ఆధార్‌ కోరలు తీసిన సుప్రీం | Adolf Hitler is initiation for Aadhar like cards | Sakshi
Sakshi News home page

ఆధార్‌ కోరలు తీసిన సుప్రీం

Published Tue, Aug 29 2017 1:29 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

ఆధార్‌ కోరలు తీసిన సుప్రీం - Sakshi

ఆధార్‌ కోరలు తీసిన సుప్రీం

రెండో మాట
మన ‘ఆధార్‌’ సమాచారం యావత్తూ అమెరికాకు చేరిందనీ, అకౌంట్‌ నంబర్లు సహా ఆధార్‌ సమాచారం నిక్షిప్తమై ఉన్న ‘డేటా’ కాస్తా అమెరికన్‌ కేంద్ర గూఢచార సంస్థలకు అందుబాటులో ఉందనీ, ఇందుకు వారు ‘క్రాస్‌ మ్యాచ్‌ టెక్నాలజీస్‌’ అనే కంపెనీని వాడుకున్నారని ప్రసిద్ధ ‘వికీలీక్స్‌’ సంస్థ వెల్లడించింది. విచిత్రమేమంటే మన పాలకులకు ‘ఆధార్‌’ రూపకల్పనకు కీలకమైన బయోమెట్రిక్‌ పరికరాలను సరఫరా చేసిన కంపెనీల్లో ఈ క్రాస్‌ మ్యాచ్‌ టెక్నాలజీస్‌ కంపెనీ కూడా ఉందని వికీలీక్స్‌ తెలిపింది.

‘వ్యక్తిగత జీవితంలో గోప్యత అనేది మానవుడి హుందాతనం, గౌరవ ప్రతిపత్తులకు సంబంధించి కీలక అంశం. అదే రాజ్యాంగ చట్టానికి జవం, జీవం. పార్లమెంటరీ చట్టాలు ఈ గోప్యతను కాపాడతాయని ప్రభుత్వం వాదిస్తున్నది. కానీ చట్టాలను పార్టమెంటరీ మెజారిటీ పేరిట రూపొందించనూ వచ్చు; అదే మెజారిటీ చాటున రద్దు చేయనూ వచ్చు. గోప్యత పౌరుల ప్రాథమిక హక్కే. రాజ్యాంగంలోని 21వ అధికరణలో పేర్కొన్న జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛలలో గోప్యత (ప్రైవసీ) అంతర్భాగమే. వివిధ సంక్షేమ పథకాల వల్ల లాభాలను అందుకునేందుకు ‘ఆధార్‌’ గుర్తింపు కార్డును తప్పనిసరి చేస్తూ కేంద్రం చేసిన చట్టాన్ని సవాలు చేస్తూ అనేక పిటిషన్లు దాఖలైనందున ఆధార్‌ వివరాలను (డేటా) కాపాడేందుకు ప్రత్యేక భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయవలసిందే. వ్యక్తుల గోప్యతా హక్కుకు సమాచార గోప్యత అనివార్యం. ఒకవేళ ఆధార్‌ పేరిట వ్యక్తి గోప్యతా స్వేచ్ఛపై ఆంక్షలు సహేతుకంగా లేకపోతే ఆధార్‌నే కొట్టేస్తాం’.
– (సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చరిత్రాత్మక తీర్పు, 24–8– 2017)
‘వేలిముద్రల అవసరం చట్టప్రకారం కేవలం నేరగాళ్ల విషయంలోనే వర్తిస్తుంది. పౌరులకు కాదు.’   – గాంధీజీ

తొమ్మిదిమంది న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం ఇచ్చిన చరిత్రాత్మక తీర్పు ఏ పరిణామాల నేపథ్యంలో పాలక వర్గాల ఏ వికృత నిర్ణయాల, చేష్టల పూర్వరంగంలో అనివార్యమయిందో తెలుసుకోవాలి. నలభై ఏళ్లనాడు కాంగ్రెస్‌ హయాంలో (ఇందిర పాలన) ఆత్యయిక పరిస్థితి విధించినందువల్ల రాజ్యాంగం హామీ పడిన స్వాతంత్య్రాలను ప్రజలు కోల్పోవలసి వచ్చింది. నేడు బీజేపీ–ఆరెస్సెస్‌ కేంద్ర పాలనా వ్యవస్థలో మరో రూపంలో దేశ ప్రజలు ఎదుర్కొనవలసి వస్తున్నది. అలాంటి నేపథ్యంలో సుప్రీం కేంద్రానికి మరొక ముగుతాడు వేయవలసి వచ్చింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పార్టీ అగ్రనేత అడ్వాణి ఎందుకు ప్రకటించవలసి వచ్చిందో! ‘మరొకసారి దేశంలో ఆత్యయిక పరిస్థితి ప్రకటించే అవకాశం ఉంద’ని అన్నారు. అనంతర పరిణామాలలో వచ్చినదే ఆధార్‌ గుర్తింపు కార్డు. దీనిని కాంగ్రెస్‌ ప్రారంభించగా, బీజేపీ పాలనలో మరింత పటిష్టంగా పౌరులపై నిఘా కార్యకలాపాలు పెంచే క్రమంలో వచ్చింది.

ప్రజా ప్రయోజనంతో నిమిత్తం లేదు
ఆధార్‌ చరిత్ర, పుట్టుపూర్వోత్తరాలు అనంతం. ప్రజా ప్రయోజనాలతో నిమిత్తం లేకుండా విదేశీ సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే కలిగిన నందన్‌ నిలేకనీ నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వంతో (2009–10) మంతనాలాడి పౌరులకు 12 అంకెలతో కూడిన ఒక శాశ్వత గుర్తింపు కార్డు ఉండడం అవసరమని ఒప్పించారు. అలా అపురూప (యూనిక్‌ ఐడెంటిటీ కార్డు యూఐడీ) కార్డు ముద్రణకు పాలకులను అంగీకరింపచేశారు. నిజానికి ‘ముందు ముందు ప్రజా ప్రయోజనాలతో నిమిత్తం లేకుండా సాంకేతిక నిపుణులే పాలకుల ద్వారా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అమలు జరిపించే’ అవకాశం ఉందని ఒక అమెరికన్‌ రచయిత 20 ఏళ్ల నాడే పేర్కొన్నారు. దీనికి రుజువు ఆధార్‌ మంత్రాంగం. దీనిని ప్రజా సేవల పేరిట వ్యక్తుల పైన కూపీలు తీసే వేగుల ప్రయోగంగా భావించి కర్ణాటక హైకోర్టు మాజీ న్యాయమూర్తి పుట్టస్వామి, ఇంకొందరు సామాజిక కార్యకర్తలు చట్టరూపం దాల్చక ముందు కేవలం బిల్లు రూపంలో ఉన్నప్పుడే (ఆగస్ట్‌–సెప్టెంబర్‌ 2013) సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

అందుకు సంబంధించిన పిటిషన్లు ముంబై, మద్రాసు హైకోర్టులలో దాఖలైనాయి. అప్పుడు జస్టిస్‌ పుట్టస్వామి సుప్రీంకోర్టులో ఒక ప్రశ్న లేవనెత్తారు– ‘నా నిత్యావసరాలకు రేషన్‌ కార్డు, బ్యాంక్‌ అకౌంటెంట్‌ కార్డు, పాన్‌ కార్డు, ప్రయాణ కార్డు, పాస్‌పోర్ట్‌ కార్డు ఉండగా ప్రత్యేకించి ఈ ఆధార్‌ కార్డును నేనెందుకు తీసుకోవాలి?’ అని. నిజానికి ఆధార్‌ కార్డు పథకం ఆమోదం పొందేవరకు ‘స్వచ్ఛందం’ ప్రాతిపదకనే చూపారు. తరువాత నిర్బంధం చేశారు అని కూడా ఆయన వివరించారు. ఇంకా చావుపుట్టుకల నమోదుకు, విద్యా సంస్థలలో చేరడానికి, ఉద్యోగాలకు, బ్యాంకు లావాదేవీలకు, వస్తు సేవలకు– ఇలా సవాలక్ష పేర్లతో ఆధార్‌ను అనుసంధానించి నిర్బంధం చేశారు. అందుకే 2013లో సుప్రీంకోర్టు వస్తుసేవలకు మాత్రం స్వచ్ఛందంగానే అనుమతించాలనీ, నిర్బంధం చేయరాదనీ తీర్పు ఇవ్వవలసి వచ్చింది. ఈ తీర్పును నాడు కాంగ్రెస్‌ మన్నించింది.

