కంపెనీలకు నిరసనల సెగ.. | Tech giant, startups in political crossfire with CAA-NRC | Sakshi
Sakshi News home page

కంపెనీలకు నిరసనల సెగ..

Published Tue, Jan 14 2020 2:43 AM | Last Updated on Tue, Jan 14 2020 4:55 AM

Tech giant, startups in political crossfire with CAA-NRC - Sakshi

న్యూఢిల్లీ: వివాదాస్పద అంశాలపై చెలరేగే నిరసనల్లో అప్పుడప్పుడు అనుకోని విధంగా కంపెనీలు కూడా ఇరుక్కుంటున్నాయి. దీంతో వ్యతిరేకత సెగ వాటికి కూడా గట్టిగానే తగులుతోంది. తాజాగా సీఏఏ–ఎన్‌ఆర్‌సీ అంశం, జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో విద్యార్థులపై దాడులు, ఆరెస్సెస్‌ కార్యక్రమాలు తదితర అంశాలపై బ్రాండ్‌ అంబాసిడర్లు, తమ సంస్థల చీఫ్‌ల వైఖరులు .. టెక్‌ కంపెనీలకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. పాలసీబజార్, జోహో, యాక్సెంచర్‌ వంటి సంస్థలు ఎవరో ఒకరి పక్షం వహించక తప్పని పరిస్థితుల్లో చిక్కుకుంటున్నాయి. దీంతో వ్యాపార అవకాశాలు కూడా కోల్పోయే సందర్భాలు ఎదురవుతున్నాయి.  

దీపిక బ్రాండ్‌పై జేఎన్‌యూ ఎఫెక్ట్‌..
వివాదాస్పద అంశాలపై బ్రాండ్‌ అంబాసిడర్లు వ్యవహరించే తీరు కంపెనీలకే కాకుండా.. స్వయంగా వారికి కూడా సమస్యలు తెచ్చిపెడుతోంది. ఆగంతకుల చేతిలో దెబ్బలు తిన్న జేఎన్‌యూ విద్యార్థులకు సంఘీభావంగా నిర్వహించిన ఓ నిరసన ప్రదర్శనకు బాలీవుడ్‌ స్టార్‌ దీపికా పదుకొణె కూడా హాజరు కావడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కొన్ని బ్రాండ్స్‌.. ఆమెతో రూపొందించిన పలు ప్రకటనలను ప్రచురించడం లేదా ప్రసారం చేయడాన్ని సాధ్యమైనంతగా తగ్గించాలని నిర్ణయించుకున్నాయి.

వివాదం సద్దుమణిగే దాకా ఓ రెండు వారాల పాటు ఆమె ప్రకటనలు ఆపేయాలంటూ తమ క్లయింట్‌ నుంచి సూచనలు వచ్చినట్లు ఓ మీడియా ఏజెన్సీ వెల్లడించింది. దేశీయంగా అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటీమణుల్లో పదుకొణె కూడా ఒకరు. ఒకో బ్రాండ్‌ ఎండార్స్‌మెంట్‌కు ఆమె రూ. 8 కోట్లు, సినిమాకు రూ. 10 కోట్ల పైగా తీసుకుంటారని టాక్‌.  ఆమె లోరియల్, తనిష్క్, యాక్సిస్‌ బ్యాంక్‌ తదితర 23 బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.  



పాలసీబజార్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌ కష్టం..
ఇక, కంపెనీలపరంగా చూస్తే.. ఆన్‌లైన్‌లో బీమా పథకాలు మొదలైనవి విక్రయించే పాలసీబజార్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌ కారణంగా కష్టం వచ్చిపడింది. ఈ సంస్థ రాజకీయంగా రెండు భిన్న వర్గాలకు చెందిన నటులైన అక్షయ్‌ కుమార్, మొహమ్మద్‌ జీషన్‌ అయూబ్‌లను తమ ప్రచారకర్తలుగా నియమించుకుంది. అయితే, జేఎన్‌యూ, షహీన్‌ బాగ్‌ తదితర నిరసన ప్రదర్శనలకు అయూబ్‌ బాహాటంగా మద్దతు పలకడం పాలసీబజార్‌ను చిక్కుల్లో పడేసింది. అయూబ్‌ వైఖరిని పాలసీబజార్‌ సమర్ధిస్తోందా అన్నది బీజేపీ నేతల ప్రశ్న. ఈ వివాదంతో  బాయ్‌కాట్‌పాలసీబజార్‌ హ్యాష్‌టాగ్‌ బాగా ట్రెండింగ్‌ అయ్యింది. అయితే, దీనిపై కంపెనీ ఎటువంటి వైఖరీ వెల్లడించలేదు.


ఆరెస్సెస్‌ వివాదంలో జోహో, యాక్సెంచర్‌..
ఫిబ్రవరి 2న జరగబోయే రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) కార్యక్రమం.. జోహో, యాక్సెంచర్‌ ఇండియాకు సమస్యలు తెచ్చిపెట్టింది. రెండు సంస్థల చీఫ్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొంటుండటమే ఇందుకు కారణం. చెన్నైలో జరిగే కార్యక్రమంలో పాల్గొనాలన్న తన నిర్ణయాన్ని జోహో సీఈవో శ్రీధర్‌ వెంబు సమర్ధించుకున్నారు. అయితే, దీన్ని వ్యతిరేకిస్తున్న నిఖిల్‌ పహ్వా, ఎ లదఖ్, సచిన్‌ టాండన్‌ వంటి çపలువురు యువ వ్యాపారవేత్తలు .. జోహోతో వ్యాపారానికి తెగదెంపులు చేసుకుంటామని స్పష్టం చేశారు. ‘మిగతా వారంతా బాయ్‌కాట్‌ చేయాలని నేనేమీ పిలుపునివ్వడం లేదు. అది ఎవరికి వారు నిర్ణయం తీసుకోవాల్సిన విషయం. కానీ ఆ కార్యక్రమంలో వెంబు పాలుపంచుకుంటున్నందున.. నేను మాత్రం జోహోతో వ్యాపార లావాదేవీలను ఆపేసే పరిస్థితిలో ఉన్నాను‘ అంటూ టాండన్‌ .. మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

మరోవైపు, యాక్సెంచర్‌ ఇండియా సీఈవో రామ ఎస్‌ రామచంద్రన్‌ తీరుపై సొంత సంస్థలోని ఉద్యోగుల నుంచే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.  యాక్సెంచర్‌ నైతిక నియమావళి ప్రకారం ప్రొఫెషనల్‌ హోదాలో ఉద్యోగులెవరూ ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లోనూ పాల్గొనరాదని కొందరు సిబ్బంది చెబుతున్నారు. తమ ఉద్యోగులు నిర్దిష్ట సిద్ధాంతాల పక్షం వహించడాన్ని యాక్సెంచర్‌ ఎంతవరకూ సమర్థిస్తుందన్న దానిపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి చర్యలు.. యాక్సెంచర్‌లోని మైనారిటీ సామాజిక వర్గాలకు చెందిన ఉద్యోగులకు ఎలాంటి సంకేతాలు పంపిస్తాయని ట్విట్టర్‌ యూజర్లు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ ఏకంగా యాక్సెంచర్‌ గ్లోబల్‌ సీఈవో జూలీ స్వీట్‌ను ట్యాగ్‌ చేస్తూ.. వారు పోస్ట్‌లు చేశారు.    

అయిదేళ్ల క్రితం స్నాప్‌డీల్‌ ఉదంతం..
కంపెనీలు ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు. 2015లో ఈకామర్స్‌ సంస్థ స్నాప్‌డీల్‌ కూడా ఇలాంటి సమస్యే ఎదుర్కొంది. అప్పట్లో ఆ సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న ఆమిర్‌ఖాన్‌.. దేశంలో నెలకొన్న పరిస్థితులను తనను భయాందోళనలకు గురిచేస్తున్నాయని వ్యాఖ్యానించడం స్నాప్‌డీల్‌కు చిక్కులు తెచ్చిపెట్టింది. ఆమిర్‌ఖాన్‌తో పాటు స్నాప్‌డీల్‌ను కూడా బాయ్‌కాట్‌ చేయాలంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఆ దెబ్బతో మళ్లీ ఆమిర్‌ఖాన్‌తో కాంట్రాక్టును స్నాప్‌డీల్‌ .. రెన్యూ చేసుకోలేదు. ఇటీవలే ఆన్‌లైన్‌ ఫుడ్‌ సర్వీసుల యాప్‌ జొమాటోకూ ఇలాంటి సమస్యే ఎదురైంది. హిందువేతర డెలివరీ బాయ్‌ని పంపించారనే కారణంతో ఓ యూజరు.. ఆర్డరును క్యాన్సిల్‌ చేశారు. అయితే, జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్‌ గోయల్‌.. తమ డెలివరీ బాయ్‌కు మద్దతిచ్చారు.

కొన్ని వివాదాలు..
నవంబర్, 2015: భారత్‌లో అభద్రతాభావం పెరిగిపోయిందంటూ బాలీవుడ్‌ నటుడు, స్నాప్‌డీల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ ఆమిర్‌ఖాన్‌ వ్యాఖ్యానించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో ఆయనతో స్నాప్‌డీల్‌ తెగదెంపులు చేసుకోక తప్పలేదు.
 
ఏప్రిల్, 2018: కథువా రేప్‌ బాధితురాలికి న్యాయం చేయాలంటూ సాగిన ఉద్యమంలో నటి స్వరభాస్కర్‌ వివాదాస్పద ట్వీట్స్‌ చేశారు. దీంతో ఈకామర్స్‌ సంస్థ అమెజాన్‌.. ఆమెను బ్రాండ్‌
అంబాసిడర్‌గా తప్పించింది.
 
ఏప్రిల్, 2018: డ్రైవర్‌ ముస్లిం అనే కారణంతో వీహెచ్‌పీ కార్యకర్త ఒకరు.. ఓలా ట్యాక్సీ రైడ్‌ను రద్దు చేసుకున్నారు. తాము మతసామరస్యానికి ప్రాధాన్యమిస్తామంటూ ఓలా సంస్థ .. సదరు డ్రైవరు పక్షాన నిల్చింది.
 
జూలై, 2019: ముస్లిం డెలివరీ బాయ్‌ వచ్చారనే కారణంతో జొమాటోలో చేసిన ఆర్డరును ఒక యూజరు క్యాన్సిల్‌ చేశారు. జొమాటో, దాని వ్యవస్థాపకుడు దీపిందర్‌ గోయల్‌ .. డెలివరీ బాయ్‌ పక్షాన నిల్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement