‘టాటా’ సునామీ! | Editorial on tata company chairman Cyrus Mistry resign issue | Sakshi
Sakshi News home page

‘టాటా’ సునామీ!

Published Wed, Oct 26 2016 12:46 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

‘టాటా’ సునామీ! - Sakshi

‘టాటా’ సునామీ!

ఉప్పు నుంచి విమానం విడిభాగాల వరకూ సకల రంగాల్లోనూ తనదైన ముద్ర వేస్తూ వెలుగులీనుతున్న కార్పొరేట్‌ దిగ్గజం టాటా గ్రూపులో అకస్మాత్తుగా తలెత్తిన పెను సంక్షోభం సహజంగానే అందరినీ విస్మయానికి గురిచేసింది. సోమవారం జరిగిన టాటా సన్స్‌ బోర్డు సమావేశం ఉన్నట్టుండి సంస్థ చైర్మన్‌ సైరస్‌ పల్లోంజీ మిస్త్రీని తొలగించి, ఆ స్థానంలో తాత్కాలికంగా తిరిగి రతన్‌ టాటాను రప్పించడం ఎవరూ ఊహించని పరిణామం. ఆ పదవికి సమర్థత గల మరొకరిని ఎంపిక చేయడం కోసం సెర్చ్‌ కమిటీ కూడా ఏర్పాటైంది. సైరస్‌ న్యాయస్థానాలను ఆశ్రయించగలరన్న అంచనాతో సుప్రీంకోర్టునుంచి వివిధ కోర్టుల వరకూ టాటా గ్రూపు కేవియట్‌ పిటిషన్లు దాఖలు చేసింది. అంతేకాదు... తన నిర్ణయాలకు సమర్ధనగా సీనియర్‌ న్యాయవాదులతో వివిధ చానెళ్లలో మాట్లాడించింది. అయితే సైరస్‌గానీ, ఆయన తరఫున మరొకరు గానీ మీడియా ముందుకు రాలేదు.

సైరస్‌ చైర్మన్‌ అయ్యాక ఆయన కుటుంబానికి చెందిన షాపోర్‌జీ పల్లోంజీ సంస్థకు టాటాలో కొత్తగా ఎలాంటి కాంట్రాక్టులూ ఇవ్వలేదని, కనుక ఆయన వైపునుంచి ‘పరస్పర విరుద్ధ ప్రయోజనాల’ను నెరవేర్చుకోవడమన్న ప్రసక్తే తలెత్తదన్న వివరణ మాత్రం సైరస్‌ కార్యాలయంనుంచి వెలువడింది. 150 ఏళ్ల టాటా మహా సామ్రాజ్యంలో ఇలాంటి పరిణామం కనీవినీ ఎరుగనిది. ఆ మాటకొస్తే టాటా వంటి సంస్థకు బయటి వ్యక్తి సారథ్యంవహించడాన్ని సైతం ఎవరూ ఊహించలేదు. అందుకే 2011లో సైరస్‌ను రతన్‌ టాటా తన వారసుడిగా ప్రకటించినప్పుడూ అందరూ ఆశ్చర్యపోయారు. అలాగని ఆయన పూర్తిగా బయటి వ్యక్తేమీ కాదు. డైరె క్టర్‌గా సంస్థలో అంతకు చాలాముందునుంచీ పనిచేస్తున్నారు. రతన్‌ వారసుడి అన్వేషణకు అయిదేళ్లక్రితం అయిదుగురు సభ్యుల ఎంపిక కమిటీని ఏర్పాటు చేసినప్పుడు ఆ కమిటీలో సైరస్‌ కూడా సభ్యుడే. చైర్మన్‌ పదవికి అర్హులైనవారి కోసం ఆ కమిటీ 15 నెలలు గాలించింది. ఆ ప్రక్రియ కొనసాగుతుండగానే సైరస్‌ దాన్నుంచి వైదొలగి తాను కూడా ఒక పోటీదారయ్యారు. కమిటీ ఏకగ్రీవంగా తీసు కున్న తుది నిర్ణయం సంగతలా ఉంచి, రతన్‌కి ఇష్టం లేకుండా ఇదంతా జరిగిందని ఎవరూ అనుకోలేరు.  

రతన్‌ 1991లో సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాక 21 ఏళ్లపాటు ఆ పదవిలో కొనసాగి తనదైన ముద్ర వేశారు. 2005లో ఆంగ్లో–డచ్‌ ఉక్కు కంపెనీ కోరస్‌ను కొనుగోలు చేయడం, మరో బహుళజాతి లగ్జరీ కార్ల సంస్థ జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ను 2008లో సొంతం చేసుకోవడం, బ్రిటన్‌కు చెందిన టెట్లీ టీ సంస్థను చేజిక్కించుకోవడం వంటి సంచలన నిర్ణయాలతో సంస్థకు ఆయన అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొచ్చారు. అది మదుపుదారుల్లోనూ, వినియోగదారు ల్లోనూ సంస్థ మీదున్న విశ్వాసాన్ని మరింతగా పెంచింది.  రతన్‌ టాటా దూకుడు ఒక్కటే కాదు...అప్పటి మార్కెట్‌ పరిస్థితులు కూడా అందుకు అనుకూలించాయి. ఈ నేపథ్యంలో దాన్ని నిలబెట్టడం సైరస్‌కే కాదు ఎవరికైనా పెను సవాలే. ఆయన దాన్ని సరైన స్ఫూర్తితో స్వీకరించి విజయం సాధించగలిగారా? అందుకు ఏదో ఒక జవాబునే చెప్పడం కష్టం. సైరస్‌ పదవి చేపట్టేనాటికి నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలుగా ఉన్న టాటా గ్రూపు విలువ ఇప్పుడు దాదాపు రెట్టింపైంది. ఇలాంటి పరిస్థితుల్లో సైరస్‌ విఫలమయ్యారని చెబితే అది అసత్యమవుతుంది. అదే సమయంలో గ్రూపులోని వివిధ సంస్థల పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు.