కానీ ఆ పార్టీ పాలనలో లోలోపల తొలుస్తున్న పురుగు మాత్రం అలాగే ఉంది. ఆ పురుగునే బీజేపీ పాలకులు పెంచి పోషించారు. దాని వికృత రూపమే ఆ తరువాత 2016లో ‘ఆధార్‌’కు చట్టబద్ధత కల్పిం చడం, నిర్బంధం చేయటమూ. నిజమే మరి, జస్టిస్‌ పుట్టస్వామి ప్రభృతులు తమ వాంగ్మూలంలో చెప్పినట్టు తనను గుర్తించడానికి ఫొటోతో సహా ఉన్న ఒక్క ‘రేషన్‌ కార్డు’ చాలన్నట్టుగా, ఇండియాలో పౌరులపై నిఘా వేయడానికి, అరెస్టులు చేయడానికి మరెన్నో చట్టాలున్నాయి, కేంద్ర సంస్థలున్నాయి, సాధనాలున్నాయి: ఇంటెలిజెన్స్‌ బ్యూరో, సీబీఐ, మిలటరీ ఇంటెలిజెన్స్, నేషనల్‌ టెక్నికల్‌ రీసెర్చి ఆర్గనైజేషన్, రెవెన్యూ గూఢచారి శాఖ, ఇండియన్‌ టెలిగ్రాఫ్‌ యాక్టు, సమాచార సాంకేతిక వ్యవహారాల నియంత్రణ చట్టం, మోనిటరింగ్, సెన్సిటివ్‌ పర్సనల్‌ డేటా రూల్స్‌ 2011, సైబర్‌ కాప్‌ రూల్సు 2011, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సీఆర్‌పీసీ) 1973 వగైరా, వగైరా. మరి ఇన్ని ఉండగా కూడా ‘ఆధార్‌’ను పాలకులు ఎందుకు ఆశ్రయించినట్టు?

గోప్యత హక్కుకు భంగం కాబట్టే!
సుప్రీం తాజా తీర్పు వచ్చేదాకా ‘గోప్యత ప్రాథమిక హక్కు’ కాదన్నవారు అది ప్రాథమిక హక్కేనని, సంపూర్ణ హక్కు మాత్రం కాదని మాట మార్చారు. కానీ ఆధార్‌ను నిర్బంధం చేయడంలో పాలకుల ప్రయోజనం వేరు. కేంద్రం నియమించిన అధికారి దేశ భద్రతా ప్రయోజనాల దృష్ట్యా వ్యక్తుల ఉనికికి సంబంధించిన సమాచారాన్ని, అధికారిక రికార్డులను ప్రభుత్వానికి వెల్లడిం చాల్సి ఉంటుందని ఆధార్‌ చట్టం శాసిస్తోంది. దీనిపై శంకర్‌ అయ్యర్‌ వివరిస్తూ నిఘాకు భారీ సమాచార దృశ్యం కావాలంటే అడుగడుగునా చిన్న చిన్న చుక్కల్ని కలుపుకుంటూ పోవాలి గదా అన్నారు. అంటే, గోప్యంగా ఉన్న సమాచారాన్ని నాలుగు మూలలనుంచి ఆధార్‌ కార్డు ఆధారంగా గుంజు కుంటూ రావాలి. ఈ కూపీ ప్రయోగాలన్నింటినీ స్వయంగా బ్రిటిష్, అమెరికన్, ఫ్రెంచి పార్లమెంట్‌లను సందర్శించిన తరువాతనే తాను ఇండియాలో ఆధార్‌ ప్రయోగానికి దిగానని స్వయంగా నిలేకని ప్రకటించారని మరచిపోరాదు.

ఆధార్‌ మూలాలు ఇప్పటివా?
‘ఆధార్‌’ ప్రయోగానికి మూలాధారమైన రహస్య యంత్రం ‘బయోమెట్రిక్‌’ చట్టాన్ని ప్రపంచంలో మొదటిసారిగా 1933లోనే జర్మనీ ప్రజలపై ప్రయోగించినవాడు నాజీ హిట్లర్‌. నాటికే బహుళ జాతి గుత్త కార్పొరేషన్‌ అయిన ‘ఐబీఎం’ సంస్థ ఆసరాతో హిట్లర్‌ ‘ఆర్యజాతి’ సిద్ధాంతం పేరిట యూదులను జర్మనీ నుంచి తరిమికొట్టే ప్రయత్నంలో జనాభా లెక్కల పేరిట విధ్వంసం సృష్టించాడు. ఇందుకోసం ‘హోలెంత్‌–డి–11’ అనే ఐడీ (గుర్తింపు) కార్డుల్ని ఉత్పత్తి చేసే యంత్రాన్ని సృష్టించారు. ఈ యంత్రాన్నే ఇప్పుడు వాషింగ్టన్‌ లోని అమెరికన్‌ హాలోకాస్డ్‌ (యూదు మతస్తుల్ని లక్షల సంఖ్యలో ఊచకోత కోయించిన) దృశ్యాలలో ఉన్న ప్రదర్శనశాలలో ఉంచారు. కానీ ఆధునిక అమెరికా పాలకులు సామ్రాజ్య విస్తరణ యుద్ధ ప్రయోజనాలలో భాగంగా ‘భస్మాసుర హస్తా’న్ని సొంత పౌరులపైనే జాతీయ భద్రత, హోంలాండ్‌ సెక్యూరిటీ చట్టాల పేరిట ‘నిఘా’ చట్టాలను ప్రయోగిస్తోంది. ఈ నిఘాకు అమెరికా పెట్టిన పేరు ‘ప్రజల సామాజిక భద్రత’, దాని పేరిట ఒక ‘నంబరు’తో ఉన్న కార్డు.

అంతేగాదు, ఆస్ట్రేలియాలో ‘ఆర్వీలియన్‌ లాస్‌’ పేరిట పౌరులపై ఇలాంటి నిఘా చట్టాలే ఉన్నాయి. కానీ అక్కడ కూడా ప్రజా వ్యతిరేకత కట్టలు తెంచుకున్నప్పుడు ఆస్ట్రేలియా పాలకులు ఉపసంహరించుకోవలసి వచ్చింది. అలాగే ప్రజాగ్రహం ఫలితంగా ఈ ‘నిఘా’ చట్టాల్ని తర్వాత కెనడా, న్యూజీలాండ్, ఫిలిప్పీన్స్, గ్రీస్‌ ప్రభుత్వాలూ ఉపసంహరించుకోక తప్పలేదు. నేటి జర్మనీలో ‘బయోమెట్రిక్‌’ (ఐరిస్‌) కూపీ సమాచార సేకరణను పూర్తిగా నిషేధించారు. అంతదాకా అమెరికాలో లేని ‘సోషల్‌ సెక్యూరిటీ నంబర్‌’ (ఎస్‌.ఎస్‌.ఎన్‌.) అనే కూపీ ప్రయోగాన్ని తర్వాత ప్రవేశపెట్టిన వాడు మాజీ ప్రెసిడెంట్‌ జార్జిబుష్‌. ఈ నంబర్‌ని డ్రైవింగ్‌ లైసెన్స్‌కి, బ్యాంకు ఖాతాలకు, ప్రయాణీకులకు, ఎయిర్‌లైన్స్‌ టికెట్లకు వాడేలా నిర్బం ధించాడు. బ్రిటిష్‌ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌ దీనినే అనుసరించబోయాడుగానీ, ప్రజలు తిప్పికొట్టారు.

ఖండాలు దాటిన మన డేటా
మన ‘ఆధార్‌’ సమాచారం యావత్తూ అమెరికాకు చేరిందనీ, అకౌంట్‌ నంబర్లు సహా ఆధార్‌ సమాచారం నిక్షిప్తమై ఉన్న ‘డేటా’ కాస్తా అమెరికన్‌ కేంద్ర గూఢచార సంస్థలకు అందుబాటులో ఉందనీ, ఇందుకు వారు ‘క్రాస్‌ మ్యాచ్‌ టెక్నాలజీస్‌’ అనే కంపెనీని వాడుకున్నారని ప్రసిద్ధ ‘వికీలీక్స్‌’ సంస్థ (26.8.17) వెల్లడించింది. విచిత్రమేమంటే మన పాలకులకు ‘ఆధార్‌’ రూపకల్పనకు కీలకమైన బయోమెట్రిక్‌ పరికరాలను సరఫరా చేసిన కంపెనీల్లో ఈ క్రాస్‌ మ్యాచ్‌ టెక్నాలజీస్‌ కంపెనీ కూడా ఉందని వికీలీక్స్‌ తెలిపింది. ఈ సందర్భంలోనే మన పాలనా వ్యవస్థలో జరుగుతున్న మరో పరిణామాన్ని కూడా సామాజిక కార్యకర్తలూ, ప్రజలూ గుర్తించాల్సిన అవసరం ఉంది. అది– ‘శాసన వ్యవస్థను ఆక్రమించి న్యాయవ్యవస్థ పెత్తనం చేయాలని ప్రయత్నిస్తోంది. చట్టాన్నైనా న్యాయవ్యవస్థ సమీక్షా పరిధికి బద్ధురాలిని చేసిన రాజ్యాంగ ఆదేశాన్ని పాలకులు ఉల్లంఘించడానికి వెనుకాడ్డం లేదని గమనించాలి. ఇది, ప్రజాస్వామ్యం మనుగడకు ప్రమాదకర సూచీ. అందుకే ఎమర్జెన్సీ రద్దు చేసిన ప్రజల హక్కు ‘హెబియస్‌ కార్పస్‌’ పిటిషన్‌ ద్వారా న్యాయాన్ని పొందే అవకాశాన్ని కల్పించి వందలాదిమంది డిటెన్యూల విడుదలకు అందుబాటులోకి తెచ్చి, సుప్రీం ప్రధాన న్యాయమూర్తి పదోన్నతిని కాలదన్నిన జస్టిస్‌ ఖన్నా ఒక మాటన్నారు: ‘‘కొందరు పాలకులు కాటికి చేరినా, అక్కడి నుంచి కూడా ప్రజల్ని శాసించాలని కోరుకుంటా’’రు అని!!


ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement