Cyrus Pallonji Mistry
-
టాటాపై వార్.. మిస్త్రీకి షాక్!
ముంబై: ‘టాటా సన్స్’, దాని అధిపతి రతన్ టాటాలకు వ్యతిరేకంగా ఒంటరి పోరాటం చేసిన సైరస్ పల్లోంజి మిస్త్రీకి ఎన్సీఎల్టీ ముందు ఓటమి ఎదురైంది. కార్పొరేట్ గవర్నెన్స్‌కు సంబంధించిన ఈ కేసులో టాటాల మాటే చెల్లుబాటైంది. టాటా సన్స్ (టాటా గ్రూపు) చైర్మన్‌గా 2016 అక్టోబర్‌లో తనను తప్పించడాన్ని సవాల్ చేస్తూ మిస్త్రీ దాఖలు చేసిన పిటిషన్‌ను జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) సోమవారం కొట్టివేసింది. ముంబైలోని ఎన్సీఎల్టీ స్పెషల్ బెంచ్ టాటా గ్రూపు వాదనలకే ఓటేసింది. ‘‘ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్‌ను తొలగించే అధికారం టాటా సన్స్ బోర్డు డైరెక్టర్లకు ఉంటుంది. బోర్డులో అత్యధికులు మిస్త్రీపై నమ్మకం కోల్పోవడంతోనే ఆయన్ను తొలగించారు. అంతేకానీ, రతన్టాటాకో, సూనవాలాకో అసౌకర్యం కలిగించినందుకు కాదు. టాటా సంస్థలకు సంబంధించిన కీలక సమచారాన్ని మిస్త్రీ ఆదాయపన్ను విభాగానికి పంపించారు. సమాచారాన్ని ప్రెస్‌కు లీక్ చేశారు. ఆ తర్వాత కంపెనీ, బోర్డు సభ్యులకు వ్యతిరేకంగా ప్రజల ముందుకు వచ్చారు. అందుకే బోర్డు ఆయన్ను డైరెక్టర్‌గా తొలగించింది’’ అని బెంచ్ తన తీర్పులో వివరించింది. మిస్త్రీ వాదనలు తిరస్కరణ ‘‘రతన్‌టాటా, సూనవాలా జోక్యం చేసుకున్నారని లేదా వారి ప్రవర్తన కంపెనీ ప్రయోజనాల పట్ల పక్షపాతంగా ఉందన్న వాదనల్లో వాస్తవం లేదని గుర్తించాం. ఈ నేపథ్యంలో మిస్త్రీ తొలగింపుపై కంపెనీల చట్టంలోని సెక్షన్ 241 కింద చర్యలకు అవకాశం లేదు’’ అని ఎన్సీఎల్టీ బెంచ్ తన తీర్పులో స్పష్టం చేసింది. టాటా సన్స్ బోర్డు, రతన్‌టాటా తప్పుడు విధానాలు, మైనారిటీ షేర్హోల్డర్లను అణచివేస్తున్నారంటూ సైరస్ మిస్త్రీ తన పిటిషన్లో పేర్కొన్న ఆరోపణలను ఎన్సీఎల్టీ తిరస్కరించింది. ఎయిర్ఏషియా, నానోకు సంబంధించిన వ్యవహారాలు, కార్పొరేట్ పరిపాలన ఉల్లంఘనల విషయంలోనూ మిస్త్రీ ఆరోపణలను తోసిపుచ్చింది. మిస్త్రీ ఆరోపణలకు ఏ మాత్రం యోగ్యత లేదని ఎన్సీఎల్టీ స్పష్టం చేస్తూ, కంపెనీల చట్టం 2013కు అనుగుణంగానే టాటా సన్స్ బోర్డు వ్యవహరించిందని తేల్చి చెప్పింది. ఇవీ... కేసు పూర్వాపరాలు ♦ 2012లో టాటా సన్స్‌కు ఆరో చైర్మన్‌గా వచ్చిన సైరస్ మిస్త్రీని అనూహ్యంగా ఆ పదవి నుంచి తప్పిస్తూ బోర్డు 2016 అక్టోబర్ 24న నిర్ణయాన్ని ప్రకటించింది. ♦ 016 డిసెంబర్ 20న మిస్త్రీ తన కుటుంబ కంపెనీలైన సైరస్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేటు లిమిటెడ్, స్టెర్లింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్ప్ తరఫున టాటా సన్స్, రతన్ టాటా, ఇతర బోర్డు సభ్యులకు వ్యతిరేకంగా ఎన్సీఎల్టీలో పిటిషన్లు వేశారు. ♦ చైర్మన్‌గా తన తొలగింపు కంపెనీల చట్ట ప్రకారం లేదని, టాటా సన్స్‌లో పాలన దుర్వినియోగం జరుగుతోందని మిస్త్రీ ప్రధానంగా వాదించారు. రతన్ టాటాతోపాటు మరో టాటా ట్రస్ట్రీ అయిన సూనవాలా గ్రూపు వ్యవహారాల్లో తరచుగా జోక్యం చేసుకుంటూ షాడో డైరెక్టర్లుగా వ్యవహరించారని ఆరోపించారు. ♦ 2017 ఫిబ్రవరి 6న టాటా సన్స్ బోర్డు డైరెక్టర్‌గానూ మిస్త్రీ తొలగింపునకు గురయ్యారు. ♦ మిస్త్రీ వాదనల్లో వాస్తవం లేదని, ఆయన తొలగింపు చట్ట ప్రకారమే జరిగిందని తాజాగా ఎన్సీఎల్టీ స్పష్టం చేసింది. ♦ టాటా సన్స్‌లో షాపూర్జీ పల్లోంజీ మిస్త్రీ కుటుంబానికి 18.34 శాతం వాటా ఉంది. పోరు బాటే: మిస్త్రీ ఎన్సీఎల్టీ తీర్పు నిరాశపరిచిందని, అంతేకానీ ఆశ్చర్యపరచలేదని మిస్త్రీ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ‘‘ఉత్తమ పాలన కోసం, టాటా సన్స్‌లో మెజారిటీ పేరిట జరుగుతున్న ఉద్దేశపూర్వక దౌర్జన్య పాలన నుంచి మైనారిటీ వాటాదారుల ప్రయోజనాల్ని రక్షించడానికి పోరాటం కొనసాగుతుంది’’ అని పేర్కొంది. ఈ ప్రయాణంలో ఎంత కష్టమైనా ఇబ్బంది లేదని, టాటా గ్రూపును వినాశకారుల నుంచి రక్షించడమే తమ బాధ్యతని మిస్త్రీ పేర్కొన్నారు. స్వాగతించిన రతన్ టాటా ఎన్సీఎల్టీ తీర్పును టాటా గ్రూపు గౌరవ చైర్మన్ రతన్‌టాటా స్వాగతించారు. 2016 అక్టోబర్‌లో టాటా సన్స్ తీసుకున్న నిర్ణయం న్యాయసమ్మతమేనని ఎన్సీఎల్టీ స్పష్టం చేసిందన్నారు. మన న్యాయవ్యవస్థలోని బలాన్ని, సూత్రాలను ఈ తీర్పు ప్రతిఫలించిందని, దేశం పట్ల మనం గర్వపడేలా చేసిందని వ్యాఖ్యానించారు. టాటా గ్రూపు చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ స్పందిస్తూ... టాటా సన్స్, దాని పరిధిలోని ఆపరేటింగ్ కంపెనీలు పారదర్శకంగా, వాటాదారుల ఉత్తమ ప్రయోజనాల కోణంలో వ్యవహరించాయని ఎన్సీఎల్టీ తీర్పు ధ్రువీకరించిందన్నారు. బోర్డు రూమ్ యుద్ధాలు.. న్యూఢిల్లీ: టాటా గ్రూప్, సైరస్ మిస్త్రీల మధ్య వివాదంతో కంపెనీలపై ఆధిపత్యం కోసం బోర్డు రూమ్ వేదికగా జరిగే వ్యూహాలు, యుద్ధాలు మరోసారి తెరపైకి వచ్చాయి. టాటా గ్రూప్ అధినేత రతన్ టాటా కూడా స్వయంగా ఇలాంటివి ఎదుర్కొన్నారు. 1990లలో గ్రూప్ పగ్గాలు చేతికొచ్చినప్పుడు అప్పటికే స్థిరపడిపోయిన దిగ్గజాలు రూసీ మోదీ, దర్బారీ సేఠ్, అజిత్ కేర్కర్, ఏహెచ్ టొబాకోవాలా వంటి హేమా హేమీలను రతన్ టాటా ఎదుర్కొని నిలవాల్సి వచ్చింది. రిలయన్స్ నుంచి ఇన్ఫోసిస్ దాకా పలు దిగ్గజ సంస్థల్లోనూ ఇలాంటి బోర్డు రూమ్ యుద్ధాలు చోటుచేసుకున్నాయి. అంబానీ వర్సెస్ అంబానీ.. రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ మరణానంతరం 2002లో ఆయన ఇద్దరు కుమారులు ముకేశ్, అనిల్ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. గ్రూప్ యాజమాన్య అం శంపై విభేదాలు ఉన్న మాట వాస్తవమేనంటూ పెద్ద కుమారుడు ముకేశ్ 2004 నవంబర్‌లో ఒక టీవీ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అంగీకరించడం వీటికి ఊతమిచ్చింది. ఆ తర్వాత మీడియా మాధ్యమంగా ఇరు వర్గాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల యుద్ధం జరిగింది. చివరికి 2005 జూన్‌లో గ్రూప్ అసెట్స్ విభజన ద్వారా సోదరులిద్దరూ సెటిల్మెంట్ చేసుకున్నారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు వర్సెస్ బోర్డు దేశీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ గతేడాది వివాదాల్లో చిక్కుకుంది. కార్పొరేట్ గవర్నెన్స్ లోపించిందంటూ సంస్థ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి, నీలేకని, క్రిస్ గోపాలకృష్ణన్‌లు ఆందోళన వ్యక్తం చేయడంతో బోర్డుకు, వ్యవస్థాపకులకు మధ్య వార్ మొదలైంది. మాజీ ఉద్యోగులు రాజీవ్ బన్సల్, డేవిడ్ కెనెడీలకు భారీ వీడ్కోలు ప్యాకేజీనివ్వడం, అప్పటి సీఈవో విశాల్ సిక్కాకు భారీగా జీతభత్యాలు పెంచడం, పనయా సంస్థ కొనుగోలుపై వ్యవస్థాపకులు ప్రశ్నలు లేవనెత్తారు. చివరికి సిక్కా గతేడాది ఆగస్టులో రాజీనామా చేశారు. యస్ బ్యాంక్: కపూర్ వర్సెస్ కపూర్ 2008 ముంబై టెర్రరిస్టు దాడుల్లో బ్యాంకు సహ వ్యవస్థాపకుడు అశోక్ కపూర్ మరణించారు. ఆ తర్వాత కంపెనీ బోర్డులో డైరెక్టర్ నియామకం విషయంలో అశోక్ కపూర్ కుటుంబం, మరో సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్ కుటుంబాల మధ్య వివాదం తలెత్తింది. అశోక్ సతీమణి మధు కపూర్.. తమ కుమార్తె షగున్ కపూర్ గోగియాను డైరెక్టర్‌గా నియమించాలనుకున్నారు. కానీ యస్ బ్యాంక్ బోర్డు దీన్ని తిరస్కరించింది. సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత 2015 జూన్‌లో మధు కపూర్ కుటుంబానికి అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. -
‘టాటా’ సునామీ!
ఉప్పు నుంచి విమానం విడిభాగాల వరకూ సకల రంగాల్లోనూ తనదైన ముద్ర వేస్తూ వెలుగులీనుతున్న కార్పొరేట్ దిగ్గజం టాటా గ్రూపులో అకస్మాత్తుగా తలెత్తిన పెను సంక్షోభం సహజంగానే అందరినీ విస్మయానికి గురిచేసింది. సోమవారం జరిగిన టాటా సన్స్ బోర్డు సమావేశం ఉన్నట్టుండి సంస్థ చైర్మన్ సైరస్ పల్లోంజీ మిస్త్రీని తొలగించి, ఆ స్థానంలో తాత్కాలికంగా తిరిగి రతన్ టాటాను రప్పించడం ఎవరూ ఊహించని పరిణామం. ఆ పదవికి సమర్థత గల మరొకరిని ఎంపిక చేయడం కోసం సెర్చ్ కమిటీ కూడా ఏర్పాటైంది. సైరస్ న్యాయస్థానాలను ఆశ్రయించగలరన్న అంచనాతో సుప్రీంకోర్టునుంచి వివిధ కోర్టుల వరకూ టాటా గ్రూపు కేవియట్ పిటిషన్లు దాఖలు చేసింది. అంతేకాదు... తన నిర్ణయాలకు సమర్ధనగా సీనియర్ న్యాయవాదులతో వివిధ చానెళ్లలో మాట్లాడించింది. అయితే సైరస్గానీ, ఆయన తరఫున మరొకరు గానీ మీడియా ముందుకు రాలేదు. సైరస్ చైర్మన్ అయ్యాక ఆయన కుటుంబానికి చెందిన షాపోర్జీ పల్లోంజీ సంస్థకు టాటాలో కొత్తగా ఎలాంటి కాంట్రాక్టులూ ఇవ్వలేదని, కనుక ఆయన వైపునుంచి ‘పరస్పర విరుద్ధ ప్రయోజనాల’ను నెరవేర్చుకోవడమన్న ప్రసక్తే తలెత్తదన్న వివరణ మాత్రం సైరస్ కార్యాలయంనుంచి వెలువడింది. 150 ఏళ్ల టాటా మహా సామ్రాజ్యంలో ఇలాంటి పరిణామం కనీవినీ ఎరుగనిది. ఆ మాటకొస్తే టాటా వంటి సంస్థకు బయటి వ్యక్తి సారథ్యంవహించడాన్ని సైతం ఎవరూ ఊహించలేదు. అందుకే 2011లో సైరస్ను రతన్ టాటా తన వారసుడిగా ప్రకటించినప్పుడూ అందరూ ఆశ్చర్యపోయారు. అలాగని ఆయన పూర్తిగా బయటి వ్యక్తేమీ కాదు. డైరె క్టర్‌గా సంస్థలో అంతకు చాలాముందునుంచీ పనిచేస్తున్నారు. రతన్ వారసుడి అన్వేషణకు అయిదేళ్లక్రితం అయిదుగురు సభ్యుల ఎంపిక కమిటీని ఏర్పాటు చేసినప్పుడు ఆ కమిటీలో సైరస్ కూడా సభ్యుడే. చైర్మన్ పదవికి అర్హులైనవారి కోసం ఆ కమిటీ 15 నెలలు గాలించింది. ఆ ప్రక్రియ కొనసాగుతుండగానే సైరస్ దాన్నుంచి వైదొలగి తాను కూడా ఒక పోటీదారయ్యారు. కమిటీ ఏకగ్రీవంగా తీసు కున్న తుది నిర్ణయం సంగతలా ఉంచి, రతన్‌కి ఇష్టం లేకుండా ఇదంతా జరిగిందని ఎవరూ అనుకోలేరు. రతన్ 1991లో సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాక 21 ఏళ్లపాటు ఆ పదవిలో కొనసాగి తనదైన ముద్ర వేశారు. 2005లో ఆంగ్లో–డచ్ ఉక్కు కంపెనీ కోరస్‌ను కొనుగోలు చేయడం, మరో బహుళజాతి లగ్జరీ కార్ల సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను 2008లో సొంతం చేసుకోవడం, బ్రిటన్‌కు చెందిన టెట్లీ టీ సంస్థను చేజిక్కించుకోవడం వంటి సంచలన నిర్ణయాలతో సంస్థకు ఆయన అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొచ్చారు. అది మదుపుదారుల్లోనూ, వినియోగదారు ల్లోనూ సంస్థ మీదున్న విశ్వాసాన్ని మరింతగా పెంచింది. రతన్ టాటా దూకుడు ఒక్కటే కాదు...అప్పటి మార్కెట్ పరిస్థితులు కూడా అందుకు అనుకూలించాయి. ఈ నేపథ్యంలో దాన్ని నిలబెట్టడం సైరస్‌కే కాదు ఎవరికైనా పెను సవాలే. ఆయన దాన్ని సరైన స్ఫూర్తితో స్వీకరించి విజయం సాధించగలిగారా? అందుకు ఏదో ఒక జవాబునే చెప్పడం కష్టం. సైరస్ పదవి చేపట్టేనాటికి నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలుగా ఉన్న టాటా గ్రూపు విలువ ఇప్పుడు దాదాపు రెట్టింపైంది. ఇలాంటి పరిస్థితుల్లో సైరస్ విఫలమయ్యారని చెబితే అది అసత్యమవుతుంది. అదే సమయంలో గ్రూపులోని వివిధ సంస్థల పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. రతన్ టాటా హయాంలో విజయవంతమైనవిగా కనబడిన నిర్ణయాల్లోనే పెను ప్రమాదాలు పొంచి ఉన్నాయని అనంతరకాలంలో నిరూపణ అయింది. టాటా సంస్థల అప్పు 10 రెట్లు పెరిగింది. టాటా మోటార్స్ ఒక్కటే గత ఆర్ధిక సంవత్సరం అమ్మకాల్లో ప్రగతి సాధించింది. అది నమోదు చేసిన 5 శాతం వృద్ధిలో సింహభాగం జాగ్వార్ ల్యాండ్‌రోవర్ నికరమైన పనితీరు వల్లే సాధ్యమైంది. ఐటీ దిగ్గజం టీసీఎస్ ఆదాయంలో నిరుడు 7.1 శాతం వృద్ధి కనబడినా మొన్న జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో నమోదైన 3.4 శాతం వృద్ధి... అంతకు ముందు సంవ త్సరాల్లో ఇదే సమయానికి ఉన్న వృద్ధితో పోలిస్తే చాలా తక్కువ. పైగా గ్రూప్‌లో ఎప్పుడూ రెండో స్థానంలో ఉండే టాటా స్టీల్ అమ్మకాలు 16 శాతం మేర పడి పోయాయి. దాని అనుబంధ సంస్థ టాటా స్టీల్ యూరప్ భారీ నష్టాలు చవి చూస్తున్నదన్న కారణంతో సైరస్ అమ్మకానికి పెట్టారు. ఈ నిర్ణయాన్ని ఆర్ధిక నిపు ణులంతా ప్రశంసించారుగానీ... దాన్ని కొనే నాథుడే లేకుండా పోయాడు. వీటన్నిటికీ కేవలం సైరస్నే బాధ్యుణ్ణి చేయడం న్యాయం కాదు. యూరప్ లోనూ, ప్రత్యేకించి బ్రిటన్‌లోనూ నెలకొన్న ఆర్ధిక అనిశ్చితి, ఐటీ రంగ సంక్షోభం లాంటివి కూడా అందుకు దోహదపడ్డాయి. పైగా అనేక వివాదాలు సంస్థను చుట్టు ముట్టాయి. వాటి విషయంలో తీసుకున్న నిర్ణయాలు టాటా గ్రూప్ పేరుప్రతిష్టల్ని దెబ్బతీశాయన్న భావం ఏర్పడింది. జపాన్‌కు చెందిన డొకోమోతో తెగదెంపులు, తమకు 120 కోట్ల డాలర్లు చెల్లించాలన్న ఆ సంస్థ వ్యాజ్యం, టీసీఎస్ సంస్థపై వచ్చిన వ్యాజ్యంలో వంద కోట్ల డాలర్ల పరిహారం చెల్లించాలన్న కోర్టు ఆదేశాలు, యూపీలోని యూరియా ప్లాంట్ విక్రయం, ఇండొనేసియా బొగ్గు గని సంస్థలో 30శాతం వాటా అమ్మకం వగైరాలు టాటా గ్రూప్ పనితీరుపై సందేహాలు తీసు కొచ్చాయి. సంస్థను పటిష్టం చేయడానికి ఆయన వద్దనున్న వ్యూహాలేమిటన్నది ఎవరికీ అంతుపట్టలేదు. తనను అన్యాయంగా తొలగించారని, కనీసం నోటీసు కూడా ఇవ్వలేదని సైరస్ అన్నట్టు వార్తలొచ్చాయి. సైరస్ తీరు సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా లేదని అంటున్నవారు ఈ చర్యలోని సహేతుకతపై కూడా వివరణ నివ్వాల్సి ఉంటుంది. ఇందులో చట్టవిరుద్ధత ఏమీ లేదన్నది ముందూ మునుపూ కోర్టులో తేలితే తేలొచ్చు. కానీ ఆ పదవికి పోటీపడేవారిపై ఇది చూపగల ప్రభావం తక్కువేమీ కాదు. కార్పొరేట్ యుద్ధాలు ఎంత వేగంతో ప్రారంభమై విస్మయ పరుస్తాయో, అంతే త్వరగా చప్పున చల్లారి వింత గొలుపుతాయి. ఈ వివాదం సైతం న్యాయస్థానాల వరకూ పోకుండా సామరస్యపూర్వకంగా పరిష్కారమైతే అది అందరికీ మంచిది. -
మిస్త్రీ మిస్టరీ
-
రేపు ముంబై వెళ్లనున్న కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి కె.తారకరామారావు బుధవారం దేశ ఆర్థిక రాజధాని ముంబై వెళ్లనున్నారు. అక్కడ టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ సైరస్ పల్లోంజి మిస్త్రీతో మంత్రి కేటీఆర్ మే 27వ తేదీన భేటీకానున్నారు. వ్యాపార సంబంధ అంశాలపై వారు చర్చలు జరుపుతారని సమాచారం. -
'కేజీ టు పీజీ' ఉచిత విద్యకు సహకారం: టాటా
-
'కేజీ టు పీజీ' ఉచిత విద్యకు సహకారం: టాటా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పునఃనిర్మాణంలో టాటా గ్రూప్ సంస్థలు భాగస్వామ్యం కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. బుధవారం కేసీఆర్‌తో టాటా గ్రూప్ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ భేటీ అయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. పారిశ్రామిక, ఐటీ, విద్యా, మౌళిక సదుపాయాల కల్పనలో టాటా గ్రూప్ సహకారం తీసుకుంటాం అని అన్నారు. తమ సంస్థల అనుభవం, సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తామని కేసీఆర్‌కు టాటా గ్రూప్ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ హామీ ఇచ్చారు. కేజీ టు పీజీ ఉచిత విద్యా పథకానికి సహకారమందిస్తామన్నారు. మురికివాడలు లేని నగరంగా హైదరాబాద్‌ను మార్చేందుకు సహకారం అందిస్తామని మిస్త్రీ తెలిపారు.