రతన్‌ టాటా హయాంలో విజయవంతమైనవిగా కనబడిన నిర్ణయాల్లోనే పెను ప్రమాదాలు పొంచి ఉన్నాయని అనంతరకాలంలో నిరూపణ అయింది. టాటా సంస్థల అప్పు 10 రెట్లు పెరిగింది. టాటా మోటార్స్‌ ఒక్కటే గత ఆర్ధిక సంవత్సరం అమ్మకాల్లో ప్రగతి సాధించింది. అది నమోదు చేసిన 5 శాతం వృద్ధిలో సింహభాగం జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌ నికరమైన పనితీరు వల్లే సాధ్యమైంది. ఐటీ దిగ్గజం టీసీఎస్‌ ఆదాయంలో  నిరుడు 7.1 శాతం వృద్ధి కనబడినా మొన్న జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో నమోదైన 3.4 శాతం వృద్ధి... అంతకు ముందు సంవ త్సరాల్లో ఇదే సమయానికి ఉన్న వృద్ధితో పోలిస్తే చాలా తక్కువ. పైగా గ్రూప్‌లో ఎప్పుడూ రెండో స్థానంలో ఉండే టాటా స్టీల్‌ అమ్మకాలు 16 శాతం మేర పడి పోయాయి. దాని అనుబంధ సంస్థ టాటా స్టీల్‌ యూరప్‌ భారీ నష్టాలు చవి చూస్తున్నదన్న కారణంతో సైరస్‌ అమ్మకానికి పెట్టారు. ఈ నిర్ణయాన్ని ఆర్ధిక నిపు ణులంతా ప్రశంసించారుగానీ... దాన్ని కొనే నాథుడే లేకుండా పోయాడు.

వీటన్నిటికీ కేవలం సైరస్‌నే బాధ్యుణ్ణి చేయడం న్యాయం కాదు. యూరప్‌ లోనూ, ప్రత్యేకించి బ్రిటన్‌లోనూ నెలకొన్న ఆర్ధిక అనిశ్చితి, ఐటీ రంగ సంక్షోభం లాంటివి కూడా అందుకు దోహదపడ్డాయి. పైగా అనేక వివాదాలు సంస్థను చుట్టు ముట్టాయి. వాటి విషయంలో తీసుకున్న నిర్ణయాలు టాటా గ్రూప్‌ పేరుప్రతిష్టల్ని దెబ్బతీశాయన్న భావం ఏర్పడింది. జపాన్‌కు చెందిన డొకోమోతో తెగదెంపులు, తమకు 120 కోట్ల డాలర్లు చెల్లించాలన్న ఆ సంస్థ వ్యాజ్యం, టీసీఎస్‌ సంస్థపై వచ్చిన వ్యాజ్యంలో వంద కోట్ల డాలర్ల పరిహారం చెల్లించాలన్న కోర్టు ఆదేశాలు, యూపీలోని యూరియా ప్లాంట్‌ విక్రయం, ఇండొనేసియా బొగ్గు గని సంస్థలో 30శాతం వాటా అమ్మకం వగైరాలు టాటా గ్రూప్‌ పనితీరుపై సందేహాలు తీసు కొచ్చాయి.

సంస్థను పటిష్టం చేయడానికి ఆయన వద్దనున్న వ్యూహాలేమిటన్నది ఎవరికీ అంతుపట్టలేదు. తనను అన్యాయంగా తొలగించారని, కనీసం నోటీసు కూడా ఇవ్వలేదని సైరస్‌ అన్నట్టు వార్తలొచ్చాయి. సైరస్‌ తీరు సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా లేదని అంటున్నవారు ఈ చర్యలోని సహేతుకతపై కూడా వివరణ నివ్వాల్సి ఉంటుంది. ఇందులో చట్టవిరుద్ధత ఏమీ లేదన్నది ముందూ మునుపూ కోర్టులో తేలితే తేలొచ్చు. కానీ ఆ పదవికి పోటీపడేవారిపై ఇది చూపగల ప్రభావం తక్కువేమీ కాదు. కార్పొరేట్‌ యుద్ధాలు ఎంత వేగంతో ప్రారంభమై విస్మయ పరుస్తాయో, అంతే త్వరగా చప్పున చల్లారి వింత గొలుపుతాయి. ఈ వివాదం సైతం న్యాయస్థానాల వరకూ పోకుండా సామరస్యపూర్వకంగా పరిష్కారమైతే అది అందరికీ మంచిది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement