సమావేశాల్లో ఈ పురస్కారాన్ని ఎస్‌ఎస్‌పీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రేమ గోపాలన్ అందుకుంటారు.
సేంద్రియ సేద్యంతో ఆహార, ఆదాయ భద్రత
సుస్థిర వ్యవసాయం, ప్రపంచ ఆహార భద్రత కోసం పాటుపడుతున్న మాకు యూఎన్‌డిపి ఈక్వేటర్ ప్రైజ్ రావడం చాలా సంతోషంగా ఉంది. దేశంలో 5 రాష్ట్రాల్లో పనిచేస్తున్న మా ఎస్.ఎస్.పి. బృంద సభ్యులు, గ్రామీణ మహిళా రైతులు అందరం ఆశ్చర్యానికి లోనయ్యాం. కరువు పీడిత మరట్వాడా ప్రాంతంలో పేద రైతు కుటుంబాలకు చెందిన 20 వేల మందికి పైగా మహిళా రైతులు కరువును తట్టుకునే ఒక ఎకరం వ్యవసాయ పద్ధతిని అనుసరిస్తున్నారు.
రసాయనిక ఎరువులు, పురుగుమందుల అవసరం లేకపోవడం, కుటుంబానికి కావాల్సిన ఆహారాన్ని తామే పండించుకోగలగడంతో వీరంతా సంతోషంగా ఉన్నారు. ఏయే పంటలు వేయాలి? ఏ కాలంలో ఏ పంటలు వేయాలి? ఎలా అమ్మాలి? కరువును తట్టుకునే వ్యవసాయం ఎలా చేయాలి? అనే విషయాలపై మహిళలే ఇప్పుడు నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు. మహిళలను రైతులుగా గుర్తిస్తే.. సేంద్రియ సేద్యం ద్వారా ఆహార, ఆదాయ భద్రతను సాధించడం సాధ్యమేనన్న విషయాన్ని ప్రభుత్వాలకు నచ్చజెప్పి, విధానాల్లో మార్పు తేవడానికి ఈక్వేటర్ ప్రైజ్ మాకు కొత్త శక్తినిచ్చింది.
– ప్రేమ గోపాలన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, స్వయం శిక్షణ్ ప్రయోగ్, పుణే, మహారాష్ట్ర
www. sspindia,org, sspindia1@gmail.com
మా కాళ్ల మీద మేం నిలబడ్డాం..
ఎకరా భూమిలో సేంద్రియ పద్ధతుల్లో అనేక పంటలను కలిపి సాగు చేయడం నేర్చు కున్నా. నా భర్తకు సుగర్, అధిక రక్తపోటు సమ స్యలున్నాయి. అందుకే మా కుటుంబానికి మంచి పౌష్టికాహారం కోసం సేంద్రియ సేద్యం చేస్తున్నా. 3 ఎకరాల్లో 15 రకాల పంటలను సాగుచేస్తున్నా. ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. పంటల దిగుబడి 3 రెట్లు పెరిగింది. ఖర్చు పోను ఎకరాకు రూ. 18 వేల ఆదాయం వస్తోంది. మా కాళ్ల మీద మేం నిలబడ్డాం. నా కూతుళ్లను పీజీ దాకా చదివిస్తా.
– వనితా బల్‌బీమ్ మనిషెట్టి, సేంద్రియ మహిళా రైతు, చివ్రి, ఉస్మానాబాద్ జిల్లా, మహారాష్ట్ర
ఆరోగ్యం, ఆదాయం మా సొంతం!
ఎస్‌ఎస్‌పీ శిక్షణ పొందిన తర్వాత మా గ్రామంలో 16 మంది మహిళలం ఒక సంఘంగా ఏర్పడ్డాం. విత్తన ఎంపిక, మిశ్రమ పంటల సాగు, సొంతంగా సేంద్రియ ఎరువుల తయారీ వంటి పలు అంశాలపై మాకు శిక్షణ ఇచ్చారు. గోధుమ, సోయాబీన్, జొన్న, పెసర, టమాటా, పచ్చిమిర్చి వంటì మిశ్రమ పంటలను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్నాం. సాగు ఖర్చు తగ్గటంతో పాటు కుటుంబానికి ఆరోగ్యకరమైన పౌష్టిహారం లభిస్తోంది. నేను తెలుసుకున్న విషయాల గురించి నా తోటి మహిళలకు చెపుతున్నాను. వ్యక్తులు మారినప్పుడే సమాజంలో మార్పు వస్తుంది.
– రాజశ్రీ మనే, సేంద్రియ మహిళా రైతు, అన్సుర్దా, ఉస్మానాబాద్ జిల్లా, మహారాష్ట్ర
మా జీవితాలు మారిపోయాయి!
మొదట్లో మా గ్రామం అంతా రసాయన సేద్యం చేసేవాళ్లం. ఎరువులు పురుగుమందుల కొనుగోలుకు చాలా డబ్బు ఖర్చయ్యేది. 2013లో ఎస్‌ఎస్‌పీ శిక్షణకు హాజరయ్యా. నాకు ఒక ఆవు, ఎకరా భూమి ఉంది. సేంద్రియ ఆవాలు, కూరగాయలు, ఉల్లి, గోధుమ పంటలను సాగు చేస్తున్నాం. పంచగవ్య, సేంద్రియ ఎరువులను తయారు చేసుకొని వాడతాం. మేం తినగా మిగిలిన కూరగాయలు, పంచగవ్య అమ్ముతున్నాను. నెలకు రూ. 9 వేలు సంపాదిస్తున్నా.
– షీలాదేవి, సేంద్రియ మహిళా రైతు, గోడియారి, దర్బంగ జిల్లా, మహారాష్ట్ర
– సాగుబడి డెస్క్.