దేశంలోని ఉన్నత శ్రేణి విద్యా సంస్థల జాబితాలో అగ్రభాగాన ఉండే జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ) గత అయిదారు రోజులుగా అట్టుడుకుతోంది.
దేశంలోని ఉన్నత శ్రేణి విద్యా సంస్థల జాబితాలో అగ్రభాగాన ఉండే జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ) గత అయిదారు రోజులుగా అట్టుడుకుతోంది. అక్కడి పరిణామాల ప్రభావం ఢిల్లీ మహానగరంలోనూ కనబడుతోంది. జేఎన్‌యూలో ఈనెల 9న జరిగిన ఒక సమావేశంలో జాతి వ్యతిరేక, దేశ వ్యతిరేక నినాదాలు హోరెత్తాయని పేర్కొంటూ ఆ సభలో ప్రసంగించిన యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్యకుమార్‌ను రాజద్రోహం, కుట్ర అభియోగాలతో పోలీసులు అరెస్టు చేయడంతోపాటు మరికొందరిపై కేసులు నమోదు చేశారు. కన్హయ్యకుమార్‌ను పాటియాల కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా సోమవారం చోటుచేసుకున్న పరిణామాలు అసాధారణమైనవి. దేశవ్యాప్తంగా ఉన్న పత్రికలన్నీ మంగళవారం మొదటి పేజీల్లో ప్రచురించిన ఛాయాచిత్రాలు ఢిల్లీలో నెలకొన్న ఆ పరిణామాలకు ప్రతీకగా నిలిచాయి. పాటియాల కోర్టు సమీపంలో ఒక్కడిని చేసి చితకబాదుతున్న, నోరునొక్కుతున్న, బూటుకాళ్లతో తన్నుతున్న చిత్రాలవి. నిజానికి అలాంటి దాడికి గురైంది ఆయనొక్కడు మాత్రమే కాదు...జేఎన్‌యూకి చెందిన విద్యార్థులు, అధ్యాపకులు కావొచ్చునని గుంపు భావించిన ప్రతివారికీ అలాంటి చేదు అనుభవాలే ఎదురయ్యాయి. కోర్టు కార్యకలాపాల గురించి వార్తలు రాయడానికి వెళ్లిన, కోర్టు వెలుపల జరుగుతున్న ఘటనలను చిత్రీకరిస్తున్న పాత్రికేయులను సైతం ఈ గుంపు వదల్లేదు. మహిళా పాత్రికేయులను కూడా మినహాయించలేదు. రక్షించమని కోరినా పోలీసులు చేష్టలుడిగి చూస్తూ మిగిలిపోవడం ఆశ్చర్యం కలిగించగా... బీజేపీకి చెందిన ఢిల్లీ ఎమ్మెల్యే ఓపీ శర్మ తన అనుచరగణంతో స్వయంగా దౌర్జన్యానికి దిగడం మరింత దిగ్భ్రాంతి కలిగించింది. ఘటన జరిగి 24 గంటలు జరిగాక కూడా ఆ ఎమ్మెల్యేకు ఏకోశానా పశ్చాత్తాపం లేదు. అక్కడ పాకిస్తాన్ అనుకూల నినాదాలు, భరతమాతను కించపరిచే నినాదాలు వినబడటంవల్ల తనకు ఆగ్రహం కలిగిందని ఆయనంటున్నారు. అది నిజమే అనుకున్నా....అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన పోలీసులకు ఫిర్యాదుచేయాలి తప్ప గూండాయిజానికి దిగే ప్రయత్నం చేయకూడదు. ప్రజాప్రతినిధిగా చట్టాలు చేసే స్థాయిలో ఉండి చట్ట ఉల్లంఘనకు పాల్పడవచ్చునా అని ప్రశ్నిస్తే సమయానికి చేతిలో తుపాకి ఉంటే కాల్చిపారేసేవాడినని శర్మ చెబుతున్నారు. అదే ధోరణి, అదే ఉన్మాదం మరో గుంపు ప్రదర్శిస్తే ఎలాంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయో...ఎంతటి హింస చెలరేగుతుందో ఆయనకు తట్టినట్టు లేదు. మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామని, సాధారణ పౌరులైనా, ప్రజా ప్రతినిధులైనా చట్టాలకు లోబడి మాత్రమే వ్యవహరించాలని ఆయనకు ఎవరు చెప్పాలి? దేశ రాజధాని నగరంలో ఎన్నికైన ఎమ్మెల్యే మానసిక స్థితి ఇలా ఉండటం, ఆ విషయంలో బీజేపీ పెద్దలు మౌనంవహించడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఈ దౌర్జన్యకాండ సంగతలా ఉంచితే జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడి అరెస్టుకు దారితీసిన పరిణామాలు మరింత దిగ్భ్రమ కలిగించేవి. ఆయన పాల్గొన్న సభలో పార్లమెంటుపై దాడి కేసులో ఉరిశిక్ష అమలైన అఫ్జల్‌గురును కీర్తించే ప్రసంగాలు చేశారని...జాతి వ్యతిరేక, దేశ వ్యతిరేక, పాక్ అనుకూల నినాదాలు వినిపించాయని పోలీసుల అభియోగం. వాటి ప్రాతిపదికనే పోలీసులు కన్హయ్య కుమార్‌పై రాజద్రోహం(124-ఏ), కుట్ర(120-బీ) కేసులు పెట్టారు. మన దేశంలో రాజద్రోహం, కుట్ర కేసులు కొత్తగాదు. ఎందరో రాజకీయ కార్యకర్తలు, రచయితలు, కవులు, కళాకారులు ఇలాంటి కేసుల్లో నిందితులయ్యారు. ఎలాంటి నేరం జరిగిందని భావించినా రాజద్రోహం, కుట్ర కేసులు పెట్టడం ప్రైవేటు వ్యక్తుల్లోనూ, పోలీసుల్లోనూ కూడా ఈమధ్యకాలంలో ఎక్కువైంది. నినాదాలైనా, ఉపన్యాసాలైనా వాటికవే కేసులు పెట్టడానికి ప్రాతిపదికలు కారాదని గతంలో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆ నినాదాలైనా, ఉపన్యాసాలైనా హింసను ప్రేరేపించాయని రుజువైనప్పుడు మాత్రమే ఆ నిబంధనలను వర్తింపజేయవచ్చునని తెలిపింది. వలసపాలకులు ఈ దేశంలో నిరసన గళాలను అణిచేయడం కోసం 1870లో తీసుకొచ్చిన ఈ చట్టాలు కొనసాగించడమే సిగ్గుచేటనుకుంటే వాటిని ఎడాపెడా ఉపయోగించడం అత్యంత దారుణం.
జేఎన్‌యూ ప్రాంగణంలో జరిగిన సభలో వినబడిన నినాదాలతో అందులో పాల్గొన్న వారందరికీ ఏకీభావం ఉందనుకోవడం అవగాహనా లేమి. ముఖ్యంగా కన్హయ్యకుమార్ సీపీఐ అనుబంధ సంస్థ ఏఐఎస్‌ఎఫ్‌కు చెందిన వ్యక్తి. ఆ పార్టీ సిద్ధాంతాలు తెలిసినవారెవరూ ఆ నినాదాలతో ఆయన ఏకీభవిస్తారనుకోరు. ఏ విశ్వవిద్యాలయమైనా భిన్నాభిప్రాయాలు సంఘర్షించే వేదికగా ఉండాలి. జేఎన్‌యూలో వివిధ రకాలైన వామపక్ష భావాలున్నవారు మాత్రమే కాదు... అంబేడ్కర్ సిద్ధాంతాలనూ, సంఘ్ పరివార్ సిద్ధాంతాలనూ బలపరిచేవారు కూడా ఉన్నారు. అక్కడ చదువుకుని ఉన్నతస్థాయికి ఎదిగినవారిలో ఎన్‌డీఏ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో పనిచేస్తున్నవారూ ఉన్నారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ కార్యదర్శి ఎస్. జయశంకర్, జాతీయ భద్రతా ఉప సలహాదారు అరవింద్ గుప్తా, ప్రధాని ప్రత్యేక దూత సయ్యద్ ఆసీఫ్ ఇబ్రహీం తదితరులు వారిలో కొందరు. జేఎన్‌యూ మేధోవాతావరణంపైనా, భిన్నాభిప్రాయాలపై అక్కడ జరిగే లోతైన చర్చలపైనా గతంలో వీరిలో పలువురు ప్రశంసాపూర్వకమైన వ్యాఖ్యలు చేశారు. ఇలా భిన్నభావాల సమాహారంగా వర్ధిల్లుతున్న జేఎన్‌యూపై ముద్రలువేసి దాన్ని అపఖ్యాతిపాలు చేయాలనుకోవడం ఒక అత్యున్నతశ్రేణి సంస్థకు అపచారం కలగజేయడమే అవుతుందన్న ఆలోచన లేకపోవడం విచారకరం.
రాజద్రోహం కేసు పెట్టడానికి గల కారణాన్ని చెబుతూ జేఎన్‌యూలో జరిగిన సభకు లష్కరే తొయిబా నాయకుడు హఫీజ్ సయీద్ మద్దతు ఉన్నదని వెల్లడించే ట్వీట్‌ను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చూపారు. కాసేపటికే ఆ ట్విటర్ హ్యాండిల్ నకిలీదని తేలింది. ఇలాంటి కారణాలు రాజద్రోహంవంటి కేసులకు ప్రాతిపదిక కావడం మన బలహీనతనే పట్టిచూపుతాయని వేరే చెప్పనవసరం లేదు. మరో వారంరోజుల్లో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న తరుణంలో ఈ మాదిరి ఘర్షణాత్మక వాతావరణం నెలకొనడం మంచిదికాదని, రాజకీయంగా అది ఆత్మహత్యాసదృశమవుతుందని ఎన్‌డీఏ పెద్దలు గుర్తించాలి.