ఢిల్లీ రైతు ఉద్యమంలో పాల్గొనేందుకు పంజాబ్ నుంచి తనే స్వయంగా జీప్‌ను నడుపుకుంటూ వెళ్తున్న మంజీత్ కౌర్. జీపులో సహ ఉద్యమకారులు.
ధైర్యాన్ని సడలించే చలి గాలులు. నిరసనను నీరుగార్చే అకాలవర్షం. టియర్ గ్యాస్.. జల ఫిరంగులు. ఉండటానికి లేదు. తినడానికి లేదు. వసతి లేదు. సదుపాయం లేదు. నెలలుగా రోడ్ల మీదే జీవనం. ప్రదర్శనలో సహచరుల మరణం! ఏడుసార్లు చర్చలు విఫలం. ఏ వైపునా కనిపించని ఆశాకిరణం. ఢిల్లీలో రైతు పోరు గెలుస్తుందా? ‘గెలిపిస్తాం’ అంటున్నారు మహిళా రైతులు! ‘తియ్యండ్రా బండ్లు’ అంటూ.. స్టీరింగ్ అందుకుంటున్నారు!
పొలంలో కలుపును గుర్తించగల రైతులు పాలకుల నలుపు ఆలోచనల్ని పట్టేయలేరా! ప్రభుత్వం మూడు రైతు చట్టాలను తెచ్చింది సెప్టెంబరులోనే అయినప్పటికీ, వాటిని తేబోతున్నట్లు ముందే గ్రహించిన రైతులు ఆగస్టు నుంచే ఢిల్లీకి చేరుకోవడం మొదలు పెట్టారు. వారిని ఢిల్లీలోకి రానివ్వకుండా కేంద్రం ప్రవేశ ద్వారాలను మూసేసింది. సరిహద్దులైన తిక్రీ, సింఘు ప్రాంతాలలోనే వారిని నిలిపేసింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ల నుంచి వచ్చిన వేలాది మంది రైతులు సరిహద్దులనే తమ నిరసన శిబిరాలుగా చేసుకున్నారు.
వీధుల్లోనే నినాదం, వీధుల్లోనే నివాసం. మహిళా నిరసనకారులకైతే ఇంకా కష్టం. కాలకృత్యాలకు మరింత కష్టం. అయినా వెరవలేదు. ఏ విధంగానూ అనుకూలం కాని ఆ ఆరుబయలు చలిని, ఎండను, అప్పుడప్పుడూ పడే వానను తట్టుకుంటూ ప్రభుత్వంపై పోరాడుతూనే ఉన్నారు. ఆ మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొదట ఆగస్టు 9న సన్నగా మొదలై, డిసెంబరులో ఉద్ధృతమైన రైతు ఉద్యమ పోరాటంలో ఇంతవరకు 25 మంది వరకు రైతులు గుండెపోటుతో, రోడ్డు ప్రమాదాలలో చనిపోయారు.
ప్రభుత్వం దిగిరాలేదు. వస్తుందన్న ఆశా కనిపించడం లేదు. ఈ తరుణం లో రైతు ఉద్యమం మెల్లిగా మహిళల చేతుల్లోకి చేరుకుంది. రైతు ఉద్యమం మహిళా ఉద్యమంగా రూపుదిద్దుకుంటున్న సూచనలూ కనిపిస్తున్నాయి. అంటే.. రైతు ఉద్యమం గెలుపునకు దగ్గరగా ఉందనే. పొలంలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా కష్టపడతారు. దేశంలోని సాగు భూమిలో 12 శాతానికి మాత్రమే హక్కుదారులైన మహిళలు సాగు పనుల్లో 75 శాతం వరకు ఉన్నారు. ఈ శక్తి చాలదా.. ప్రభుత్వాన్ని తూర్పార పట్టడానికి. తాలు చట్టాలను వదిలించడానికి.
∙∙
బుధవారం మంజీత్ కౌర్ అనే 62 ఏళ్ల మహిళా రైతు పంజాబ్‌లోని పటియాలా నుంచి ఢిల్లీలో రైతుల నిరసన స్థలి అయిన సింఘూ వరకు 257 కి.మీ. దూరం తనే స్వయంగా జీపును నడుపుకుంటూ వచ్చి ప్రదర్శనలో పాల్గొన్నారు. తనతోపాటు ఆమె మరో ఐదుగురు మహిళా రైతులను ఎక్కించుకుని వచ్చారు. ఈ సీన్ అచ్చంగా మన తెలుగు సినిమాల్లో వినిపించే ‘తియ్యండ్రా బండ్లు’ అనే పాపులర్ డైలాగ్ కి అతికినట్లుగా ఉంది.
ట్విట్టర్‌లో మంజీత్ కు దేశవ్యాప్తంగా పూలమాలలు, అభినందనలు! ప్రభుత్వంతో కాయో పండో తేల్చుకోవాలన్న స్థిరచిత్తంతో ఢిల్లీకి చేరుకుంటున్న పెద్ద వయసు మహిళల్లో మంజీత్ ఒకరు మాత్రమే. వీళ్లంతా.. నిరాశ చెందుతున్న పురుష సహచరులలో పోరాట పటిమను పునరుజ్జీవింపజేస్తున్నారు. మంజీత్‌లానే.. బల్జీత్ కౌర్, కుల్వీందర్, ముల్కీత్, జస్పాల్, సుర్జీత్, పరమ్జీత్, పర్మీందర్ ఢిల్లీలోని ప్రధాని కార్యాలయానికి సెగ తగిలేలా సరిహద్దుల్లో నిరసనల వేడిని చల్లారనివ్వకుండా రాజేస్తున్నారు. మహిళా రైతు భూమాత అంశ మరి. తనను నమ్ముకున్న వారిలో సత్తువ నింపకుండా ఉంటుందా?!
ఇప్పుడే గొంతెత్తాలి
వ్యవసాయం మాకు ఉపాధి కాదు. అది మా రక్తంలోనే ఉంది. నేనిప్పుడు మా పొలంలో ఉండాలి. కానీ ఎక్కడున్నాను! ఢిల్లీ టిక్రీ సరిహద్దులో. ఏం కర్మ. పొలంలో పంట పండించాల్సిన వాళ్లం నెల రోజులుగా రోడ్డు మీద ఉన్నాం. ప్రభుత్వానికి అర్థం కాదా?! మాకు ప్రయోజనం లేని కాలీ కానూన్‌లను (చీకటి చట్టాలను) తెస్తే మేమెందుకు ఊరుకుంటాం? ఇప్పుడు గొంతెత్తకపోతే మాకెప్పటికీ న్యాయం జరగదు.
– బల్జీత్ కౌర్ (50)
పిల్లల్ని ఎలా పోషించాలి?!
కొత్త చట్టాలు మా పంటకు స్థిరమైన ధర లేకుండా చేస్తాయి. మా బతుకులు ఛిన్నాభిన్నం అవుతాయి. పంటను ఎలా అమ్ముకోవాలి? మా పిల్లల్ని ఎలా పోషించాలి? నిరసన తొలిరోజు నుంచీ మేము ఇక్కడే ఉన్నాం. చట్టాలను రద్దు చేసేవరకు ఇక్కడి నుంచి కదలం. బతుకు మీద తప్ప ఇంటి మీద మాకు బెంగ లేదు.
– కుల్వీందర్ కౌర్
పని ఉన్నా పొట్ట నిండదు
ఏ పనీ తేలిక కాదు. తినాలంటే పని చేయాలి. మాకు తెలిసిన పని వ్యవసాయం. ఇప్పుడీ కొత్త చట్టాల వల్ల పని ఉన్నా మాకు తినడానికి ఉండదు. పెద్ద కంపెనీలకు మేలు చెయ్యడానికి రైతుల పొట్టలు కొడుతున్నారు. ఆ కంపెనీలు మా పంటలను ‘దొంగిలించి’ నాలుగు రెట్ల ధరకు నగరాలలో అమ్ముకుంటాయి. ఎంత అన్యాయం?! ప్రభుత్వానికి మా గోడు పట్టదా?
– పర్మీందర్ కౌర్
మేమెక్కడికి వెళ్లాలి?!
మా దిగుబడి ఎంతున్నా కనీస మద్దతు ధర లేకుంటే మా రాబడి పూర్తిగా తగ్గిపోతుంది. అప్పుడు మేము ఎక్కడికి వలస వెళ్లాలి? ముప్పై ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నాను. పురుషుల కంటే మహిళలే పంట పనులు ఎక్కువగా చేస్తారు. కొత్తచట్టాలు అమలయితే వాటి ప్రభావం ముందుగా పడేది మహిళల మీదే.
– ముల్కీత్ కౌర్
Comments
Please login to add a commentAdd a comment