యూ టర్న్ తీసుకున్న దినకరన్
చెన్నై: తమిళనాడులో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ తన స్వరం మార్చారు. పార్టీపై తన పట్టును నిరూపించుకునేందుకు ప్రయత్నాలు చేసిన ఆయన ఎట్టకేలకు వెనక్కి తగ్గారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, అలాగే పార్టీ ఆదేశాలను ధిక్కరించనని దినకరన్ స్పష్టం చేశారు. దినకరన్‌ను, ఆయన కుటుంబాన్ని పార్టీకి, ప్రభుత్వానికి దూరంగా ఉంచాలని పళనిస్వామి మంత్రివర్గం మంగళవారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో దినకరన్ మాట్లాడుతూ తనను పక్కన పెట్టినా బాధపడటం లేదన్నారు. అయితే పార్టీ ఒక్కటిగా ఉండాలని తాను కోరుకుంటున్నానని, పార్టీ, ప్రభుత్వానికి దూరంగా ఉంటానని ఆయన తెలిపారు. తాను ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడలేదని తెలిపారు. పార్టీకి మేలు చేసే నిర్ణయాలకు సహకరిస్తానన్నారు. పార్టీలో అందరూ తనకు సోదరులేనని అన్నారు. పన్నీర్ సెల్వం, పళనిస్వామి కలయికను తాను వ్యతిరేకించనని దినకరన్ అన్నారు. తనవల్ల పార్టీ బలహీనపడటం తనకు ఇష్టం లేదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని, నిన్నటి నుంచి తాను పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.
కాగా ఫెరా కేసు విచారణ నిమిత‍్తం దినకరన్ ఈరోజు ఎగ్మూరు కోర్టుకు హాజరు కాగా, విచారణ మధ్యాహ్నానికి వాయిదా పడింది. మరోవైపు రెండాకుల గుర్తును సొంతం చేసుకునేందుకు దినకరన్...మధ్యవర్తి ద్వారా ఈసీకి లంచం ఇవ్వచూపి, అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే. ఓవైపు కేసులు, మరోవైపు పార్టీలో అసంతృప్తి నేపథ్యంలో దినకరన్ యు టర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది.