తమిళనాట కొత్త ఏలిక | Editorial on tamilnadu politics and new cm Edappadi K. Palanisamy | Sakshi
Sakshi News home page

తమిళనాట కొత్త ఏలిక

Published Fri, Feb 17 2017 12:14 AM | Last Updated on Tue, Sep 5 2017 3:53 AM

తమిళనాట కొత్త ఏలిక

తమిళనాట కొత్త ఏలిక

పదిరోజులుగా తమిళనాడులో ఎడతెగకుండా కొనసాగుతున్న రాజకీయ డ్రామాకు ఎట్టకేలకు కాస్తంత విరామం చిక్కింది. వీకే శశికళ స్థానంలో అన్నా డీఎంకే లెజిస్లేచర్‌ పార్టీ నాయకుడిగా ఎన్నికైన పళనిస్వామికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వడం ద్వారా గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగరరావు ఆలస్యంగానైనా సరైన నిర్ణయం తీసుకున్నారు. బలనిరూపణ కోసం గవర్నర్‌ పక్షం రోజుల వ్యవధినిచ్చినా ఈ శనివారమే పళనిస్వామి అందుకు సిద్ధపడుతున్నారు. బహుశా సాధ్యమైనంత త్వరలో ఈ సంక్షోభాన్ని అధిగమించాలని పళనిస్వామి అను కుంటున్నారేమో. అయితే అదంత సులభమేమీ కాదు. ఒకవేళ ఈ గండం గట్టెక్కినా ఆయన పదవి పదిలం అనుకోవడానికి లేదు. సంక్షోభం సమసిపోతుంద నుకోవడానికి లేదు. నిజానికి ఈ క్షణం నుంచి అది మరింత తీవ్రమవుతుంది.

స్వీయ పదవీ పరిరక్షణ కార్యక్రమంలో ఆయన ఇక నిరంతరం నిమగ్నం కావాల్సివస్తుంది. ఎందుకంటే పట్టుమని 15మంది ఎమ్మెల్యేలు ప్రధాన విపక్షమైన డీఎంకేకు లేదా పన్నీర్‌సెల్వం పక్షానికి ఫిరాయిస్తే ప్రభుత్వం పేకమేడలా కూలి పోతుంది. ఈ గొడవలో ఆయన పాలనపై దృష్టి కేంద్రీకరించగలరా అన్నది అనుమానమే. ఫిర్యాదులొచ్చినప్పుడు పార్టీలోని వైరి పక్షాలను పిలిచి నయానో, భయానో రాజీ కుదర్చడం... అందరూ సమైక్యంగా పనిచేసేలా చూడటం నాయ కత్వ స్థానంలో ఉన్నవారు చేసే పని. అధికారంలో ఉన్నారా, విపక్షంలో ఉన్నారా అన్న అంశంతో సంబంధం లేకుండా సమర్థులైన నేతలకు అది సాధ్యమవుతుంది. ప్రభుత్వానికి సారథ్యం వహించడం పళనిస్వామికి కొత్త. అటు శశికళకు పార్టీ నాయకత్వం మాత్రమే కాదు... పార్టీలో క్రియాశీలంగా పనిచేయడమే కొత్త. ఈలోగా ఆమెకు జైలు శిక్ష పడింది. ఈ నేపథ్యంలో ఆమె నియమించి వెళ్లిన నాయకత్వం సత్తా చాటగలదా? పార్టీలో అసంతృప్తులను బుజ్జగించగలదా? శశికళ కర్ణాటక జైలు నుంచి రిమోట్‌ కంట్రోల్‌తో పార్టీని నియంత్రించగలరా? తాను నియ మించిన నాయకులకు అండగా నిలబడగలరా?

పార్టీని ఏకతాటిపై నడపగల బలమైన నాయకత్వం ఇప్పుడు అన్నా డీఎంకేకు లేదు. ఆ పార్టీ నాయకత్వ సంక్షోభంలో చిక్కుకుంది. పార్టీని తన కనుసైగలతో శాసించిన జయలలిత కనీసం కొందరినైనా విశ్వాసంలోకి తీసుకుని ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని రూపొందించి ఉంటే ఈ దుస్థితి ఏర్పడేది కాదు. అభద్రతాభావమో, తన తదనంతరం పార్టీ ఏమైతే తనకేమిటన్న నిర్లిప్తతో... ఆమె అలాంటి ప్రయ త్నానికి పూనుకోలేదు. కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ మొగ్గు మొదటినుంచీ పన్నీర్‌ సెల్వంవైపే ఉందని స్పష్టంగా కనబడుతూనే ఉంది. అలాంటి మొగ్గు లేకపోయి ఉంటే, తన పాత్ర తటస్థమైనదేనని బీజేపీ చెబుతున్న మాట నిజమైతే పన్నీర్‌ స్థానంలో లెజిస్లేచర్‌ పార్టీ నేతగా ఎన్నికైన శశికళకు వెనువెంటనే ముఖ్యమంత్రి పీఠం దక్కేది.

రెండురోజులైన తర్వాతే పన్నీర్‌ తిరగబడ్డారని, తనను బెదిరించి రాజీనామా లేఖ తీసుకున్నారన్న ఆరోపణ చేశారని గుర్తుంచుకోవాలి. ఆ రెండు రోజులూ ఎందుకు వేచిచూడాల్సి వచ్చిందన్న అంశంలో గవర్నర్‌నుంచి ఇప్పటికీ స్పష్టత లేదు. త్వరలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనున్నది గనుకే ఆయన ఆ వ్యవధి తీసుకున్నారన్న వాదనలో పసలేదు. వివిధ కేసుల్లో విచారణ జరగకుండా స్టే తెచ్చుకున్న సీఎంలు, విచారణ సాగుతున్నా ఆ పదవిని వదలని సీఎంలు దేశంలో చాలామందే ఉన్నారు. తమిళనాడుకే ఎందుకీ మినహాయింపు? ఈ సంక్షోభం నుంచి లబ్ధిపొందాలన్న ప్రయత్నం వల్లనే ఇదంతా జరిగిందన్న కథనాలకు బీజేపీ నుంచి సంతృప్తికరమైన సంజాయిషీ లేదు.

పన్నీర్‌సెల్వం పార్టీలో అందరి విశ్వాసాన్ని చూరగొని ఉంటే జయలలిత సమాధి వద్ద ధ్యానంలో నిమగ్నమైన క్షణంలోనే ఎమ్మెల్యేలంతా ఆయనవైపు క్యూ కట్టేవారు. కేంద్రంనుంచి అండదండలున్నా, తానే జయ అసలు సిసలు వార సుడినని ఎంతగా చెప్పుకున్నా శశికళ శిబిరం నుంచి నలుగురైదుగురు మాత్రమే పన్నీర్‌ శిబిరానికి ఫిరాయించారు. ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు తీర్పు, శశికళ స్థానంలో పళనిస్వామి ఎన్నిక తర్వాత దీన్నుంచి మర్యాదగా బయటపడటానికి ఇదే అదునని కేంద్రం భావించింది. పన్నీర్‌ను పట్టుకోవడంవల్ల ఒరిగేదేమీ ఉండదని నిర్ణయించుకుంది. అందుకే తాజా పరిణామం సాధ్యపడిందన్నది వాస్తవం. పన్నీర్‌కు మెతక మనిషిగా, బోళా శంకరుడిగా పేరుంది. సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం, అమలు చేయడం వంటివి ఆయనకు తెలియని విద్యలు. ఎవరో చెప్పడంవల్లనో లేదా తాను అంటున్నట్టు జయ ఆత్మ ఆదేశించడంవల్లనో తిరు గుబాటు చేసినంత మాత్రాన ఆ లక్షణాలు ఇప్పటికిప్పుడు పరుగెత్తుకు రావడం కల్ల. అందుకే చేతిలో అధికార దండం ఉన్నా... నిత్యం అమ్మ నామమే జపిస్తున్నా శశికళ శిబిరంనుంచి ఎవరినీ రప్పించలేక ఆయన నిస్సహాయంగా మిగిలిపోయారు. ఇటు కొత్త సీఎం పళనిస్వామి కూడా ఆయనకు డిటో. తన ఆప్తులుగా జయలలిత భావించిన అయిదుగురిలో పన్నీర్‌ తర్వాత స్థానం పళనిదే.

ఇద్దరు మెతక మనుషులు వైరి పక్షాల నేతలుగా మోహరించి ఉంటే సమరం ఎలా సాగుతుందో... జయం ఎవరిని వరిస్తుందో చెప్పడం కష్టమే. పళనిస్వామి తన మెతకదనం తగ్గించుకుని శశికళ ఆదేశాల మేరకు కేంద్రంతో ఘర్షణ వైఖరికి దిగాలని నిర్ణయించుకుంటే సహజంగానే పన్నీర్‌ సెల్వంకు అటువైపునుంచి అందుతున్న సహకారం మరింత పెరుగుతుంది. చివరికది రాష్ట్రపతి పాలనవైపు దారితీసినా ఆశ్చర్యం లేదు. ఎలా చూసినా అన్నా డీఎంకే స్థితి ఇప్పుడు గాల్లో దీపం వంటిది. సాధారణ ప్రజలంతా పన్నీర్‌ వైపే ఉన్నారంటున్నా... ప్రముఖ సినీ నటులు సైతం ఆయనకే మద్దతిస్తున్నా శశికళ శిబిరం ఎమ్మెల్యేల్లో కదలిక లేదు. ఉప ఎన్నికలొచ్చి ఎవరి బలమెంతో నిర్ధారణయ్యేవరకూ వారిలో చాలామంది ఉన్నచోటే ఉంటారు. పదవుల కోసం పోటీ ముదిరితే అంతకుముందే ఏమైనా జరగొచ్చు. ఏదేమైనా ప్రజలకు మెరుగైన పాలన అందాలని, రాష్ట్రంలో సుస్థిరత ఏర్పడాలని ఆశిద్దాం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement