
'బెంగళూరు' పాఠం!
సాధారణంగా ఎప్పుడూ ప్రశాంతంగా ఉన్నట్టు కనబడే బెంగళూరు నగరం భగ్గుమంది.
సాధారణంగా ఎప్పుడూ ప్రశాంతంగా ఉన్నట్టు కనబడే బెంగళూరు నగరం భగ్గుమంది. ఉద్యోగుల భవిష్యనిధి(ఈపీఎఫ్) ఉపసంహరణను కఠినతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలపై వస్త్ర కార్మికులు సోమవారం ప్రారం భించిన ఉద్యమం రెండోరోజుకల్లా హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు పోలీస్‌స్టేషన్‌కూ, మూడు బస్సులకూ నిప్పుపెట్టడమేకాక పలు వాహనాలను ధ్వంసం చేశారు. రాళ్లదాడుల్లో, పోలీస్ కాల్పుల్లో అనేకులు గాయపడ్డారు. జన జీవితాలతో ముడిపడి ఉండే అంశాల్లో ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలో...ఒక నిర్ణయం తీసుకునే ముందు ఎన్ని విధాల ఆలోచించాలో బెంగళూరు ఉదంతం తర్వాత పాలకులకు అర్ధమై ఉండాలి. అందుకే కావొచ్చు.... ఈపీఎఫ్ ఉపసంహర ణకు సంబంధించిన కొత్త నిబంధనల అమలును జూలై వరకూ వాయిదా వేస్తు న్నట్టు తొలుత హడావుడిగా ప్రకటించిన కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ మరికొన్ని గంటలకల్లా అంతే హడావుడితో ఏకంగా నోటిఫికేషన్‌నే రద్దు చేస్తున్నట్టు తెలియజేశారు.
ఈ ఉద్యమం ఎటుపోతుందో, ఎక్కడికి దారితీస్తుందోనన్న ఆందోళ నవల్లే నిర్ణయాలు చకచకా మారిపోయాయని అర్ధమవుతుంది. రోడ్డెక్కిన వారంతా ప్రభుత్వ రంగ సంస్థల్లోనో, ప్రభుత్వ విభాగాల్లోనో పనిచేస్తున్న సిబ్బంది కారు. వారంతా చాలీచాలని జీతాలతో, పని ఒత్తిళ్ల మధ్య యాజమాన్యాల దయాదాక్షిణ్యా లపై కాలం వెళ్లదీస్తున్న బడుగు కార్మికులు. పెరిగే ధరలకూ, తప్పని అవసరాలకూ మధ్య నిత్యం నలిగే అభాగ్యులు. వారికి పెద్ద కలలేమీ ఉండవు. వారికొచ్చే జీతం, ఇతర స్థితిగతులూ అందుకు అవకాశమీయవు. నెలానెలా తప్పనిసరి పరిస్థితుల్లో కూడబెట్టుకున్న ఈపీఎఫ్ డబ్బు రిటైరయ్యాక చేతికందితే ఇల్లు కట్టుకోవడానికో, పిల్లల్ని స్థిరపరచడానికో ఉపయోగించుకోవచ్చునన్న ఆశతో జీవించే వ్యక్తులు వారు.
ఈసారి బడ్జెట్ అలాంటివారి ఆశల్ని చిదిమేసింది. ఇప్పుడున్న నిబంధనలు చాలవన్నట్టు ఈపీఎఫ్ చుట్టూ కొత్త నిబంధనలు అల్లింది. ఉద్యోగులు తమ డబ్బు తాము తీసుకోవడానికి వీల్లేనివిధంగా ఇవన్నీ ఉన్నాయి. ఈపీఎఫ్ విషయంలో ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నిబంధనలు, వాటిని వెనక్కు తీసుకున్న వైనం గమనిస్తే నిర్ణయ ప్రక్రియ ఎంత అనాలోచితంగా సాగిందో అర్ధమవుతుంది. పదవీ విరమణానంతరం ఉద్యోగులకు చెల్లించే ఈపీఎఫ్ మొత్తంలో 40శాతానికి మాత్రమే పన్ను మినహాయింపు ఉంటుందని, మిగిలిన 60 శాతం మొత్తం పన్ను పరిధిలోకి వస్తుందన్నది బడ్జెట్ ప్రతిపాదనలోని ముఖ్యాంశం. పన్ను పరిధిలోకి వచ్చే మొత్తాన్ని యాన్యుటీ పథకాల్లో పెట్టుబడులు మినహాయింపు ఉంటుందన్న మెలిక పెట్టారు. అలాగని దానికి పూర్తి మినహాయింపు ఇవ్వలేదు. ఆ పథకాలపై నెలా నెలా వచ్చే రాబడి మీద పన్ను విధిస్తామన్నారు. ఏతావాతా నెలా నెలా ఉద్యోగులు దాచుకునే డబ్బంతా పన్నుల పరిధిలోకి తీసుకొచ్చారు.
పుండు మీద కారం జల్లి నట్టు ఇదంతా ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందని తేల్చారు. దీనిపై పెద్ద దుమారం చెలరేగాక స్వరం మారింది. ఈపీఎఫ్ మొత్తంపై కాదు...దానిమీద వచ్చే వడ్డీపై మాత్రమే పన్ను ఉంటుందంటూ వివరణనిచ్చారు. ఆ విషయంలో ఈనాటికీ అయోమయమే నెలకొంది. దాని సంగతి తేల్చకుండానే ఫిబ్రవరి 10న మరికొన్ని నిబంధనలతో నోటిఫికేషన్ వెలువడింది. అది ఈపీఎఫ్ మొత్తం ఉపసంహరణను కఠినతరం చేసింది.
ఉద్యోగం కోల్పోయేవారు రెండు నెలలకు మించి ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే ఈపీఎఫ్ మొత్తాన్ని ఉపసంహరించు కోవచ్చునని నిబంధన పెట్టారు. అది కూడా ఉద్యోగి జీతంనుంచి మినహాయించిన భాగానికే వర్తిస్తుంది తప్ప యాజమాన్యం వాటా రిటైర్మెంట్ వయసు వచ్చే వరకూ ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాలోనే ఉండిపోతుందన్నారు. కార్మిక సంఘాలు కోరిన మీదట కొన్ని సడలింపులిచ్చామని ఒకసారి...‘ఇవన్నీ ప్రతిపాదనలు మాత్రమే... ఇప్పటికింకా నిబంధనలు మారలేద’ని మరోసారి వివరణనిచ్చి గందరగోళ పరిచారు. బెంగళూరు అంటుకున్నాకైనా ఈ ఊగిసలాట ధోరణి పోలేదు.
అధికాదాయం కోసం కొత్తగా ఏ పన్నులు విధించాలా అని అధికార యంత్రాంగం శోధిస్తుంది. ప్రతిపాదనలు రూపొందిస్తుంది. అందులో ఆచరణ యోగ్యమైనవి ఏవో, కానివేవో నిర్ణయించుకోవాల్సింది పాలకులే. ఇలాంటి ప్రతిపా దనలపై సంబంధిత వర్గాలను విశ్వాసంలోకి తీసుకుని చర్చిస్తే అందరికీ ఆమోద యోగ్యమైన నిర్ణయం తీసుకోవడం పెద్ద కష్టం కాదు. కానీ ఈమధ్య కాలంలో ఇలా చర్చించే సంస్కృతి కనుమరుగవుతోంది. నిర్ణయం తీసుకోవడం...ఎన్ని అవరోధాలె దురైనా అమలు చేయడమే తమ కర్తవ్యమన్నట్టు పాలకులు భావిస్తున్నారు. ఇప్పుడు పీఎఫ్ నిబంధనలకు సంబంధించిన నోటిఫికేషన్‌పై ఎలాంటి చర్చా జరగలేదని సాక్షాత్తూ సంఘ్ పరివార్ అనుబంధ సంస్థ భారతీయ మజ్దూర్ సంఘ్ అంటున్నది.
బెంగళూరు ఉద్యమం విలక్షణమైనది. అందులో పార్టీల ప్రమేయం లేదు. కార్మిక సంఘాలు లేవు. చెప్పుకోదగ్గ నాయకులెవరూ లేరు. అయినా అది పెను హింసకు దారితీసింది. వస్త్ర పరిశ్రమల్లో పనిచేసేవారిలో అభద్రత, అసంతృప్తి ఏ స్థాయిలో ఉన్నదో ఈ ఉదంతం తెలియజెబుతోంది. అధికారికంగా రిటైర్మెంట్ వయసు 58 అయితే ఆ పరిశ్రమలో 50 ఏళ్లకే ఉద్యోగం చాలించవలసివస్తుందని కార్మికులు చెబుతున్నారు.
ఏతావాతా 50వ ఏట ఉద్యోగం కోల్పోయే కార్మికుడు కొత్త నిబంధనలవల్ల ఎనిమిదేళ్లయితే తప్ప ఈపీఎఫ్ మొత్తాన్ని పొందలేడు. వస్త్ర పరిశ్రమలో మాత్రమే కాదు...చాలాచోట్ల చట్టాలు బేఖాతరవుతున్నాయి. కార్మి కులకు దిక్కూమొక్కూలేని స్థితి ఏర్పడుతోంది. దీన్నంతటినీ చక్కదిద్దలేని ప్రభుత్వాలు కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీసే నిబంధనలను మాత్రం అత్యు త్సాహంతో అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. బెంగళూరు ఉదంతమైనా పాలకుల్లో పునరాలోచన కలిగించాలి. పరిస్థితిని చక్కదిద్దడానికి దోహదపడాలి.