సత్యానికి సమాధి కట్టొద్దు!
- విశ్లేషణ
మనిషికి, పశువుకు ఉన్న మౌలికమైన తేడాల్లో భావ ప్రకటనా స్వేచ్ఛ ఒకటి. పశువులు అత్యంత ప్రాథమిక సహజ లక్షణంతో మాత్రమే తమ భావ వ్యక్తీకరణ చేయగలవు. కాని మనిషి తన భాష సాయంతో హావభావాలను జోడించి మరీ భావాలను వ్యక్తం చేయగలడు. ఆ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించడం అంటే మనుషులను పశువులుగా మార్చడమే. అలా భావాలను పరస్పరం చర్చించుకుని, సమస్యలను పరిష్కరించుకునే ప్రక్రియకు ఆస్కారం లేకుండా చంద్రబాబు ఏపీలో ద్వారాలు మూసేశారు.
ఏ విషయంలో అయినా బలప్రయోగం ద్వారా వ్యతిరేకతను అణచివేయాలన్న తలంపే అసంబద్ధమైనది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ అయినా, నవ్యాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అయినా సరే, అణచివేతకు పాల్పడటమన్నది వారిలోని అభ ద్రతా భావాన్ని, ప్రజలపట్ల వారికి ఉన్న భయాన్ని బయట పడుతుందే కానీ అంతిమంగా అది వారికి ఆశించిన ఫలితాన్ని ఇవ్వదు. ఏ యుద్ధంలో అయినా ముందు మరణించేది ‘సత్యం’ అని అంటారు. అంటే వాస్తవాలను ప్రజలకు తెలియకుండా, సత్యాన్ని హత్య చేయాలన్న ప్రయత్నం సమాచార స్వేచ్ఛపైనే జరుగుతుంది. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత వార్తా కథనాలతోపాటు, వీడియో దృశ్యాల ద్వారా జరిగిన వాస్తవం కళ్లకు కట్టినట్లు చానల్ చూసిన వారందరికీ తెలిసిపోతుంది. ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తెలివితక్కువ అత్యుత్సాహం వల్ల స్వయంగా ఏపీ సీఎం చంద్ర బాబు కూడా కన్నంలో దొరికినట్లుగా ప్రజలందరి ముందూ దొరికిపోయిన విషయం మనమెరిగిందే. ముద్రగడ పద్మనాభం ఉదంతంలో తమ దుర్మా ర్గానికి ప్రత్యక్ష సాక్ష్యం దొరకకుండా సాక్షి చానల్ ప్రసారాలపై చంద్రబాబు ప్రభుత్వం ఆంక్షలు విధించింది.
దాగుడుమూతలు లేని ‘సాక్షి’
వాస్తవాలను వక్రీకరించే ధోరణులు మితిమీరడంవల్ల ప్రజలకు రెండో కోణం తెలియజేయడం కోసం పత్రికను స్థాపిస్తున్నామని సాక్షి యాజమాన్యం మొద ట్లోనే ప్రకటించింది. ఆ స్ఫూర్తికి అనుగుణంగానే సాక్షి పత్రిక కొనసాగు తోంది. వాస్తవాలలోని రెండో కోణాన్ని, ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తూ, వార్తలను, కథనాలను అందిస్తోంది. సాక్షి పత్రికలో శషభిషలు, చాటు మాటులు, దాగుడుమూతలు ఉండవు. వైఎస్సార్ అచరణ, ఆశయాలను ప్రతిబింబించేలా ఆ పత్రిక ఉంటోంది. అందులోని కథనాలను నేను లేదా మరొకరు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. కానీ సాక్షి ప్రకటించ దలిచిన వాస్తవం మాత్రం అదే. కొన్ని పత్రికలు తాము ఏ రాజకీయ పార్టీ కొమ్ముకాయమని, నిష్పక్షపాతంగా, తటస్థంగా ఉంటామని చెప్పుకుం టాయి. సత్యానికి, అసత్యానికి మధ్య, ప్రజాశ్రేయస్సుకు ప్రజా వ్యతిరేకతకు మధ్య తాటస్థ్యం ఎక్కడ ఉంటుంది? దుర్మార్గానికి, సన్మార్గానికి మధ్య నిష్పక్ష పాతం ఎలా సాధ్యం? ఏదేమైనా, ‘వినదగునెవ్వరు చెప్పిన - వినినంతనె వేగపడక వివరింపదగన్’ అన్నారు. అయితే మా మాట తప్పితే మరో మాట విననీయం అని అనడం, ‘నేను చెప్పిందే విను... రెండో మాట వినకు’ అనేది సినిమాలో ‘డిక్టేటర్’కు చెల్లుతుందేమో కాని, ఇంకా పరిపూర్ణత సాధించన ప్పటికీ ఈనాటి ప్రజాస్వామ్య వ్యవస్థకు మాత్రం చెల్లదు.
పాలించేవారికి మూర్ఖత్వంతోపాటు, రోడ్డురోలరు తరహా మొరటుతనం కూడా పనికిరాదు. ఈరోజు ఉన్న పాలకులు వచ్చేసారి మారిపోవచ్చు. ఎవరికైనా ఇది వర్తిస్తుంది. ప్రతి సమాజంలోనూ - వర్గ, వర్ణ, లింగ తదితర ఆర్థిక రాజకీయ సాంస్కృతిక అసమానతలు తొలగేవరకు నైతిక ఘర్షణ పూర్వక సమాజం దానితోపాటు భావ సంఘర్షణలూ ఉంటూనే ఉంటాయి. పాలకులు ఈ వాస్తవాన్ని గుర్తించి, తదనుగుణంగా ఓరిమితో చాకచక్యంగా వ్యవహరించాలి. అంతేగానీ, ప్రతిపక్ష భావజాలాన్ని అణచివేస్తే కుదరదు. ప్రజలు ఎంతకాలమో మూగజీవుల మాదిరి ఉండలేరు. బయటకు వెళ్లే మార్గాలు మూసివేసి, ఒక చిన్న గదిలో పిల్లిని బంధించి, అదేపనిగా హింసి స్తుంటే పిల్లి అయినా సరే పులిలా తిరగబడుతుంది. అందులో ప్రాణమున్న మనుషులు శవాలవలే, కట్టెలవలే వాలునేపడి కొట్టుకుపోరు. నిరంకుశత్వాన్ని ఎల్లకాలం భరించలేరు. ఎదురు తిరుగుతారు. నిరంకుశత్వాన్ని ఓడిస్తారు.
అందునా సున్నిత అంశాలపట్ల పాలకులు మరింత జాగ్రత్తతో వ్యవహ రించాలి. ప్రస్తుతం ఏపీలో ముద్రగడ పద్మనాభం దీక్ష, తదనుగుణంగా కాపుల సంఘీభావ కార్యాచరణ నడుస్తున్నాయి. గతంలో, కాపు సామాజిక వర్గానికి చెందిన కాపునేత, కాంగ్రెస్ యువనేత వంగవీటి రంగా హత్యకు గురయ్యారు. కమ్మ కులానికి చెందిన ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన కులతత్వంతో వ్యవహరించలేదు. ప్రజలు ఎన్టీఆర్‌ను మూడు తరాల వెండితెర కథానాయకునిగా అభిమానించి, ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక అయిన పదహారణాల తెలుగు జాతీయ నేతగా ఆదరించి, అనితర సాధ్యంగా గెలిపించారు. కానీ ఆయన కులానికే చెందిన, మిడిమేళపు దొరలు కొందరు తమవాడు మూడు దశాబ్దాల అనంతరం అధికారంలోకి వచ్చాడని, ఇక తమ ఆధిక్యతను చాటిచెప్పాలని ‘అతి’గా వ్యవహరింపసాగారు. ఎన్టీఆర్ వారాశిం చినట్లు వారి దూకుడును ప్రోత్సహించకపోగా, దానికి అడ్డు కట్టవేసే ప్రయ త్నం చేశారు. కుల వైషమ్యాలను తెగనాడుతూ తాను దుర్యోధన పాత్రలో అనితర సాధ్యంగా పల్కిన ‘కులము-కులమని’ అన్న సంభాషణ ఆయనకు ఇష్టమైన డైలాగ్!
ఎన్టీఆర్‌నే ‘పరువు హత్య’ చేశారు
అప్పటికే విజయవాడ కేంద్రంగా నడుస్తున్న ఈ రెండు సామాజిక వర్గాల పోరులో పైచేయి సాధించే ప్రయత్నాలు సాగుతున్నాయి. అందులో భాగంగా నిరాహార దీక్ష చేస్తున్న వంగవీటి రంగాను నడిరోడ్డుపై ఆయన దీక్షా శిబిరం లోనే అర్ధరాత్రి ప్రత్యర్థులు హత్య చేశారు. తమ నేత అయిన ఎన్టీఆర్ ఇలాంటి దుశ్చర్యలకు అంగీకరించడని భావించి అన్నగారికి తెలియకుండా జరిగిన, ఆయన అంతేవాసులు వేసిన ఈ పథకం ఆ తర్వాత తీవ్రమైన శాంతి భద్ర తల సమస్యగా మారి తదుపరి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ఆ పిదప ఎన్టీఆర్ శ్రీమతి లక్ష్మీపార్వతిని వివాహం చేసుకున్నారు. ఆమె బీసీ లకు చెందిన మహిళ. తమ సామాజిక వర్గం కాని, ఆ వర్ణాంతర వివాహం కూడా తోడై ‘పరువు హత్య’ల మాదిరి, చివరకు తెలుగుదేశం పార్టీ నేతలే ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుణ్ని చేశారు. ప్రస్తుత సందర్భంలో ప్రభుత్వం మరింత సంయమనంతో వ్యవహ రించి ఉండాల్సింది.
ఉదాహరణకు ముద్రగడ పుత్రుడు బాలు ఇచ్చిన ప్రక టన ‘సాక్షి’ పత్రికలో వచ్చింది. అలాగే ఆయన కుటుంబ సభ్యులను అవ మానకరంగా నిర్బంధించిన విజువల్స్ సాక్షి చానల్‌లో వచ్చాయి. కొన్ని చానళ్లలో, పత్రికల్లో ఈ వార్తలే లేవు. దాంతో ‘సాక్షి’పై ఆంక్షలు విధించి, అవి బయటకు రాకుండా నిలుపుదల చేస్తే - ఇంకెన్ని దారుణాలు, దుర్మార్గాలు జరుగుతున్నాయో - మనకి వార్తలు చేరడం లేదేమో అని జనం మరింత ఊహించుకుని, పుకార్ల షికార్లు చేసినా నమ్మే పరిస్థితి ఏర్పడుతుంది. అది రాష్ట్రానికి, ప్రజలకూ ఏమీ మంచిది కాదు. పైగా అనవసరంగా, అనాలోచితంగానే ‘సాక్షి’కి ప్రజలలో విశ్వస నీయతనూ, ‘సాక్షి’ లేకపోతే.. ఎట్లా అనే ప్రచారాన్నీ ఇలాంటి చర్యలద్వారా తానే కల్పించినదౌతుంది ప్రభుత్వం. పైగా ‘‘సాక్షి చాన ల్‌ను, పత్రికనూ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని’’ యన మల రామకృష్ణుడి వంటి సీనియర్ నేత చేసిన ప్రకటన - ఉత్తర కుమార ప్రగల్భంగానే మిగిలిపోతుంది. అయినా తమకు ఎదు రులేదు. తాము నంది అంటే నంది, పంది అంటే పంది అని ప్రవ ర్తిస్తే ప్రభుత్వం భంగపడుతుంది.
అక్రమానికి తలొగ్గని ధీరత్వం!
అత్యవసర పరిస్థితిలో పత్రికలపై ఆంక్షలు, నిషేధాజ్ఞలు ఉన్న తరుణంలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక యజమాని రామనాథ్ గోయెంకా వాటిని ఆమోదించలేదు. ఆచరించలేదు. అప్పుడు ఆయన కుమారుడు వచ్చి ‘‘నాన్నా! అన్ని పత్రికలూ - ఇందిరాగాంధీకి, అత్యవసర పరిస్థితికీ ఎలాగో సర్దుకుపోతూ, తలవంచుకు నడుస్తున్నాయి. మన ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కూడా అలాగే....’’ అని పూర్తి చేయకముందే ‘దిన మణి’, ‘ఆంధ్రప్రభ’ వంటి స్థానిక భాషా పత్రికల యాజమాన్యం మీరు తీసు కోండి! ఒక్క ఇండియన్ ఎక్స్‌ప్రెస్ (ఆంగ్ల) పత్రికను మాత్రం నాకు ఉంచండి. ఈ లోకంలోకి మొలతాడు లేకుండా వచ్చాను. అంతగా అయితే మొలతాడు లేకుండానే పోతాను. అంతేగానీ నిరంకుశత్వానికి తలవొగ్గేది లేదని’’స్పష్టం చేశారట. అలాంటి ఆదర్శాలూ, వాటిని ఆచరించే యాజమా న్యాలూ, సంపాదకులు, పత్రికా సిబ్బందీ నేటికీ ఉన్నారు.
చివరిగా - ఎన్టీఆర్‌కు ఆత్మగౌరవం, అందునా ఆంధ్రుల ఆత్మగౌరవం ముఖ్యం. ‘ఎవరీ కేంద్రం? ఎక్కడిది? కేంద్రం మిథ్య...’ అని ధిక్కరించగల ధైర్యం.. కుట్రలు, కుతంత్రాలు ఎరుగని ముక్కుసూటి మొండితనం ఉన్నది. ‘రాజసం’ ఎన్టీఆర్ ప్రధాన గుణం అని సినారే అననే అన్నారు. చంద్రబాబుకు తద్భిన్నంగా, లౌక్యం ఎక్కువ. నాలుగు కాసులు సాధించడం, ప్రజలను తనకు అనుకూలంగా మలచుకోవడానికి సామదాన భేద దండోపాయాలతో పాటు, వంచనాత్మక చాణక్య రాజకీయం తెలిసినవాడు. ‘మోదీ’ శిక్షార్హుడు (మతతత్వవాదిగా) అన్న నోటితోనే, ‘మోదీ’ భారతదేశ అత్యున్నత ప్రధాని అని అనగలిగినవాడు.. బాబు రాజకీయం ముందు మోదీ సైతం ‘ఫ్లాట్’ అయి తీరుతాడని ఆయన అనుయాయుల భావన. అంతటి పాలనాపర కౌటి ల్యుడు - చూస్తూ చూస్తూ, ఇలాంటి అక్రమ ఆంక్షలను విధించి కొరివితో తలగోక్కొనే, చేయి దాటిపోయే పరిస్థితి రానివ్వరనీ ఆశిద్దాం!
కొసమెరుపు
నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించడంపై జయప్రకాష్ నారా యణ్‌ను అభిప్రాయం అడిగినప్పుడు ‘వినాశకాలే విపరీత బుద్ధిః’ అన్నారట. ఎమర్జెన్సీ అనంతరం జేపీ వ్యాఖ్య అక్షరసత్యమై చరిత్రలో నిలిచిపోయింది. ఆ వ్యాఖ్య సారాంశం నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి కూడా వర్తిస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
- డా॥ఎ.పి. విఠల్
వ్యాసకర్త ప్రముఖ మార్క్సిస్టు విశ్లేషకులు 9848069720